సినీ పెద్దలు పవన్ కి మద్దతివ్వలేదని వాపోయాడు నాగబాబు. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం మీకెప్పుడూ ఉంటుందని చురకలంటించారు. మరి ఆ పెద్దల్లో చిరంజీవి లేరా..? ఉంటే ఆయన పేరు ప్రస్తావించడానికి నాగబాబుకి ఏం అడ్డొచ్చింది..? పోనీ పవన్ కల్యాణ్ లాగా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేస్తే సినిమా నిర్మాతలకు లాభాలు వస్తాయా.
పవన్ కల్యాణ్ స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం, సీఎం జగన్ ని విమర్శిస్తున్నారు. ఓ సగటు దర్శకుడు, ఓ నిర్మాత, ఓ హీరో.. జగన్ కి ఎందుకు ఎదురెళ్లాలనుకుంటారు. ఇండస్ట్రీ అంతా జగన్ కి వ్యతిరేకంగా మారితే.. ఆ మంటల్లో చలి కాచుకోవాలనుకునే పవన్ కల్యాణ్ ఏం పెద్దమనిషి?
ఆ దమ్ము ఎక్కడికి పోయింది..?
రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో అంతెత్తున ఎగిరిపడిన పవన్ కల్యాణ్, భీమ్లా నాయక్ సినిమా ఫంక్షన్ రోజు ఎందుకు సైలెంట్ అయ్యారు. కనీసం సినిమా విడుదల టైమ్ లో కూడా పవన్ హంగామా కనపడలేదు. కేవలం ఫ్యాన్స్ మీద అంతా వదిలేశారు. కానీ ఇప్పుడు నాగబాబు తెరపైకి వచ్చారు.
మా తమ్ముడ్ని అన్యాయం చేశారు, ఎవరూ తోడు రాలేదు, రాజకీయాల్లోనూ ఇంతే, సినిమాల్లోనూ ఇంతేనా.. అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సినిమా పెద్దలు పవన్ కి మద్దతివ్వకపోవడం దురదృష్టం అంటూనే.. పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని తమ్ముడు అర్థం చేసుకున్నారంటూ పెద్ద డైలాగులే వాడారు.
ఇండస్ట్రీ అంటే పవనేనా..?
సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్క పవన్ కల్యాణే అనుకుంటున్నారా..? పవన్ కి ముందు సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యాయని చెప్పుకున్న హీరోలు అబద్ధాలు చెప్పినట్టేనా..? అసలు పవన్ బాధ ఏంటి..? సినిమాకి పెట్టిన ఖర్చు రాలేదా..? లేక సినిమా ఫ్లాప్ అయిందా..? అభిమానుల టాక్ తో అంతా బాగానే ఉంది కదా..? కానీ పవన్ అనుకున్నది జరగలేదు.
గతంలో లాగా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి గొడవలు జరగలేదు. అందుకే పవన్ లో అభద్రతా భావం ఏర్పడింది. తన సినిమా విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కలసి రాలేదంటూ మిడిల్ బ్రదర్ తో స్టేట్ మెంట్ ఇప్పించడం వెనక అసలు రహస్యం ఇదే.
పెద్దలు రాలేదు, అభద్రతా భావంతో భయపడుతున్నారంటున్న నాగబాబు, నేరుగా చిరంజీవితోనే మాట్లాడొచ్చు కదా. చిరంజీవితో ఓ స్టేట్ మెంట్ ఇప్పించొచ్చు కదా. తన అన్నయ్యకి సినిమా ఇండస్ట్రీలో మైలేజీ పెరగాలి, తమ్ముడికి పాలిటిక్స్ లో క్రేజ్ పెరగాలి. ఈ ఫ్యామిలీ అజెండాలే కొంపముంచేది. ఇండస్ట్రీ అంటే.. కేవలం మెగా ఫ్యామిలీ కాదు, అందరూ… అనుకున్నప్పుడే టాలీవుడ్ బాగుపడుతుంది.
అలా అనుకోనంతకాలం.. నేను, నా అన్నయ్య, నా తమ్ముడు, మా ఫ్యామిలీ.. అక్కడి వరకే పరిమితం కావాల్సి వస్తుంది. ఇకనైనా నాగబాబు ఇలా గూటిలో పక్షిలా మూడ్ వచ్చినప్పుడు బయటకొచ్చి స్టేట్ మెంట్లు ఇవ్వడం తగ్గించుకోవాలి.