క్వాష్ పిటిషన్ అంటే.. లోతైన విచారణ లేకుండా అసలు ఆ కేసులు పెట్టడమే కూడదంటూ న్యాయస్థానం తేల్చేయడమే అంటున్నారు! మరి తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుల్లో.. ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. ఈ కేసులను క్వాష్ చేయాలనే వాదన వినిపిస్తున్నట్టుగా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అర్థం అవుతుంది. ఏసీబీ కోర్టు నుంచి.. ఇదే వాదనే కొనసాగుతూ ఉంది తెలుగుదేశం అధినేత తరఫున! ఇప్పటికే ఏసీబీ కోర్టు అందుకు నిరాకరించింది, హైకోర్టూ అందుకు నో చెప్పింది, ఇప్పుడు వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది!
అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఒక న్యాయనిపుణుడు టీవీలో వ్యాక్యానించింది ఏమిటంటే… క్వాష్ పిటిషన్ అంటే మామూలు విషయం కాదని, దీనిపై గంటల కొద్దీ బల్లలు గుద్ది వాదించేది ఏమీ ఉండదని, సాంకేతికంగా కేసులు చెల్లవు అనే పాయింట్ పై మాత్రమే వాదించడానికి ఆస్కారం ఉందని, ఈ పిటిషన్ లో సత్తా ఉంటే న్యాయస్థానం ఎక్కువగా తర్జనభర్జనలు ఏవీ ఉండవని.. సాంకేతికంగా కేసులు చెల్లవనుకుంటే కోర్టు క్వాష్ ఉత్తర్వులు ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోదని వ్యాఖ్యానించారు!
క్వాష్ పిటిషన్ పై విచారణ అంటే.. అదేమీ కేసులో విచారణ గురించి, సాక్ష్యాధారాలను పరిశీలించడం గురించి కాదని.. క్వాష్ పై గంటల కొద్దీ వాయిదాలు జరిగాయంటేనే.. పిటిషనర్ కు సానుకూలత లేనట్టే అని వ్యాక్యానించారు ఆ లాయర్!
హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై బీభత్సమైన వాదనలు జరగుతున్న సమయంలో ఆ లాయర్ ఆ వ్యాఖ్య చేశారు. మరి ఇప్పుడు సుప్రీం కోర్టులో అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు ఒక పూట సాగినట్టుగా ఉన్నాయి, ఆ తర్వాత సీఐడీ తరఫు లాయర్ల వాదనలూ సాగాయి. అయితే విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం విచారణ జరగొచ్చు. మరి ఆ రోజు కూడా తీర్పు వస్తుందా, లేక వాదనలు కొనసాగుతాయా, తీర్పు రిజర్వ్ అవుతుందా.. అనే అంశంపై ఇంకా స్పష్టత లేనట్టే!
క్వాష్ పిటిషన్ లో సత్తా ఉంటే, ప్రస్తావించిన అంశాలు మెరుగైనవే అయితే గంటల కొద్దీ బల్లలు గుద్దేదేమీ ఉండదన్న ఒక న్యాయవాది మాటలను బట్టి చూస్తే… హైకోర్టులో విపరీతమైన వాదనల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టి వేసిన తీరును చూస్తే.. నేడే విడుదల, రేపే విడుదల వంటి రోజువారీ ప్రచారాన్ని పచ్చ బ్యాచ్ కాస్త ఉగ్గబట్టుకోవాల్సిందేనేమో!