నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డికి మంత్రి అంబటి రాంబాబు ఏ క్షణంలో ఆ పేరు పెట్టారో గానీ, బాగా సరిపోయిందని సొంత పార్టీ వాళ్లు కూడా అనుకునే పరిస్థితి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం తనకంటూ గౌరవ మర్యాదల్ని సంపాదించుకుంది. అయితే ఆ కుటుంబంలో ఆనం వెంకటరమణారెడ్డి రూపంలో ఒక పొలిటికల్ కమెడియన్ ఉన్నాడని ఆ ఫ్యామిలీ అభిమానులు వాపోతున్నారు.
ఆనం వెంకటరమణారెడ్డిని తమిళ కమెడియన్ వడివేలుతో మంత్రి అంబటి రాంబాబు గతంలో పోల్చారు. ఈ పొలిటికల్ కమెడియన్‌గా తానేం మాట్లాడుతున్నారో కనీస సోయ ఉన్నట్టు లేదు. మీడియా అటెన్షన్ కోసమో, లేక టీడీపీ పెద్దల మెప్పు కోసమో కాస్త హద్దులు దాటి నోటి దురుసు ప్రదర్శిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. తాజాగా వైఎస్ భారతిపై ఆయన అవాకులు చెవాకులు పేలడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏది పడితే అది విమర్శ చేయడం చాలా ఏళ్లుగా చూస్తున్నాం.
కానీ జగన్ సతీమణి భారతిపై ఆనం విమర్శల తీరును టీడీపీ నేతలు సైతం విమర్శిస్తున్నారు. వైఎస్ భారతిపై విమర్శలు చేశానని ఆనం వెంకటరమణారెడ్డి సంబరపడొచ్చని, ఇందుకు కౌంటర్‌గా వైసీపీ నేతలు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై ఇష్టానుసారం మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాళ్లతోనే చంద్రబాబు కుటుంబంలోని మహిళలను బజారుకీడుస్తున్నారని టీడీపీలో అంతర్గత చర్చకు దారి తీసింది.
మీరు సీఎం అయ్యాక రూ.500 కోట్ల ప్రకటనలు సాక్షికి ఎందుకు ఇచ్చారు? మీ భార్య ముఖంలో చిరునవ్వు చూడడానికా? అలుగుతారని భయపడి ఇచ్చారా? అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించడం గమనార్హం. ఆనం లెక్క ప్రకారం… గతంలో చంద్రబాబు ఎవరి భార్యల కళ్లలో ఆనందం చూడడానికి, ఎవరు అలుగుతారని ఎల్లో పత్రికలకు కోట్లాది రూపాయల యాడ్స్ ఇచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వడివేలు అత్యుత్సాహంపై వైసీపీ నేతల ఘాటు రియాక్షన్స్ చంద్రబాబు మరోసారి వెక్కివెక్కి ఏడ్చే పరిస్థితి రాకూడదని కోరుకుందాం.