మొన్నటికిమొన్న విశాఖ సాగరతీరంలో శ్వేత మరణం కళ్లముందు కదలాడుతూనే ఉంది. అంతలోనే బీచ్ లో మరో హత్య చోటు చేసుకుంది. ఈసారి శ్రావణి హత్యకు గురైంది.
ఇంతకీ ఏం జరిగింది..?
శ్రావణికి ఇదివరకే పెళ్లయింది. ఆమె జగదాంబ జంక్షన్ లో ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది. అదే జంక్షన్ లో గోపాలకృష్ణ పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణది పరవాడ. శ్రావణి-గోపాలకృష్ణ సన్నిహితంగా ఉండేవారు. అయితే తాజాగా ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయంటున్నారు ఇద్దరికీ కామన్ గా తెలిసిన స్నేహితులు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం శ్రావణిని బీచ్ కు తీసుకెళ్లాడు గోపాలకృష్ణ. అక్కడే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆవేశంతో, శ్రావణి గొంతు నులిమి చంపేశాడు గోపాలకృష్ణ. తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు.
మార్నింగ్ వాకింగ్ కోసం అటుగా వచ్చిన కొంతమంది మృతదేహాం చూసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, శ్రావణి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు నిందితుడు గోపాలకృష్ణ, గాజువాక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఉన్నఫలంగా శ్రావణిని గోపాలకృష్ణ హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ల మధ్య ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటి? ఇలా ఈ కేసుకు సంబంధించిన కీలకమైన అంశాల్ని రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.