రూ.2000 నోటు.. తిరస్కరిస్తున్న వ్యాపారాలు

మార్కెట్ నుంచి 2వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా వెంటవెంటనే వెలువరించింది. ఇది 2వేల నోట్ల ఉపసంహరణ మాత్రమేనని, సెప్టెంబర్ 30లోగా తమ దగ్గరున్న…

మార్కెట్ నుంచి 2వేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు నిన్న ఆర్బీఐ ప్రకటించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా వెంటవెంటనే వెలువరించింది. ఇది 2వేల నోట్ల ఉపసంహరణ మాత్రమేనని, సెప్టెంబర్ 30లోగా తమ దగ్గరున్న పెద్ద నోట్లను మార్చుకోవాలని సూచించింది. ఈలోగా ఈ నోట్లు మార్కెట్లో చెల్లుతాయని కూడా స్పష్టం చేసింది.

కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇది ఇండియా. ఇక్కడ ప్రభుత్వం ఒకటి తలస్తే, ప్రజలు మరోలా రియాక్ట్ అవుతారు. 2వేల నోటుపై ఇలా కీలక ప్రకటన వెలువడిందో లేదో అలా ఈ నోటును అనధికారికంగా బ్యాన్ చేశారు కొంతమంది వ్యాపారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల 2వేల రూపాయల నోటును చిన్నచిన్న షాపుల్లో తీసుకోవడం లేదు. గట్టిగా అడిగితే చిల్లర లేదని తప్పించుకుంటున్నారు. దీంతో చేతిలో 2వేల రూపాయల నోటు ఉన్నా, షాపుల్లో చెల్లుబాటు అవ్వక ఇబ్బంది పడుతున్నారు సామాన్య జనం.

ఇక్కడ కూడా బ్లాక్ మార్కెట్ దందానే కారణం అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువ చేసే 2వేల రూపాయల నోట్లు బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని సెప్టెంబర్ నెలాఖరులోగా మార్చుకోవాలి. ఈలోగా మరిన్ని 2000 రూపాయల నోట్లు పోగుపడితే మొదటికే మోసం వస్తుంది. ఐటీ తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఎందుకైనా మంచిదని, కొత్తగా తమ దుకాణానికి వచ్చే 2వేల రూపాయల నోట్లను నిరాకరిస్తున్నారు చాలామంది వ్యాపారస్తులు.

ఈ నోటు ఇప్పటికే సామాన్య జనాలకు దూరమైంది. కొద్దోగొప్పో ఎవరి దగ్గరైనా మిగిలితే, ఇప్పుడిలా వ్యాపారస్తులు నిరాకరిస్తున్నారు. దీంతో నోటు చేతిలో ఉంటే బ్యాంకులకు వెళ్లడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. బహుశా ఆర్బీఐ ఇది ఊహించి ఉండదు. ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలైంది, రాబోయే రోజుల్లో బ్యాంకుల కంటే ముందు జనాల చేతుల్లోకి 2000 రూపాయల నోట్లు ఎక్కువగా వస్తాయని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. వ్యాపారులు, బడా బాబులు తమ దగ్గర బీరువాల్లో దాచిన ఈ పెద్ద నోట్లు అన్నింటినీ ఇప్పుడు జనబాహుళ్యంలోకి తీసుకొస్తారని అంచనా వేస్తున్నారు. 

2వేల రూపాయల నోటును ఏదైనా బ్యాంకు తిరస్కరిస్తే ఏం చేయాలనే అంశంపై ఆర్బీఐ ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చింది. మరి వ్యాపారులు పెద్ద నోటును తిరస్కరిస్తే ఏం చేయాలి? దీనిపై మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.