క‌ర్ణాట‌క ఫ‌లితం.. జాతీయ రాజ‌కీయాల‌పై ప్ర‌భావ‌మెంత‌?

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల త‌తంగం ఆస‌క్తిదాయ‌క‌మైన ఫ‌లితంతో ముగిసింది. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు క‌న్న‌డీగులు. అది కూడా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ త‌నే సీఎం అభ్య‌ర్థిని అనేంత స్థాయిలో ప్ర‌చారం చేసినా,…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల త‌తంగం ఆస‌క్తిదాయ‌క‌మైన ఫ‌లితంతో ముగిసింది. కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీతో అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు క‌న్న‌డీగులు. అది కూడా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ త‌నే సీఎం అభ్య‌ర్థిని అనేంత స్థాయిలో ప్ర‌చారం చేసినా, 15 రాష్ట్రాల సీఎంలు, ఇర‌వై ఐదు మంది కేంద్ర‌మంత్రులు, క‌మ‌లం పార్టీ మూల‌విరాట్ లంద‌రూ క‌ర్ణాట‌క‌లో క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం మాత్రం కాంగ్రెస్ వైపు నిలిచింది. 

లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో క‌న్న‌డ‌నాటి ఫ‌లితం ఆస‌క్తిదాయ‌కంగా నిలుస్తోంది. ఈ ప్ర‌భావం లోక్ స‌భ ఎన్నిక‌లపై ఎలా ఉంటుంద‌నేదే ఆస‌క్తిదాయ‌క‌మైన విశ్లేష‌ణ‌. అయితే క‌ర్ణాట‌క ఫ‌లితంతో బీజేపీ ప‌ని దేశంలో అయిపోయింద‌నో, లేక క‌ర్ణాట‌క ఫ‌లితంతో నిమిత్తం లేకుండా బీజేపీ రేప‌టి ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ స్వీప్ చేస్తుంద‌నుకోవ‌డమో రెండూ కూడా నిజాలు కావు. క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో బీజేపీకి ప్ర‌జ‌లు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇంకెన్నాళ్ల పాటో మాట‌లు చెబుతూ రోజులు గ‌డ‌ప‌లేర‌ని ప్ర‌జ‌లు దేశం మొత్తం త‌ర‌ఫునా బీజేపీకి వార్నింగ్ బెల్ కొట్టారు! ఇది మాత్రం భ‌క్తులు కూడా ఒప్పుకోవాల్సిన వాస్త‌వం.

ప‌దేళ్ల నుంచి ఏం చెబుతున్నారో.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ అగ్ర‌నేత‌లు అదే చెప్పారు! హిందూమ‌తం ప్ర‌మాదంలో ఉంద‌ని, కాబ‌ట్టి.. అధికారం త‌మ‌కు అప్ప‌గించాల‌నేది బీజేపీ సిద్ధాంతం. మ‌రి తమ చేతిలో దాదాపు ప‌దేళ్లుగా అధికారం ఉన్నా.. ఇంకా హిందూమ‌తం ప్ర‌మాదంలోనే ఉంద‌ని ఎలా చెబుతారో మ‌రి! బీజేపీ ఎన్నేళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటే.. అన్నేళ్లూ హిందూమ‌తం ప్ర‌మాదంలో ఉంద‌నే చెబుతూ ఉంటారు. 

ఇలా చెప్పి ఓట్లు పొందాల‌నేది బీజేపీ రాజ‌కీయ వ్యూహం. క‌ర్ణాట‌క‌లో బీజేపీది మ‌రో అజెండా ఏమీ లేదు. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు అనేది ఉత్తుత్తి మాట‌. రెండో మాట మాత్రం.. మాకు అధికారం ఇస్తే ముస్లింలో పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వు, వీలైనంత‌గా మైనారిటీల పీచ‌మ‌ణుస్తూ ఉంటాం అనే నినాద‌మే బీజేపీ నేత‌ల ఎన్నిక‌ల ప్రచారం అయ్యింది. అయితే స‌గ‌టు పౌరుడు ఏం కోరుకుంటున్నాడ‌నేది బీజేపీ నేత‌లు ప‌ట్టించుకోవ‌డం మానేసి చాలా కాలం అయ్యింది!

మ‌రి రేపు లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో కూడా బీజేపీ రామ‌మందిరం నిర్మిస్తున్నాం, ఆర్టిక‌ల్ 370 రద్దు చేశాం, హిందూమ‌తం ఇంకా ప్ర‌మాదంలోనే ఉంది కాబ‌ట్టి ఇంకోసారి కూడా మాకే అధికారం ఇవ్వండి అంటూ చెబితే.. ప్ర‌జ‌ల‌కు విసుగు వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఉత్త‌రాదిన కూడా బీజేపీని ఇంకా ప్ర‌జ‌లు నెత్తినేమీ పెట్టుకోలేదు. బిహార్ లో బీజేపీని చిన్న పార్టీని చేసి నిల‌బెట్టారు. యూపీలో రెండోసారి యోగి ప్ర‌భుత్వానికి సీట్ల కోత పెట్టారు. పంజాబ్ లో ప‌రువు ద‌క్క‌లేదు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లు ఓడించినా బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. 2014 నాటి ప‌రిస్థితులు అయితే అక్క‌డ కూడా ఏమీ లేవు. మోడీ మానియా ముగింపు అంకంలో ఉన్న‌ట్టుంది. అన్నింటికీ మించి త‌ను సాధించిన ప్ర‌గ‌తిని చెప్పి మోడీ రేపు ఎన్నిక‌ల్లో ఓటు అడిగితే అది విజ‌యం అవుతుంది కానీ, క‌శ్మీరీ ఫైల్స్, కేర‌ళ స్టోరీ వంటి సినిమాల పేర్లు చెప్పి ఓటు అడిగితే మాత్రం.. రాజ‌కీయంగా బీజేపీ ప‌త‌నం అక్క‌డితో మొద‌లైన‌ట్టే. అలాంటి సెంటిమెంట్లు, ఎమోష‌న్ల‌తో ఇంకోసారి కూడా క‌మ‌లం కేంద్రంలో అధికారం పొందితే పొంద‌వ‌చ్చు కూడా! అయితే.. ఇంకా అవే క‌బుర్లే చెబుతుంటే మాత్రం.. ప్ర‌జ‌లు క‌మ‌లం పార్టీకి క్రమేపీ దూరం కావ‌డ‌మే మొద‌ల‌వుతుంది. క‌ర్ణాట‌క కూడా ఒక మినీ ఇండియానే. కాబ‌ట్టి.. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో చెల్ల‌ని కాసు రేపు దేశంలో ఎక్క‌డా చెల్ల‌క‌పోవ‌చ్చు!

అయితే లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇలా ఉండ‌క‌పోవ‌చ్చు అనే విశ్లేష‌ణా చేయ‌ద‌గిన‌దే. ఇదే క‌ర్ణాట‌క‌లో గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ స్వీప్ చేసింది. పాతిక సీట్ల‌కు గానూ కాంగ్రెస్ ఒక‌టి, జేడీఎస్ ఒక‌టి, మండ్య‌లో బీజేపీ మ‌ద్ద‌తిన‌చ్చిన ఇండిపెండెంట్ సుమ‌ల‌త నెగ్గారు. మిగిల‌న‌వ‌న్నీ క‌మ‌లం పార్టీకే ద‌క్కాయి. అప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో కూడా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూసుకుంటే కాంగ్రెస్ కు 80 సీట్ల‌లో  మెజారిటీ ద‌క్కింది. జేడీఎస్ కు 37 సీట్లలో మెజారిటీ వ‌చ్చింది. అయితే 22 ఎంపీ సీట్లు బీజేపీ నెగ్గింది. 

మ‌రి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూడా ఇలాగే జ‌రుగుతుంద‌ని మాత్రం క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. కాంగ్రెస్ కు గ‌తంతో పోలిస్తే పూర్తి మెజారిటీ వ‌చ్చింది. కాంగ్రెస్ విజేత మెజారిటీలు పెరిగాయి. అన్నింటికీ మించి.. దాదాపు ఏడాది కింద‌ట ఒక ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగితే బీజేపీ త‌న సిట్టింగు సీటును కేవ‌లం ఐదు వేల మెజారిటీతో ద‌క్కించుకుంది. కాంగ్రెస్ ఇదే రీతిన క‌ష్ట‌ప‌డితే.. బీజేపీకి 22 ఎంపీ సీట్లున్న క‌ర్ణాట‌క‌లో దెబ్బే ప‌డొచ్చు. బీజేపీకి త‌నే ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయంగా ఉన్న క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ఎంపీ సీట్ల‌ను సాధించుకుని .. ఇదే రీతిన ఇత‌ర రాష్ట్రాల్లోనూ క‌ష్ట‌ప‌డితే జాతీయ స్థాయిలో మ‌రింత‌ గ‌ట్టి ప్ర‌తిప‌క్షంగా నిలిచే అవ‌కాశాలూ పుష్క‌లంగా ఉన్నాయి.