ఒకట్రెండు రోజులుగా జనసేనాని పవన్‌కల్యాణ్‌కు షూటింగ్‌లు లేనట్టుంది. బహుశా ఖాళీగా ఉండడం వల్ల కాబోలు, వరుసగా జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శనాత్మక ట్వీట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. పవన్ విషయంలో అందరి ఆవేదన అదే. షూటింగ్‌లు లేని సమయాల్లో మాత్రమే రాజకీయాలంటూ వీకెండ్స్‌లో హడావుడి చేస్తుంటారని విమర్శించేది అందుకే. జగన్ ప్రభుత్వాన్ని పవన్‌కల్యాణ్ తాజాగా ట్విటర్ వేదికగా విమర్శించారు.
ఇదే సందర్భంలో ప్రత్యర్థుల నుంచి ఆయనకు నిలదీతలు ఎదురవుతున్నాయి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా, ఇంత వరకూ పునర్నిర్మాణ పనులు చేపట్టలేదని పవన్‌కల్యాణ్ విమర్శించారు. అన్నమయ్య డ్యామ్‌పై పవన్ ఆరోపణలు, ఆవేదన ఏంటో ముందు తెలుసుకుందాం.
“19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చెయ్యేరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాల్లోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు”
“అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలల్లో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటి కి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారు”
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై ప్రభుత్వ తప్పిదం గురించి ఎన్నో విమర్శలొచ్చాయి. పవన్ ప్రశ్నిస్తున్నట్టుగా ఇంత వరకూ డ్యామ్ పునర్నిర్మాణం చేపట్టకపోవడం ఏపీ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇదే సందర్భంలో పైసా ఖర్చులేని పని పవన్ చేయకపోవడాన్ని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వారాహి యాత్ర మొదలు పెడతానని ఏడాదికి పైగా పవన్ చెబుతున్నారని, మరి ఆ పని ఎందుకు చేయలేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రోడ్డు మీద తిరగడానికి వారాహి అని ఓ వాహనాన్ని తెచ్చుకుని, ఏడాదికి పైగా షెడ్డులోనే వేశారని, అలాంటి బాధ్యతలేని ప్రతిపక్ష నాయకుడు తమను ప్రశ్నించడం ఏంటని మాటల తూటాలు పేలుతున్నాయి.
అన్నమయ్య డ్యామ్ కట్టడానికి సాంకేతికంగా చాలా అంశాలు ముడిపడి వుంటాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరి పవన్‌కు వారాహి వాహనంలో యాత్ర చేయడానికి చంద్రబాబు ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదా? అని ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ పాదయాత్రను సక్సెస్ చేయడం కోసం దత్త సోదరుడిగా వారాహి యాత్రను వాయిదా వేసింది నిజం కాదా? అని ప్రశ్నించడం గమనార్హం. పవన్ ఒక ప్రశ్న వేస్తే, అనేక నిలదీతలు ఎదురవుతున్నాయి.