వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో వైసీపీ శ్రేణులు జనంలోకి వెళ్లి, మరోసారి వారి ఆశీస్సులు కోరాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. గ్రామ పెద్దల్ని కలిసి, మరోసారి వైసీపీ ఎందుకు అధికారంలోకి రావాలో వివరించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాత్రం జగన్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ వస్తోంది.
ప్రజాదరణ కలిగిన సొంత పార్టీ నేతల్ని కూడా ఆయన దూరం చేసుకునేలా నియంతృత్వ పోకడలతో నడుచుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రొద్దుటూరులో మొత్తం 41 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో టీడీపీకి ఒకే ఒక కౌన్సిలర్ ఉన్నారు. మిగిలిన వారంతా వైసీపీ కౌన్సిలర్లే. ఇందులో రాచమల్లుకు నమ్మకమైన వారిగా ఆయన భార్య రమాదేవి, బామ్మర్దులు పాతకోట బంగారురెడ్డి, పాతకోట వంశీధర్‌రెడ్డి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, వరికూటి ఓబుల్‌రెడ్డి, కాకర్ల నాగేశషారెడ్డి (ఈయన భార్య కౌన్సిలర్), గరిశపాటి లక్ష్మిదేవి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కుమార్తె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కుమార్తెపై గరిశపాటి నోరు పారేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో గరిశపాటిపై కూడా ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
మిగిలిన కౌన్సిలర్లలో కొందరు బాహాటంగా వ్యతిరేకత ప్రదర్శించగా, మరికొందరు తామరాకుపై నీటి బొట్టులా వ్యవహరిస్తు న్నారు. ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. ఇక ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, ప్రొద్దుటూరు మున్సిపల్ వార్డు సభ్యులు మురళీధర్‌రెడ్డి, రామంజనేయరెడ్డి తదితర నాయకులు ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. వీరికి ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తోడయ్యారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఎంత మంది వ్యతిరేకులు ఉన్నారో, అంతే సంఖ్యలో వైసీపీలో ఎమ్మెల్యే తనకు వ్యతిరేకులుగా తయారు చేసుకున్నారు. వీరంతా వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల అభిమానులు కావడం గమనార్హం.
ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీ. ఇక్కడి నుంచి సర్పంచ్‌గా వైఎస్సార్ కుటుంబ అభిమాని, వైసీపీ నేత కొనిరెడ్డి శివచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ పంచాయతీలోని కొన్ని వార్డులు ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో ఉన్నాయి.
ఈ పంచాయతీలో 24 వేల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల సంఖ్యను చూస్తే చాలు…ఈ పంచాయతీకి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత ప్రాధాన్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీకి చెందిన సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రంగా ఇబ్బందులపాలు చేయడం చర్చనీయాంశమైంది. చివరికి తనకు తెలియకుండా పంచాయతీ సమావేశ ఎజెండాను తయారు చేయడాన్ని నిరసిస్తూ … సర్పంచ్, ఉపసర్పంచ్‌లతో పాటు కొందరు వార్డు సభ్యులు సమావేశాన్ని మంగళవారం బహిష్కరించారు.
ఇలా ఎక్కడైనా వుంటుందా? అని ఆయన ఎమ్మెల్యేని నిలదీశారు. ఎమ్మెల్యే రాచమల్లు మాటల్లో నీతి సూక్తులు కోటలు దాటుతుంటాయి. ఆచరణకు వచ్చే సరికి, కనీసం పది శాతం కూడా ఆచరరించరని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నిలకు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కర్నీ కలుపుకెళ్లాల్సింది పోయి, సొంత పార్టీ నాయకుల్ని వేధించడం ఏంటని ప్రొద్దుటూరు వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి.
ఇటీవల ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడి మృతితో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థిపై సర్పంచ్ కుమారుడు గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యే పరువు పోయినంత పనైంది. అప్పటి నుంచి సర్పంచ్‌పై మరింత కక్ష పెంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఎమ్మెల్యేకు స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, అలాగే నలుగురైదుగురు ప్రొద్దుటూరు మున్సిపల్ వార్డు సభ్యులతో విభేదాలున్నాయి. మరికొందరు అధికార పార్టీ సభ్యులు ఎమ్మెల్యే వెంట నడుస్తున్నప్పటికీ, ఆయన తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ప్రొద్దుటూరు తాను, తన బామ్మర్ది బంగారు రెడ్డి తప్ప, మరెవరూ ఉండకూడదనే రీతిలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి వైఎస్సార్ కుటుంబ ఆశీస్సులున్నాయి. శివచంద్రారెడ్డి తన పంచాయతీ పరిధిలో ఐదారు కోట్ల పనులు చేయగా , ఎమ్మెల్యే బిల్లులు నిలిపివేశారు. ఈ విషయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జోక్యం చేసుకుని కొన్ని బిల్లుల్ని చేయించినట్టు సమాచారం. ఇటీవల పంచాయతీ కార్యదర్శిగా గురుమోహన్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే నియమించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఆదేశాలు తప్ప, ప్రభుత్వ నిబంధనలు తనకు పట్టవనే రీతిలో పంచాయతీ కార్యదర్శి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడనే విమర్శ వుంది.
కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని పార్టీ నుంచి పంపే దమ్ము ఎమ్మెల్యేకు లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే, శివచంద్రారెడ్డిని వైఎస్సార్ కుటుంబం ఎక్కువ నమ్ముతోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరులో మార్పు తీసుకురాకుండా వుంటే మాత్రం, వైసీపీకి కంచుకోట లాంటి ప్రొద్దుటూరులో ఆ పార్టీ మూల్యం చెల్లించుకోకతప్పదు. రానున్న ఎన్నికల్లో ప్రతి సీటూ ఇంపార్టెంట్. ఎమ్మెల్యే నియంతృత్వ ధోరణి మాత్రం… పార్టీ ఏమై పోయినా తన పంతం నెగ్గాలనే ధోరణితో అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
మరోసారి రాచమల్లు ఎమ్మెల్యేగా గెలిస్తే…మనమెవరమూ బతకలేమనే భయాందోళనను ఆయన సృష్టించారు. ఈ అభిప్రాయం మరింతగా బలపడితే మాత్రం… ఆ ప్రభావం కడప ఎంపీపై కూడా పడుతుందని హెచ్చరించక తప్పదు. ఒక్క ప్రొద్దుటూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
పీ.ఝాన్సీ