గత నాలుగేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతాల్లో ఒకటి.. క్యాడర్ ను దెబ్బతీసుకోవడం! సరిగ్గా ఐదేళ్ల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో క్యాడర్ తిరుగులేని రీతికి చేరింది. కాంగ్రెస్ ను వీడి వైఎస్ జగన్ బయటకు వచ్చాకా అతడిని అనుసరించిన కాంగ్రెస్ క్యాడర్.. 2014 నాటికి పూర్తి స్థాయిలో అయితే పని చేయలేదు. సంస్థాగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో లోటుపాట్లు 2014 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి.
సూటిగా చెప్పాలంటే 2014 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రూపుకు రాలేదు! దానికి అనేక కారణాలు. అదంతా వేరే సంగతి. అయితే 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకం అయ్యింది. ఎంతలా అంటే.. ప్రతి పోలింగ్ బూత్ లెవల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మంది బాధ్యులు ఏర్పడ్డారు. పంచాయతీ వార్డుల స్థాయిలో, మారుమూల గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నిర్మాణం కుదిరింది. అది కుదరడానికి సమయం పట్టింది. 2019 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కుదిరాయి. మరి దాన్ని అస్థిరపరుచుకోవడానికి జగన్ కు కానీ, ఆయన పార్టీ తారాగణానికి కానీ పెద్ద సమయం పడుతున్నట్టుగా లేదు.
పార్టీ క్యాడర్ అనే పదానికి విరుద్దంగా సాగుతున్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు. ప్రత్యేకించి అధికారం అందిన దగ్గర నుంచి. నాలుగేళ్ల పాలనలో జగన్ వేసిన అనేక అడుగులు పార్టీ నిర్మాణానికి వ్యతిరేకంగానే ఉండటం గమనార్హం. పార్టీ కేడర్ ను పట్టించుకోకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇస్తున్న వ్యూహాలను అమలు పరిచే ప్రయత్నాలేవో ఇప్పుడు చేస్తున్నారు.
అయితే క్యాడర్ సహకారం లేకుండా.. క్యాడర్ ను విస్మరిస్తే ఏ పీకే వ్యూహాలూ ఫలించవు! ఐప్యాక్ ఎన్ని వ్యూహాలను రచించినా, ఎన్ని నినాదాలను గోడల మీదకు ఎక్కించినా.. అవి ప్రజల్లోకి ఎక్కాలంటే క్యాడర్ మాత్రమే దిక్కు. దాన్ని విస్మరించి జగన్ చేసే ఏ పని అయినా నేల విడిచి సాము చేసినట్టుగానే ఉంటుంది.
మరో విషయం ఏమిటంటే.. క్యాడర్ అంటే ఏదో అయాచితంగా పని చేయదు. దాని ఆశలు కూడా దానికి ఉంటాయి. ఈ క్యాడర్ లో రకరకాల ఆశలతో పని చేసే వారు అంటారు. కొందరికి అత్యాశలు కావొచ్చు. కొందరివి తీరగల ఆశలు కావొచ్చు. వైఎస్ జగన్ పాలనలో క్యాడర్ నూటికి వంద శాతం కూడా నిర్వేదంతోనే ఉండటమే అసలైన విశేషం.
జగన్ అధికారంలోకి వచ్చాకా రాజకీయ అవినీతి తగ్గుముఖం పట్టింది. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యేలు మాత్రం తమ తమ మార్గాల్లో యధేచ్ఛగా సంపాదించుకుంటూ ఉన్నారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలకు అయినా.. గత ఐదేళ్లలో వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎంత రాజకీయ అవినీతి లేదన్నా.. వారి వరకూ వారు మార్గాలను చూసుకున్నారు. మరి ఎమ్మెల్యేల కడుపు నిండింది. చంద్రబాబు తరహాలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి క్యాడర్ కు ఎడాపెడా దోచకునే అవకాశం ఇవ్వమని ఎవ్వరూ అనరు.
అయితే తన రాజకీయాన్ని నమ్ముకుని పని చేసిన క్యాడర్ కు జగన్ జవాబు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆయన జవాబులేమీ లేవు. దీంతో.. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ రాజకీయంలో మమేకం అయిన నూటికి 90 శాతం మంది కార్యకర్తలు ఇప్పుడు కామ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ రొమ్ములు విరుచుకు తిరిగే వారు ఇప్పుడు బైక్ ర్యాలీ అంటే.. పెట్రోల్ కు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అర్థం చేసుకోవాల్సిన వాస్తవం.
కాంగ్రెస్ హయాంలో అయినా, తెలుగుదేశం సమయంలో అయినా.. ఆ పార్టీ కార్యకర్త అంటే అదో మజా! డబ్బులు సంపాదిస్తారా, లేదా అనేది వేరే సంగతి. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం మాత్రం కార్యకర్తలను అంతర్థానం చేస్తోంది. అది కూడా సొంత పార్టీ కార్యకర్తలను! ఫలితం.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్త కనిపిస్తూ ఉన్నాడు. అవినీతే చేశారా, జేబులే నింపుకున్నారా, జన్మభూమి కమిటీలతో దోచుకున్నారా.. ఇవన్నీ తర్వాతి మాటలు.
అయితే తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారం సంపాదించుకుంటుందా లేదా అనే సంగతిని కూడా పక్కన పెట్టి.. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం తమ పని తాము చేస్తోంది. సాదారణంగా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా పని చేయాలి. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తాము ప్రతిపక్షంలో ఉండగా 2019 ఎన్నికల్లో పని చేసిన ఉత్సాహంలో వందో వంతు ఉత్సాహంతో కూడా ఇప్పుడు లేదు! ఇందుకు కారణం ఏమిటంటే.. నిస్సందేహంగా వేళ్లు జగన్ వైపే చూపొచ్చు! సొంత పార్టీ క్యాడర్ ను హరించుకుంటున్న ఏకైక లీడర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విశ్లేషించవచ్చు!
మరి ఇది జగన్ ను అధికారం నుంచి దించేస్తుందా లేదా.. అనేది వేరే సంగతి. ఇప్పుడైతే జగన్ కు ఇబ్బంది లేదు. అధికారం ఉంది, వాస్తవాలను అర్థం చేయనివ్వదు. తను చేసేదంతా రైటే అని పిస్తుంది. ప్రజలు తనను గుర్తు పెట్టుకోవాలి తప్ప వీధి చివర తమకు అండగా నిలబడగల తమ పార్టీ కార్యకర్తను కాదని జగన్ అనుకోవచ్చు. డైరెక్టు గా జగన్ టు జనం, జనం టు జగన్ అని అనుకోవచ్చు. మరి ఇది వర్కవుట్ అయితే జగన్ కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించినట్టే! అయితే.. తనను చూసేసి ఓటేయాలన్న మోడీకి కర్ణాటకలో ప్రజలు చుక్కలు చూపి పంపించారు!
కర్ణాటక నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠం!
మోడీ సభలకు జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. మోడీ ర్యాలీలు సూపర్ హిట్ అయ్యాయి. ఏజెన్సీలు అన్ని ఏర్పాట్లూ చేశాయి. ప్రజలు పూలు చల్లి మోడీకి స్వాగతం పలికారు. బెంగళూరు మహానగరంలో ట్రాపిక్ ఆంక్షలు ఏర్పాటు చేసి, జనాలను ఉక్కిరిబిక్కిరి చేసి సైతం బీజేపీ వాళ్లు పాతిక కిలోమీటర్లకు పైన మోడీ ఎన్నికల ర్యాలీని విజయవంతం చేశారు. ప్రత్యర్థులు హడలిపోయేలా మోడీ ఎన్నికల ప్రచారం జరిగింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారం అంటే మోడీ కనిపించారు తప్ప మరెవ్వరూ కాదు! ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కాదు, మీ ఎమ్మెల్యే ఎవరనేది కాదు.. వారెవరైనా తనను చూసే ఓటేయాలన్నట్టుగా మోడీ ప్రచారం జరిగింది. అయితే మోడీని జనాలు నమ్మలేదు. తమకు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు తప్ప.. ప్రధానే అంతా తానైతే ఉపయోగం లేదనుకున్నారు. మోడీని చూసి కర్ణాటక ముఖ్యమంత్రిని వారు ఎన్నుకోలేదు. మోడీ మోడీనే.. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రే! మరి జగన్ కూడా ఇందులోంచి ఎంతో కొంత నీతి నేర్చుకోవచ్చు.
రేపటి ఎన్నికల్లో జగన్ ను చూసి మాత్రమే జనాలు ఓటేయరు. క్షేత్ర స్థాయి అంశాలు బొచ్చెడు ఉంటాయి. ఎమ్మెల్యేల పనితీరు, తమకు అందుబాటులో ఉండే వ్యవహారం. క్షేత్ర స్థాయిలో పాలన జరిగే తీరు.. ఇదంతా జనాలు పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి మొహంతో ఓటేసే వారు 50 శాతం అయితే, లోకల్ గా జరిగేది మరో యాభైశాతం ప్రభావితం చేస్తుంది. మరి ప్రధాని మొహం చూసి ముఖ్యమంత్రిని ఎన్నుకోలేదు. మరి జగన్ ను చూసి క్షేత్ర స్థాయి అంశాలన్నీ చెరిగిపోవు.
ప్రత్యేకించి జగన్ సీఎం కావడం వల్ల తమకు ఒరిగేందేమీ లేదని పార్టీకి కీలక ప్రాంతం అయిన రాయలసీమలోని క్యాడరే బాహాటంగా వ్యాఖ్యానించగలుగుతోంది! తెలుగుదేశం అంటే అణుమాత్రమైనా నచ్చని, చంద్రబాబును అసహ్యించుకుని, దశాబ్దాలుగా తెలుగుదేశం వ్యతిరేకంగా, కాంగ్రెస్- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నిలిచిన వారే.. ఇప్పుడు జగన్ సీఎం కావడం వల్ల తమకు ఒరిగిందేమీ లేదనే భావనలో ఉన్నారు. ఇదీ క్యాడర్ పరిస్తితి.
అయితే ఇదంతా జగన్ కు తెలియనిదేమీ కాకపోవచ్చు. అయితే తను జనం, దేవుడిని నమ్ముకున్నట్టుగా జగన్ చెబుతూ ఉన్నారు. అంటే మధ్యలో క్యాడర్ కూడా లేనట్టే. మరి రేపు ఎన్నికల్లో జగన్ గెలిచినా, ఓడినా జనం, దేవుడే చూసుకోవాలి తప్ప కార్యకర్తలు కాదని జగన్ స్వయంగా చాలా సార్లు తన సందేశాన్ని ఇచ్చారు.
నాయకత్వం నిలిచేది క్యాడర్ మీదే!
తమ పార్టీ నేత తప్పు చేసినా ఒప్పే అన్నట్టుగా నిలిచేది కేవలం క్యాడర్ మాత్రమే! కేవలం క్యాడర్ ఉండే నమ్మకం, క్యాడర్ చూపే విశ్వాసం, క్యాడర్ చూపించే విధేయతే ఆధారంగా దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తూ ఉన్నాయి. అధికారం అందకపోయినా.. క్యాడర్ అండదండలతోనే ఉనికి కోల్పోకుండా సాగుతున్న పార్టీలున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, టీడీపీ, జేడీఎస్, ఆర్జేడీ.. ఇవన్నీ ఇలాంటి క్యాడర్ పట్టుగొమ్మలుగా సాగుతున్న పార్టీలే.
పదేళ్ల పాటు అధికారం అందకపోయినా.. నిర్విరామంగా కష్టపడే క్యాడర్ ను కలిగి ఉన్న పార్టీలివి. నాయకత్వం చేసే పొరపాట్లు, తప్పులను కూడా సమర్థించే క్యాడర్ ఉన్న పార్టీలివి. కమ్యూనిస్టులకు ఎక్కడా అధికారం లేకపోయినా.. ఇంకా ఆ పార్టీల అధినేతలు వార్తల్లో ఉన్నారంటే దానికి కారణం అణువంత అయినా ఉన్న క్యాడరే తప్ప మరో కారణం లేదు! పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ విలువ బయటి వారికి అర్థం కాకపోవచ్చు. అధినేతలకూ వారు భారంగానే కనిపించవచ్చు.
అయితే ఏ పార్టీ అయినా ఉనికిలో ఉందంటే మాత్రం దానికి ఆ పార్టీ ఏర్పరుచుకున్న వ్యవస్థ, క్యాడర్ కీలకం. అయితే ఈ రెండింటి విషయంలోనూ జగన్ వైఫల్యం కొట్టుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పరుచుకోవడంలో జగన్ వైఫల్యం రెండో భాగం. అయితే మరి ఏ గ్రహచారమో సరిగా లేక రేపు అధికారం చేజారితే.. జగన్ తను ఇప్పుడు సాగిస్తున్నాననుకుంటున్న కార్పొరేట్ రాజకీయం ఆయన పార్టీనే దారుణంగా దెబ్బతీస్తుంది. వెంట నిలిచే కార్యకర్తను కోల్పోతే ఆ పార్టీ అయినా ఆఫీసులను కూడా మూసేసుకోవాల్సిందే.
జగన్ ఏమీ సినిమా హీరో రాజకీయం చేయడం లేదు. ప్రజారాజ్యం, జనసేన, కమల్ హాసన్ పెట్టిన పార్టీ వంటి వాటికి స్థిరంగా నిలిచే క్యాడర్ తో పని లేదు. అవి ఎన్నికల ముందు వస్తాయి, ఎన్నికలయిపోయాకా .. షూటింగుల్లోకి వెళ్లిపోతాయి. అయితే ఎన్నికలతో సంబంధం లేకుండా జగన్ రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే.. క్యాడర్ సహకారమే కీ. మరి క్యాడరే అవసరం లేదు.. అంతా దేవుడు చూసుకుంటాడనుకుంటే మాత్రం అది జగన్ స్వయంకృతమే.
ప్రయత్నం చేయని వారిని దేవుడు రక్షిస్తారని ఏ దేవుడు కూడా చెప్పలేదు! ఆఖరికి పార్టీ అధికారం లోకి వచ్చాకా.. కాంట్రాక్టు పనులు చేసిన కార్యకర్తలకు ఆ బిల్లులను పెండింగ్ లో పెట్టారంటూ.. సంవత్సరాలు గడిచిపోతున్నా.. తాము కాంట్రాక్టులకు వెచ్చించిన మొత్తంపై వడ్డీలను కట్టుకోలేక చస్తున్నామంటూ కార్యకర్తలే వాపోతున్నా పట్టించుకోని ధోరణిలో జగన్ పాలన సాగుతుందన్న విషయం విస్మయాన్నే కలిగిస్తుంది. పార్టీ కార్యకర్త ఎవరో జగన్ మరిచిపోయినట్టుగా ఉన్నారు.
ఇప్పటికే చేతులైతే కాలుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు పోవడం కూడా క్యాడర్ నిస్తేజానికి నిదర్శనం. తమను పట్టించుకోని జగన్ ను తామెందుకు పట్టించుకోవాలనే ధోరణి ఇప్పటికే మొదలైంది. జై జగన్ అని గొంతు అరిగేలా నినదించిన గొంతులు కూడా ఇప్పుడు మొహం చాటేస్తున్నాయి.
జగన్ అమలు పరిచే సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి వాటి సంగతెలా ఉన్నా… పార్టీకి అఖండమెజారిటీ దక్కిన 2019 ఎన్నికలకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2024 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రం క్యాడర్ లో అందులో పదోవంతు ఊపు కూడా లేదు. ఇది నిష్టూరమైన సత్యం.
-జీవన్ రెడ్డి.బి