హీరో రవితేజ ఎప్పుడూ మీడియాకు అంత దగ్గరగా ఏమీ వుండరు. సినిమా విడుదల టైమ్ లో తాను తెచ్చుకున్న యాంకర్, తాము అనుకున్న కాన్సెప్ట్, తమకు ఇబ్బంది లేని ప్రశ్నలతో కామన్ ఇంటర్వూలు చేయించి వదులుతుంటారు. మహా అయితే ఓ క్యూ అండ్ ఎ సెషన్ పెట్టి, ముక్తసరిగా సమాధానాలిచ్చి సరిపెడతారు. కానీ ఫర్ ఏ ఛేంజ్ ఈసారి మాత్రం ముంబాయిలో పిలిచి మరీ ఇంటర్వూల పేరంటాలు పెట్టారు. చాలా అంటే చాలానే ఇంటర్వూలు ఇచ్చి వచ్చారు.
ఇదేదో బాగానే వుందే..తెలుగులో కూడా ఇంటర్వూలు ఇస్తారా అని ఆరా తీస్తే, సమస్యే లేదని సమాధానం వచ్చింది. తెలుగు మీడియా జనాల ప్రశ్నల మీద రవితేజ కు అస్సలు పాజిటివ్ ఒపీనియన్ లేదట. ముంబాయి జర్నలిస్ట్ ల ఇంటర్వూ లు అదిరిపోయాయి. ఇంటర్వూలు అంటే అవీ, క్వశ్చన్లు అంటే అవి, మనవాళ్లు అడిగే అడ్డగోలు ప్రశ్నలు, ఇంటర్వూలు కావు అని రవితేజ అభిప్రాయపడుతున్నట్లు బోగట్టా. అందుకే ఇక్కడ ఎప్పటి లాగే ఇంటర్వూలకు దూరంగానే వుంటారట.
అదేంటీ.. ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు అడిగే తెలుగు మీడియా పర్సన్ కనిపించలేదా అంటే… మళ్లీ అదో తలనొప్పి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే అదో సమస్య. అందుకే మొత్తానికే ఎత్తి కట్టేస్తే ఏ సమస్యా లేదు. ఎవరైనా బాధపడినా వచ్చిన నష్టం ఏమీ లేదనే భావనలో రవితేజ టీమ్ వున్నట్లు తెలుస్తోంది.
నిజమే సినిమా హిట్ అయితే ఏ సమస్యా లేదు. తామే కరెక్ట్..తామే గ్రేట్ అనుకోవచ్చు. హిట్ కాకపోయినా సమస్య లేదు. మీడియానే రివ్యూలతో చంపేసింది అని తోసేయచ్చు. అది కూడా ఓ ఆప్షన్ వుందిగా.