మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి, చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి లేదు.. కాబట్టి ఆయనపై కేసులన్నింటినీ కొట్టేయాలి, క్వాష్ చేయాలి.. ఇదీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడి తరఫున నెల రోజుల నుంచి కొనసాగుతున్న వాదనలు! విజయవాడ ఏసీబీ కోర్టులో సిద్ధార్థ్ లూథ్రా ఈ వాదన మొదలుపెట్టారు!
ఆ తర్వాత హైకోర్టులో ఈ వాదనలో ఆయనకు హరీష్ సాల్వే యాడ్ అయ్యారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ, లూథ్రా, సాల్వే.. ఇంకా ఇతర లాయర్లు సామూహికంగా ఈ సాంకేతిక అంశం మీద చంద్రబాబును గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టం అవుతోంది!
విశేషం ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, అసలు స్కామ్ లేదు అనే వాదనకూ చంద్రబాబు తరఫు లాయర్లు ప్రస్తావిస్తున్న సాంకేతిక అంశాలకూ పొంతన కనపడదు! చంద్రబాబు అరెస్టు లో సాంకేతికపరమైన అంశాలను విస్మరించారు కాబట్టి.. మొత్తం కేసులనే కొట్టేయాలని, క్వాష్ చేసేయాలని గంటకు కోటి, కోటిన్నర రూపాయల ఫీజును తీసుకునే లాయర్లు బల్ల గుద్దుతున్నారు!
మరి గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. స్కామ్ జరగలేదనే వాదన ఎంత వరకూ నిలుస్తుంది అనేది ప్రశ్నార్థకం! కింది కోర్టులో అయితే ఈ వాదనపై సానుకూలంగా స్పందించలేదు. విజయవాడ ఏసీబీ కోర్టు అయినా, ఏపీ హైకోర్టు అయినా క్వాష్ ఇవ్వడానికి నిరాకరించాయి.
ఈ నేరం జరిగిన సమయానికి ఆ నియమం లేదని, కాబట్టి.. ఈ కేసులో చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదని సీఐడీ తరఫు వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ, హైకోర్టులోనూ.. సీఐడీ ఇదే వాదన వినిపించింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు లాయర్లు చెబుతున్న సెక్షన్ వర్తించదని, ఆ సెక్షన్ ఉన్నది అవినీతిపరులను కాపాడటానికి కాదని సుప్రీంలో కూడా సీఐడీ తరఫు లాయర్లు వాదిస్తున్నారు.
ఇందుకు సంబంధించి తదుపరి ఏం జరిగినా.. ఈ కేసులో చంద్రబాబు అవినీతి చేయలేదనే అంశం ఆయన లాయర్ల తరఫు నుంచి ఎందుకు హైలెట్ కావడం లేదు, ఎంతసేపూ ఎందుకు సాంకేతిక అంశాలను ఉపయోగించుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబుకు ఇంతకు మించి మార్గం లేదా.. అనే చర్చ సామాన్యుల్లో జరుగుతోంది! మరి తను నిప్పును అని ఒకటికి వెయ్యి సార్లు చెప్పుకున్న చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకునే తీరు ఇదా! అనే చర్చ చంద్రబాబు రాజకీయానికి ఏ మాత్రమూ మంచిది కాదు!