సీబీఐ విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చివరి నిమిషంలో రూట్ మార్చారు. మరోసారి ఆయన విచారణకు గౌర్హాజరయ్యారు. తన తల్లి వైఎస్ లక్ష్మిదేవమ్మ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారనే సమాచారంతో పులివెందులకు వెళుతున్నానని, విచారణకు మరో రోజు వస్తానని సీబీఐకి అవినాష్‌రెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మిదేవమ్మకు బీపీ డౌన్ కావడంతో పులివెందులలోని దినేష్ నర్సింగ్ హోంలో చేరినట్టు సమాచారం. ఈ ఆస్పత్రి సీఎం వైఎస్ జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డిది. మూడు రోజుల క్రితం విచారణకు వెళ్లాల్సిన అవినాష్‌రెడ్డి, ముందస్తు కార్యక్రమాల వల్ల రాలేనని చెప్పడంతో సీబీఐ పరిగణలోకి తీసుకుంది. అవినాష్‌రెడ్డి చెప్పిన మేరకు 19వ తేదీ తిరిగి విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.
అయితే ఇవాళ తల్లికి అనారోగ్య కారాణాలు చూపి, ఆయన పులివెందులకు పయనమయ్యారు. ఇదిలా వుండగా అవినాష్‌రెడ్డి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హుటాహుటిన కార్యాలయం నుంచి బయల్దేరినట్టు ప్రచారం జరుగుతోంది. సీబీఐ అధికారులు హడావుడిగా ఎక్కడికి? ఎందుకు ప్రయాణం అయ్యారనేది తెలియాల్సి వుంది.
ఇప్పటికే ఆరుసార్లు సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ప్రతి సందర్భంలోనూ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం అవినాష్‌రెడ్డి అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ ఆయనకు ఊరట లభించడం లేదు. వరుసగా రెండోసారి సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి డుమ్మా కొట్టడంతో దర్యాప్తు సంస్థ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.