మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నిజానికి శుక్రవారం (మే19) అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు.
కాగా ఈ నెల 16నే అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. కాకపోతే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పాడంతో 19న విచారణకు రావాలని సీబీఐ మరో నోటీసు పంపింది. అయితే తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని నిన్న కూడా విచారణకు రాలేదు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు గైర్హాజరైన ఆయన.. ఈసారైనా విచారణకు వస్తారా? లేదా మరోసారి గడువు కోరతారా? అన్నది ఉత్కంఠగా మారింది.
మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆమెకు యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉండటంతో, ఆమెకు డాక్టర్లు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.