ఎన్టీఆరేనా తెలుగువారి ఆస్తి…బాబును ఏకిపారేస్తున్నారు!

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎన్టీఆర్‌ను మ‌రోసారి చంద్ర‌బాబు పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. తెలుగు వారంటే కేవ‌లం ఎన్టీఆర్ మాత్ర‌మే అని, ఆయ‌న రాక ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గుర్తింపు, గౌర‌వం లేవ‌న్న‌ట్టు చంద్ర‌బాబు, ఎల్లో మీడియా…

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎన్టీఆర్‌ను మ‌రోసారి చంద్ర‌బాబు పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. తెలుగు వారంటే కేవ‌లం ఎన్టీఆర్ మాత్ర‌మే అని, ఆయ‌న రాక ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గుర్తింపు, గౌర‌వం లేవ‌న్న‌ట్టు చంద్ర‌బాబు, ఎల్లో మీడియా చిత్రీక‌రించ‌డంపై సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ….

“మహా నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు వచ్చేదాకా తెలుగు జాతి పోరాడుతుందని, ఆయనకు పురస్కారం సాధించి తీరతాం. ఎన్టీఆర్‌ వ్యక్తి కాదు శక్తి. తెలుగు జాతి ఉన్నంతవరకు, వారి గుండెల్లో ఉంటారు. పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ముందు, ఆయన తర్వాత తెలుగువారికి వచ్చిన గుర్తింపు గురించి అందరూ ఆలోచించాలి. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు భారతరత్న ప్రకటించారు. ఇదీ ఎన్టీఆర్‌ స్ఫూర్తి. తెలుగు జాతి ఆస్తి, వారసత్వం ఎన్టీఆర్‌. ఆ మూడక్షరాలు ఓ మహా శక్తి. ఆయన తెలుగు జాతికి స్ఫూర్తి. ఈనెల 28న ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రతి ఇంట్లో ఆయన ఫొటో పెట్టి నివాళులర్పించాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్ర‌బాబు మాట‌లు వింటుంటే అదృష్ట‌వ‌శాత్తు ఎన్టీఆర్ చ‌చ్చిపోయి బ‌తికార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు మాట్లాడేవారంద‌రికీ ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని, ఈ క్ర‌మంలో 56 రోజుల పాటు ఆమ‌ర‌ణ‌దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయి దేశంలోనే మొట్ట‌మొద‌టి భాషా ప్ర‌యుక్త రాష్ట్రం నెల‌కొల్ప‌డానికి కార‌ణ‌మైన పొట్టి శ్రీ‌రాములు తెలుగువారికి గుర్తింపు తీసుకురాలేదా?  ఆ మ‌హానుభావుడి ప్రాణ త్యాగానికి విలువ లేదా?

దేశంలో సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు, ఎన్నో పార్టీలను క‌లుపుకుని విజ‌య‌వంతంగా పాల‌న సాగించిన ప్ర‌ధాని పీవీ నర‌సింహారావు తెలుగువారి ఆస్తి కాదా? తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను మ‌ద్రాస్ నుంచి  హైదరాబాద్‌కు తీసుకొచ్చిన దివంగ‌త సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి తెలుగువాడు కాదా? ఎన్టీఆర్‌కు న‌టుడిగా కొత్త జీవితం ప్ర‌సాదించిన బి.నాగిరెడ్డి త‌దిత‌ర దిగ్గ‌జాలు తెలుగువారు కాదా?

తెలుగువాడంటే కేవ‌లం ఎన్టీఆర్ ఒక్క‌రేనా? ఆయనే కారణజన్ముడు, యుగపురుషుడు కూడానా? ఇలా ప్ర‌చారం చేస్తున్న‌దెవ‌రు? ఎవరేమిటి… ఎన్టీఆర్ బ‌తికుండ‌గానే ఆయనకు పిడికెడు అన్నం పెట్టనివారు,  ఆయనకు చొక్కాకు, ప్యాంటుకు తేడా తెలియని వాడ‌ని పదవిలో నుంచి కూల‌దోసిన వాళ్లు! అంతేకాదు, ఎన్టీఆర్‌ విలువల్లేని మనిషి అని ప్రచారం చేసిన వారు, – ఆయన బ్యాంకు అకౌంట్లు కూడా సీజ్ చేసి చావుకు కారణమైన వారంటూ చంద్ర‌బాబు, ఎన్టీఆర్ వార‌సుల‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో చాకిరేవు పెడుతున్నారు.

ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వాడి పనైపోయింద‌ని, వాడి పేరుతో ఉన్న పథకం పేరు కూడా మార్చేస్తానని చెప్పిన చంద్ర‌బాబు…. ఇప్పుడు యుగ‌పురుషుడు, శ‌క‌పురుషుడు అని పొగ‌డ్త‌లు కురిపిస్తున్నార‌ని దెప్పి పొడుస్తున్నారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, ఎన్టీఆర్‌పై ప్రేమ‌, గౌర‌వంతో కాద‌ని తెలుగు రాజకీయాల గురించి తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ బాగా అర్థ‌మ‌వుతోంద‌ని నెటిజ‌న్లు చీవాట్లు పెట్ట‌డం గ‌మ‌నార్హం.  

కేవ‌లం ఎన్టీఆర్ పేరు చెప్పుకుని నాలుగు ఓట్లు రాల్చుకుందామ‌నే తాప‌త్ర‌య‌మే త‌ప్ప‌, ఎన్టీఆర్ గురించి ఏ మాత్రం గౌర‌వం లేద‌ని వైశ్రాయ్ హోట‌ల్ ముందు చెప్పులు, రాళ్ల దాడి కంటే గొప్ప ఉదాహ‌ర‌ణ ఏం కావాల‌ని నిల‌దీస్తున్నారు. ఎవ‌రికీ ఏమీ తెలియ‌ద‌ని చంద్ర‌బాబు ఏవేవో చెబుతుంటార‌ని, కానీ జ‌నానికి అన్నీ తెలుస‌ని పేర్కొన‌డం విశేషం.  

స్వార్థపరులు మనుషుల్ని ప్రేమించర‌ని, తమకు ఏదైనా లాభం వ‌స్తుంద‌ని  అనుకుంటే ప్రేమించినట్లు నటిస్తార‌ని బాబుపై పంచ్‌లు విసర‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఎన్టీఆర్‌ను ఎంత ఎక్కువ త‌లుచుకుంటే, అంత‌గా చంద్ర‌బాబుకు నెగెటివ్ అవుతుంద‌ని ఇప్ప‌టికైనా టీడీపీ గ్ర‌హిస్తే మంచిద‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ రాముడైతే, చంద్ర‌బాబు రావ‌ణాసురుడు అవుతార‌ని తెలియ‌ని అమాయ‌క స్థితిలో టీడీపీ వుందా? అని దెప్పి పొడుస్తున్నారు.