కొన్ని రోజుల కిందటి సంగతి.. హైదరాబాద్ శివార్లలో ఉన్న జగద్గిరిగుట్టలో ఓ అపార్ట్ మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. ఆ మంటల్లో జయకృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు, అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు. చుట్టుపక్కల జనం కూడా అలానే అనుకున్నారు. అయితే కేసులో లోపలకు వెళ్లేకొద్దీ పోలీసులకు అనుమానాలు ఎక్కువయ్యాయి. జిమ్ కోచ్ గా పనిచేస్తూ, దృఢంగా ఉన్న జయకృష్ణ.. ఎందుకు తప్పించుకోలేకపోయాడనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జయకృష్ణ, మిట్టమధ్యాహ్నం మద్యం తాగి ఉన్నాడు. ఇదొక అనుమానం కాగా, పెట్రోల్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందనే విషయం పోలీసులకు మరిన్ని డౌట్స్ రేకెత్తేలా చేసింది. గ్యాస్ లీక్ అయితే ఓకే, బెడ్ రూమ్ లోకి పెట్రోల్ ఎలా వచ్చిందనేది వాళ్ల సందేహం.
దీంతో జయకృష్ణ భార్య దుర్గను లోతుగా ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. దుర్గకు చిన్నా అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. దీంతో భర్త అడ్డు తొలిగించుకునేందుకు ఇద్దరూ కలిసి జయకృష్ణకు మద్యం తాగించారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.