Advertisement

Advertisement


Home > Politics - Gossip

పురందేశ్వ‌రిని త‌ప్పించ‌నున్నారా?

పురందేశ్వ‌రిని త‌ప్పించ‌నున్నారా?

ఏపీ బీజేపీ చీఫ్‌గా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని త‌ప్పించ‌నున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానం బీజేపీ పెద్ద‌ల నుంచి వ‌స్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ అధ్య‌క్షుల మార్పులో భాగంగా ఈ ఏడాది జూలై మొద‌టి వారంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఏపీలో కూడా మార్పున‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ‌, ఏపీ బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్‌, సోము వీర్రాజుల‌ను త‌ప్పించి, వారి స్థానాల్లో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని నియ‌మించారు.

తెలంగాణ‌లో కిష‌న్‌రెడ్డి అక్క‌డి అధికార పార్టీకి , అలాగే తోటి ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆయ‌న‌కు బీజేపీలోని ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రిస్తున్నారు. కానీ ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి బీజేపీ అధిష్టానం ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షురాలిగా పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన మొద‌లు, త‌న పార్టీ కోసం కాకుండా, టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం మొద‌లు పెట్టారు.

త‌న తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీపై బీజేపీ అధ్య‌క్షురాలిగా మ‌మ‌కారం చూప‌డం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులెవ‌రికీ న‌చ్చ‌డం లేదు. చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఆమెలోని టీడీపీ భ‌గ్న ప్రేమికురాలు బ‌య‌టికొచ్చారు. పురందేశ్వ‌రికి చంద్ర‌బాబు మ‌రిది. అయితే రాజ‌కీయాలు, బంధుత్వాలు వేర్వేరు. సున్నిత‌మైన అంశాల్ని పురందేశ్వ‌రి ప‌ట్టించుకోలేదు. అవినీతి కేసులో బాబును అరెస్ట్ చేయ‌డం అన్యాయం, అక్ర‌మం అంటూ ఆమె అంద‌రికంటే ముందుగా గ‌గ్గోలు పెట్టారు.

అంతేకాదు, బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వ‌గా, దానికి ఆమె మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో బీజేపీ శ్రేణులు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఏపీ బీజేపీ నేత‌లెవ‌రితోనూ సంప్ర‌దించ‌కుండా టీడీపీ బంద్‌కు మ‌ద్ద‌తు ఎలా ఇస్తార‌ని నిల‌దీత ఎదురైంది. పురందేశ్వ‌రి నియంతృత్వ ధోర‌ణిపై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో, కేంద్ర పెద్ద‌లు త‌లంటారు. దీంతో టీడీపీ బంద్‌కు మ‌ద్ద‌తు అని త‌న పేరుతో ఫేక్ ప్ర‌క‌ట‌న ఇచ్చార‌ని ఆమె చెప్పుకోవాల్సి వ‌చ్చింది.

పురందేశ్వ‌రి ప్ర‌తి చ‌ర్య టీడీపీ, చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే ఉంద‌ని బీజేపీ నేత‌లు గుర్తించి, ఆమెకు దూరంగా వుంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న అతి త‌క్కువ కాలంలోనే పార్టీలో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకున్నారు. పురందేశ్వ‌రికి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టు ఆ పార్టీ నిజ‌మైన నాయ‌కులంతా ఆమెతో అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో త‌న‌కు పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల నుంచి స‌హాయ నిరాక‌ర‌ణ ఎదుర‌వుతోంద‌ని, ఇలాగైతే పార్టీని న‌డ‌ప‌లేని బీజేపీ పెద్ద‌ల‌తో కొంత కాలంగా ఆమె మొర‌పెట్టుకుంటున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెండు రోజుల క్రితం ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రితో స‌హా స‌గం మంది బీజేపీ నాయ‌కులంతా టీడీపీనే అని బ‌హిరంగంగా విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో పురందేశ్వ‌రి టీడీపీ కాదు, బీజేపీ నాయ‌కురాలే అని మ‌ద్ద‌తుగా ఏ ఒక్క‌రూ మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పురందేశ్వ‌రికి బీజేపీలో మ‌ద్ద‌తు కొర‌వ‌డింద‌ని చెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం.

త‌న మ‌రిది చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం, ఆయ‌న క‌ళ్ల‌లో ఆనందాన్ని చూసేందుకు పురందేశ్వ‌రి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ఆమె నిజ స్వ‌రూపాన్ని బీజేపీ నేత‌లు చాలా త్వ‌ర‌గా ప‌సిగ‌ట్టి, ఏమీ అన‌కుండానే స‌హాయ నిరాక‌ర‌ణ ప్ర‌క‌టించారు. దీంతో ఆమెకు టీడీపీ అనుకూల నేత‌లు మాత్ర‌మే దిక్కు అయ్యారు. టీడీపీ అనుకూల బీజేపీ నేత‌ల‌కు ఢిల్లీలో అంత సీన్ లేదు. అందుకే ఆమె చాలా త్వ‌ర‌గా బీజేపీలో ఏకాకి అయ్యారు. అధ్య‌క్షురాలిగా ప‌ని చేయ‌లేని ప‌రిస్థితిని కోరి తెచ్చుకున్నారు. త‌న ఆవేద‌న‌ను బీజేపీ అధిష్టానం వ‌ద్ద ఆమె వినిపించారు.

చంద్ర‌బాబుతో బంధుత్వం త‌న‌కు అడ్డంకిగా మారిందని, టీడీపీ నాయ‌కురాలిగానే అంద‌రూ చూస్తున్నార‌ని, చివ‌రికి సొంత పార్టీ నేత‌లు కూడా ఆ విధంగా చూస్తే, స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద త‌న గోడు వినిపించిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆమెను ప‌క్క‌న పెట్టాల‌నే ఆలోచ‌న‌లో బీజేపీ అధిష్టానం ఉన్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. దీనికి ఎంత కాలం ప‌డుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?