కాన్స్ లో అడుగుపెట్టిన ప్రతిసారి అందరి దృష్టిని ఆకర్షించింది ఐశ్వర్యరాయ్. ప్రతి ఏటా ఆమె లుక్స్ హైలెట్ గా ఉండేవి, ఆమె ధరించే దుస్తులు అందరి మెప్పు పొందేవి. కాన్స్ ఫిలిం ఫిస్టెవల్ కోణంలో ఐష్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అయితే తొలిసారి ఆమె కాన్స్ ఎప్పీయరెన్స్ పై విమర్శలు చెలరేగుతున్నాయి.
మొన్నటికిమొన్న కాన్స్ చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్ పై ఓ వింత డ్రెస్ తో కనిపించింది ఐశ్వర్య రాయ్. ఆ డ్రెస్ నిండా పువ్వులు, ఆకులు ఉన్నాయి. డిజైన్ కూడా సరిగ్గా కనిపించలేదు. ఒక దశలో ఆమె దుస్తులు ధరించిందా, అలా పైపైన కప్పుకొని వచ్చిందా అనే సెటైర్లు కూడా పడ్డాయి.
అక్కడితో అవి ఆగిపోయాయని అనుకునేలోపే, అదే కాన్స్ వేదికగా మరోసారి ఐశ్వర్యపై ట్రోలింగ్ మొదలైంది. ఈసారి ఆమె అల్యూమినియం పూత పూసినట్టు ఉండే దుస్తులు ధరించింది. అదే రంగులో ఉన్న ముసుగు కూడా ధరించింది. ఈ డ్రెస్ కూడా చాలామందికి నచ్చలేదు. దీనిపై కూడా మీమ్స్, ట్రోల్స్ నడుస్తున్నాయి.
కాన్స్ చిత్రోత్సవంలో ఇలా లుక్స్ పరంగా ఐశ్వర్యరాయ్ ఫెయిల్ అవ్వడం ఇదే తొలిసారి. ఒకప్పుడు ఆమె తన అందంతో, వస్త్రాలంకరణతో భారత్ బ్రాండ్ గా వెలిగింది. కానీ ఇప్పుడు ఆమె అందం తగ్గింది, డిజైన్స్ ఎంపికలో టేస్ట్ కూడా తగ్గిందంటున్నారు.
ఫ్యాషన్ రంగానికి చెందిన కొంతమంది వ్యక్తుల అభిప్రాయం మాత్రం వేరే విధంగా ఉంది. ఐశ్వర్య ఫిజిక్ మునుపటిలా లేదు. ఆమె ఇప్పుడు కాస్త లావెక్కారు, వయసుతో పాటు వచ్చిన మార్పు అది. కాబట్టి తన బొద్దు ఫిజిక్ బయటపడకుండా ఇలాంటి డిజైన్స్ ఎంచుకుంటోందనేది వాళ్ల వివరణ. ఏదేమైనా కాన్స్ కు సంబంధించి తొలిసారి ఇలా విమర్శల పాలైంది ఐశ్వర్యరాయ్ బచ్చన్.