నామమాత్రపు పార్టీకి సీఎం అభ్యర్థి అట !

మన దేశంలో ఉన్నన్ని రాజకీయ పార్టీలు మరో దేశంలో ఉన్నాయో లేదో తెలియదు. కొన్ని గుర్తింపు పొందిన పార్టీలు ఉంటే, కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. గుర్తింపు పొందిన పార్టీల్లో కూడా ఎప్పుడూ యాక్టివ్…

మన దేశంలో ఉన్నన్ని రాజకీయ పార్టీలు మరో దేశంలో ఉన్నాయో లేదో తెలియదు. కొన్ని గుర్తింపు పొందిన పార్టీలు ఉంటే, కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. గుర్తింపు పొందిన పార్టీల్లో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పార్టీలు, ఎప్పుడో ఒకప్పుడు అధికారంలోకి రాగాల పార్టీలు ఉంటాయి. ఇలాంటి పార్టీల సంఖ్య తక్కువ. ఎక్కువ సంఖ్యలో నామమాత్రపు పార్టీలు ఉంటాయి.

ఇవి కేవలం కాగితం మీద పార్టీలే. ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. ఎన్నికల్లో పోటీ చేయడం ఉండదు. కానీ ఈసారి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రపు పార్టీలు కొన్ని పోటీ చేయాలని అనుకుంటున్నాయి. ఇలాంటి పార్టీలు పోటీ చేయడంవల్ల ఓట్లు చీలిపోవడం తప్ప ఉపయోగం  లేదు.

ఓ నామమాత్రపు పార్టీ తరపున పోటీచేస్తున్న ఓ నాయకుడు (నాయకుడు అని కూడా అనలేం) ఆ పార్టీ తరపున తానే సీఎం అభ్యర్థిని అంటున్నాడు. ఆయన తెలంగాణలో చాలా పాపులర్ పర్సన్. కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి. ఆ పార్టీ ఏమిటో, ఆయన ఎవరో చూద్దాం. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో ఉంటానని.. అది కూడా మేడ్చెల్ నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని ముందు నుంచి చెప్తూ వస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటివరకు స్పష్టం చేయలేదు.

అయితే.. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని కొన్ని రోజులు.. లేదా కాంగ్రెస్ తరపున బరిలో దిగుతారంటూ మరికొన్ని రోజులు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగినా కాంగ్రెస్ మద్దతు ఉంటుదని కొన్ని రోజులు.. పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కట్ చేస్తే.. అవేవీ కాకుండా.. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారని ఓ క్లారిటీ వచ్చింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి కూడా తీన్మార్ మల్లన్నే అని పార్టీ వర్గాలు ప్రకటించాయి. మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తీన్మార్ మల్లన్న ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు.

అయితే.. ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్న మల్లన్న.. కాంగ్రెస్ మద్దతు కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హస్తం నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే.. ఎలాంటి నిర్ణయం రాకపోవటంతో.. ఆ మ్యాటర్ అక్కడితోనే ఆగిపోయింది. ఇక ఈ క్రమంలోనే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని తీన్మార్ మల్లన్న సంప్రదించారు.

ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో సమావేశమైన మల్లన్న.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లోతుగా చర్చించారు. అయితే.. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న బృందానికి పార్టీ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ఇదే అంశంపై పార్టీ తరపున మరిన్ని సమావేశాలు నిర్వహించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పని తీన్మార్ మల్లన్న భుజస్కందాలపైనే పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తీన్మార్ మల్లన్ననే సొంతంగా ఒక పార్టీ పెట్టేందుకు కసరత్తు చేశారు.

ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు కూడా. కానీ.. కొన్ని లీగల్, టెక్నికల్ అంశాలు పెండింగ్‌లో ఉండటంతో.. దానికి గుర్తింపు లభించి.. ఆ పార్టీ తరపునే పోటీ చేయడానికి వీలయ్యే అవకాశం లేదు. దీంతో.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫునే బరిలోకి దిగేందుకు మల్లన్న టీం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య ఎక్కువగానే ఉంది.

కమ్యూనిస్టులు, తెలంగాణ జన సమితి, వైఎస్సార్‌ టీపీ, టీడీపీ, బీఎస్పీ, జనసేన, కేఏ పాల్‌ ప్రజాశాంతి పార్టీల పరిస్థితి అయోమయంగానే ఉంది. ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పోటీ చేయని స్థానాల్లో ఎవరికి మద్దతిస్తారనే దానిపైనా క్లారిటీ లేదు.

మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ టీపీ విలీనం గురించి చర్చలు, మంతనాలు జరిగినా పలు సమీకరణాల రీత్యా అది వాయిదా పడుతూ వస్తోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో  వెళుతున్నారు. మిగతా పార్టీలు నామమాత్రంగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.