హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన జిమ్ కోచ్ హత్యలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. ముందుగా అగ్నిప్రమాదం అనుకున్నారు, ఆ తర్వాత అప్పుల బాధ తట్టుకోలేక జిమ్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని తేల్చారు.
ఇప్పుడీ మర్డర్ కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ మర్డర్, జిమ్ కోచ్ భార్య పర్యవేక్షణలోనే జరిగింది. ఏకంగా వీడియో కాల్ లో సూచనలు ఇచ్చి మరీ మర్డర్ చేయించింది ఆ ఇల్లాలు.
జిమ్ కోచ్ జయకృష్ణను అతడి భార్య దుర్గ దగ్గరుండి హత్య చేయించింది. తన ప్రేమికుడు చిన్నాతో హత్య చేయించడమే కాకుండా.. ఆ మొత్తం వ్యవహారాన్నీ వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించింది దుర్గ.
హత్య జరగడానికి 3 రోజుల ముందే తన సొంతూరు భీమవరం వెళ్లిపోయిన దుర్గ, అక్కడ్నుంచే తన బాయ్ ఫ్రెండ్ చిన్నా సహాయంతో ఈ హత్యను చేయించిందని పోలీసులు వెల్లడించారు. ముంజుగా జయకృష్ణకు మద్యం పట్టించి, అతడు మత్తులోకి జారుకున్న తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు చిన్నా. నిప్పు వెలిగించిన వెంటనే అపార్ట్ మెంట్ వెనక నుంచి పరారయ్యాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో కాల్ లో చూసింది దుర్గ.