మొన్నటికిమొన్న పొన్నియన్ సెల్వన్-2 రిలీజైంది. తాజాగా బిచ్చగాడు-2 థియేటర్లలోకి వచ్చింది. ఈ రెండు సినిమాల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. పీఎస్-2 తెలుగులో ఫ్లాప్ అవ్వగా.. బిచ్చగాడు-2 భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ కాంపారిజన్ చూసైనా కోలీవుడ్ క్రిటిక్స్ కాస్త ఆలోచిస్తే మంచిది..
పొన్నియన్ సెల్వన్-2 రిలీజైనప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ పై నోరుపారేసుకుంది కోలీవుడ్ మీడియా. తెలుగు ప్రేక్షకులు కావాలనే పొన్నియన్ సెల్వన్-2ను పక్కనపెట్టారని, తమిళ సినిమాలంటే వివక్ష చూపిస్తున్నారంటూ కథనాలు వండివార్చింది. మరికొన్ని తమిళ సైట్స్ అయితే మరో అడుగు ముందుకేసి, టాలీవుడ్ ఆడియన్స్ కు టేస్ట్ లేదని కూడా అనేశాయి.
మరి ఇప్పుడు బిచ్చగాడు-2 వచ్చింది. భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. మరి దీనికి తమిళ మీడియా ఏమంటుంది? ఇది కూడా తమిళ సినిమానే కదా, పైగా ఇది కూడా సీక్వెల్ మూవీనే కదా? మరి ఎందుకు ఇంత తేడా?
సినిమా తమిళ నుంచి వచ్చిదా.. సీక్వెల్ మూవీనా అనేది కాదిక్కడ మేటర్. అందులో కంటెంట్ ఉందా లేదా అనేది చూడాలి. మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు తీసిన సినిమా పొన్నియన్ సెల్వన్. కానీ ఆ కథ తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. పూర్తిగా తమిళ వాసనలతో ఉన్న ఆ సినిమాను తిప్పికొట్టారు. దీంతో సహజంగానే పీఎస్-2పై కూడా ఆ ప్రభావం పడింది.
అదే బిచ్చగాడు విషయానికొస్తే.. ఇది తెలుగులో కూడా అఖండ విజయాన్ని నమోదుచేసింది. ఇప్పటికీ విజయ్ ఆంటోనీని బిచ్చగాడుగానే చూస్తారు తెలుగు ఆడియన్స్. అందుకే పెద్దగా ప్రచారం చేయనప్పటికీ, బిచ్చగాడు-2కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నైజాంలో మొదటి రోజే ఓ డబ్బింగ్ సినిమాకు 65 లక్షల షేర్ అంటే మామూలు విషయం కాదు.
ఇప్పటికైనా కొన్ని తమిళ మీడియా వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్.. తెలుగు ప్రేక్షకులపై పడి ఏడవడం ఆపాలి. దర్శకుడు, స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా.. కంటెంట్ బాగుంటే, తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆదరిస్తారని ఆమధ్య వచ్చిన కాంతార (కన్నడ), లవ్ టుడే (తమిళ), బలగం (తెలుగు) సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు బిచ్చగాడు-2 ఓపెనింగ్స్ తో అది మరోసారి రుజువైంది.