విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అత్యుత్సాహంతో చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించి, వైసీపీ నేతలతో చీవాట్లు తిన్నారు. ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటులో రజనీకాంత్ పాత్ర ఏంటనేది వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ ఎఫెక్ట్‌తో ఏ ఒక్కరూ చంద్రబాబునాయుడిని పొగడలేదు. ఎన్టీఆర్‌ని కీర్తించడం వరకే పరిమితం కావడం గమనార్హం.
విజయవాడలో నిర్వహించిన శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ ప్రసంగిస్తూ చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడన్నారు. హైదరాబాద్‌ను హైటెక్ నగరంగా తీర్చిదిద్దాడన్నారు. చాలా కాలం తర్వాత ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించానని, న్యూయార్క్‌లో ఉన్నానా? లేక హైదరాబాద్‌లో ఉన్నానా? అనే అనుమానం కలిగిందన్నారు. ఇలా నగరం రూపుదిద్దుకోడానికి చంద్రబాబే కారణమన్నారు. 2024లో చంద్రబాబు గెలిస్తేనే దేశంలో ఏపీ నంబర్ 1 కావడం గ్యారెంటీ అని ఆయన అన్నారు. అలాగే చంద్రబాబును ఎన్టీఆర్ ఆత్మ దీవిస్తుందనే కామెంగ్స్ రాజకీయ దుమారం రేపాయి.
రజనీకాంత్‌కు ఏమీ తెలియకుండానే చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో చంద్రబాబు పక్కన రజనీకాంత్ ఉన్న ఫొటోలను వైసీపీ బయటపెట్టి ఓ ఆట ఆడుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖులెవరూ టీడీపీ ఆశించిన రీతిలో చంద్రబాబుపై పొగడ్తలు కురిపించకపోవడం గమనార్హం.
దీనంతటికి విజయవాడలో రజనీకాంత్ ప్రసంగం ఎఫెక్టే అని అంటున్నారు. నిన్నటి సభలో సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి డి.రాజా, హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సొంత పార్టీ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్, ప్రముఖ దర్శకుడు, నటుడు నారాయణమూర్తి, హీరో వెంకటేశ్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, యువ హీరో రాంచరణ్, అక్కినేని వారసులు సుమంత్, నాగచైతన్య, హీరో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్, మహా నటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, రోజారమణి, జయప్రద, జయసుధ, విజయా విశ్వనాథ్ తదితరులు హాజరైనప్పటికీ, చాలా జాగ్రత్తగా మాట్లాడారు.
ఎన్టీఆర్ నటన, రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్పడం వరకే పరిమితం అయ్యారు. అంతే తప్ప, చంద్రబాబునాయుడి గురించి రజనీకాంత్‌లా ఎవరూ మాట్లాడకపోవడం టీడీపీ నేతల్ని నిరాశపరిచింది. నిజానికి పేరుకు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలే అయినా, టీడీపీ లక్ష్యం రాజకీయంగా సొమ్ము చేసుకోవడమే.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానన్న చెడ్డపేరును పోగొట్టుకునేందుకు చంద్రబాబు మార్క్ గిమ్మిక్కులుగా ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్‌పై వైసీపీ రాజకీయ దాడి బాగా పని చేసిందని నిన్నటి శత జయంతి వేడుకలో ప్రముఖుల ఉపన్యాసాలు వింటే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తనను అందరూ ప్రశంసించాలన్న కోరిక నెరవేరలేదు.