ఆ ఒక్కటీ కేసీఆర్ కు మింగుడుపడదేమో!

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడానికి కష్టపడుతున్న రాజకీయ పార్టీలు రకరకాల వరాలను కురిపించడం మీదనే దృష్టి పెడుతున్నాయి. ఎవరికి తోచిన స్థాయిలో వారు వీర బీభత్సమైన వరాలను ప్రకటించేస్తున్నారు. Advertisement రాష్ట్రప్రభుత్వం మీద…

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడానికి కష్టపడుతున్న రాజకీయ పార్టీలు రకరకాల వరాలను కురిపించడం మీదనే దృష్టి పెడుతున్నాయి. ఎవరికి తోచిన స్థాయిలో వారు వీర బీభత్సమైన వరాలను ప్రకటించేస్తున్నారు.

రాష్ట్రప్రభుత్వం మీద పడగల ఆర్థిక భారాన్ని కూడా ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. కేవలం.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఒక్కటే ప్రధాన లక్ష్యంగా వర్తిల్లుతున్నారు. ఒకే హామీని.. ఒకరిని మించి మరొకరు ప్రకటిస్తూ.. వారు చెప్పినదానికంటె మేం ఎక్కువ ఇస్తాం అని కూడా అనేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలను చాలా ఆశావహ దృక్పథంతో ఎదుర్కొంటున్న, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాగలం అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. ప్రజలను ఆకర్షించే అనేకానేక హామీలు అందులో ఉండబోతున్నాయి. వాటన్నింటికీ భారాస కూడా విరుగుడుగా వరాలను ప్రకటించడం సాధ్యమవుతుందేమో గానీ.. ఒక్క విషయంలో మాత్రం.. కాంగ్రెసు హామీకి కౌంటర్ హామీ కేసీఆర్ ఇవ్వలేరని ఇప్పుడు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రకటించబోతున్న హామీల్లో ప్రధానంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25వేల పెన్షను, వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది  చాలా కీలకంగా కనిపిస్తోంది. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి తలా 250 గజాల ఇళ్లస్థలాలు ఇస్తామనే హామీ కూడా గట్టిదే. ఇది కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే మేలు చేయవచ్చు గాక. కానీ, అధికారంలోకి వచ్చి పదేళ్లు అయినా.. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు ఏమాత్రం న్యాయం చేయలేదనే ప్రజల ఆగ్రహానికి ఇది నిదర్శనం అవుతుంది. ఆ వాదన నమ్మే వాళ్లంతా.. కాంగ్రెస్ హామీని హర్షించే అవకాశం ఉంది.

పెన్షన్లు, ఆర్థిక సాయం లాంటి వాటివి కాంగ్రెస్ ఎంత ప్రకటించినా సరే.. దానికి కొంత యాడ్ చేసి మేం అంతకంటె ఎక్కువ ఇస్తాం అని ప్రకటించడం కేసీఆర్ కు చాలా సులువు. కానీ, కేసీఆర్ కౌంటర్ గాచెప్పలేని ఒక హామీని కూడా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ఉంచింది. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిహామీని , భారాస ‘మేం కూడా’ అనగలదేమో గానీ.. ఆ ఒక్క హామీని మాత్రం వారు ఆచరణలో పెట్టడం కష్టం.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తాం అని కాంగ్రెస్ తమ హామీల్లో ప్రకటించింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. ప్రతిరోజూ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించేవారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అసలను ప్రజలను కలవడం అనే మాటేలేదు. ప్రజలు కాదు కదా.. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా సీఎం ను కలవడం అనేది చాలా కష్టం.

సీఎం మాత్రమే కాదు.. సీఎం కు సమానంగా అధికారాలను చెలాయిస్తూ ఉండే.. కల్వకుంట్ల తారక రామారావును కలవడం కూడా నాయకులకు అసాధ్యం. తండ్రీ కొడుకులు ఇద్దరూ సభలు సమావేశాలు జరిగినప్పుడు ప్రజలతో ముచ్చట్లు చెబుతారే తప్ప.. వారిని నేరుగా కలవడానికి ఇష్టపడరు. అలాంటి నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించడం భారాసకు మింగుడుపడకపోవచ్చు. అలాంటి హామీని వారు ఇవ్వలేరు. ఇచ్చినా ప్రజలు నమ్మరు గాక నమ్మరు!