తండ్రిని కోల్పోయిన సీనియర్ నటుడు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన తండ్రిని కోల్పోయాడు. అంతలోనే మరో ప్రముఖుడు కూడా తన తండ్రిని కోల్పోయాడు. సీనియర్ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ కు పితృవియోగం. అతడి తండ్రి…

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన తండ్రిని కోల్పోయాడు. అంతలోనే మరో ప్రముఖుడు కూడా తన తండ్రిని కోల్పోయాడు. సీనియర్ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ కు పితృవియోగం. అతడి తండ్రి మెహబూబ్ పాషా కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. పెద్దగా ఆరోగ్య సమస్యల్లేవు. కేవలం వయసురీత్యా వచ్చిన సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు.

కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన మెహబూబ్ పాషా, చెన్నైలోని చెంగల్పట్టులో తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు.. నాజర్ ను పరామర్శిస్తున్నారు. తమ సంతాపం తెలియజేస్తున్నారు.

నాజర్ నటుడవ్వడానికి కారణం ఆయన తండ్రి. మెహబూబ్ పాషా నటుడు కావాలని కలలుగన్నారు. కానీ కుటుంబ బాధ్యతలు, అప్పటి సామాజిక పరిస్థితుల కారణంగా ఆయన నటుడు కాలేకపోయారు. అందుకే కొడుకు నాజర్ ద్వారా తన కల నెరవేర్చుకోవాలనుకున్నారు.

సినిమాల పట్ల అమితమైన ఆసక్తి ఉన్న మహబూబ్, నాజర్ కు కూడా సినిమాల పట్ల ఆసక్తి కలిగించారు. ఆ తర్వాత ఆయనే నాజర్ ను యాక్టింగ్ స్కూల్ లో చేర్చారు. అయితే యాక్టింగ్ అయితే పూర్తిచేశాడు కానీ నాజర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆ ఆలోచనలు మానేసి, ఓ స్టార్ హోటల్ లో ఉద్యోగానికి చేరిపోయాడు.

అయితే తండ్రి కలను నెరవేర్చలేకపోయాననే బాధ నాజర్ లో అలానే ఉండిపోయింది. అందుకే మరోసారి గట్టిగా ప్రయత్నించి సినీ అవకాశాలు అందుకున్నారు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో రాణించారు. ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడయ్యారు. అలా తను నటుడిగా ఎదగడానికి తన తండ్రి కారణమనే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు నాజర్.