ఇది ‘ఇది యుద్ధం కాదు, సైనిక చర్య మాత్రమే’ అంటూ ఫిబ్రవరి 24న గురువారం ఉదయం నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్‌పై మూడు దిక్కుల నుంచి విరుచుకుపడ్డాయి. రాజధాని కీవ్, ఖార్కివ్, ఒడెసాతో సహా పలు నగరాలపై భారీగా బాంబు, క్షిపణి దాడులు జరిగాయి. ఈ యుద్ధం యొక్క ప్రకంపనలు ప్రపంచమంతా ఫీలవుతోంది. ఒక సార్వభౌమ దేశమైన ఉక్రెయిన్‌పై పొరుగుదేశమైన రష్యా దండెత్తడం నిజంగా అన్యాయమే, దుర్మార్గమే. అయితే ఎందుకిలా జరిగింది? రష్యా ఎందుకింత ఘోరానికి తలపడింది? అని తెలుసుకోవాలంటే మన చూపు రష్యా, ఉక్రెయిన్‌లను దాటి సుదూరంగా ఉన్న అమెరికాకు చేరుకోవాలి. అక్కడ బైడెన్ చర్యలను గమనించాలి.
అఫ్గనిస్తాన్ నుంచి వైదొలుగుతానని అమెరికా ఎప్పణ్నుంచో చెబుతున్నా, బైడెన్ వచ్చిన తర్వాతనే ఆ పని జరిగింది. తాము తప్పుకుంటున్న కొద్దీ, తాలిబాన్లు ఓ పక్కనుంచి దేశాన్ని ఆక్రమించు కుంటున్నారని తెలిసినా, తమ నిష్క్రమణ వలన 20 ఏళ్లగా తమకు మద్దతిస్తూ వచ్చినవారందరూ ప్రాణాపాయ స్థితిలోకి నెట్టబడతారని స్పష్టంగా కనబడుతూన్నా, చేసిన నిర్వాకం చాలు అనుకుని వెళ్లిపోయారు. ఆ వెళ్లడంలో కూడా భారీ స్థాయిలో ఆయుధాలను వదిలేసి మరీ వెళ్లిపోయారు. వాటిని తాలిబాన్లు వశపరుచుకుని, పాకిస్తాన్‌కు అమ్మేశారని వార్తలు వచ్చాయి. ఆ విధంగా పాకిస్తాన్‌కు ఆయుధసాయం చేయడమే అమెరికా అసలు లక్ష్యమనీ కూడా కొందరు పరిశీలకులు అన్నారు. అమెరికా వెళ్లిపోగానే 20 ఏళ్లగా వాళ్లు మేన్‌టేన్ చేస్తూ వచ్చిన పేకమేడ కూలిపోయింది. సర్వం తాలిబాన్ల వశమై పోయింది. మారామని చెప్పుకునే తాలిబాన్లు, ఎప్పటిలాగానే ఉందామనే తాలిబాన్ల మధ్య ఘర్షణలు జరుగుతూండగా తాలిబాన్లను మించిన ఛాందసవాదులు పుట్టుకుని వచ్చి, చివరకు అఫ్గనిస్తాన్ అంధయుగాల వైపు సాగుతోంది.
ఇంత జరిగినా, అఫ్గనిస్తాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే మరో 20 ఏళ్లు ఉన్నా అమెరికా అఫ్గనిస్తాన్‌ను బాగు చేయలేదని, ఆ నిర్వహణ ఖర్చు భారాన్ని అమెరికా ప్రజలు మోస్తూ వుండాల్సివచ్చేదని నా నిశ్చితాభిప్రాయం. తాలిబాన్లు వచ్చి పడుతూంటే, అమెరికా నిలబెట్టిన సైన్యం ఎలా వ్యవహరించిందో చూశాం. సైన్యం ఖర్చు పేరుతో అమెరికా సైనికాధికారులు, అఫ్గన్ పాలకులు కలిసి సొమ్మంతా స్వాహా చేసేసి, సైనికులకు జీతాలు యివ్వలేదు. దాంతో వాళ్లు తాలిబాన్ల వైపు తిరిగిపోయారు. తన ప్రజల మీద పన్నులేసి అమెరికా తెచ్చి పోసిన డబ్బంతా అమెరికన్ సైనికాధికారులు, అఫ్గన్ పాలకులు, రాజకీయవేత్తలు మింగేశారు తప్ప, సామాన్యులకు ఏమీ చేయలేదు. అందుకే ప్రజలు తాలిబాన్లను ప్రతిఘటించలేదు. తమకు ఎలాటి పాలన కావాలో అఫ్గన్ ప్రజలే తేల్చుకోవాలి, పోరాడాలి. వాళ్ల తరఫున పోరాడుతున్నామంటూ అమెరికా తన ప్రజలపై భారం వేయడం సమంజసం కాదు.
అయితే అమెరికా ప్రజలు అలా అనుకోలేదు. బైడెన్ అమెరికా ప్రతిష్ఠ దిగజార్చాడనుకున్నారు. సెప్టెంబరులో 44% ఉన్న బైడెన్ ఎప్రూవల్ రేటింగ్ జనవరి వచ్చేసరికి 41 అయింది. ఏడాది పాలనలో బైడెన్ విఫలమయ్యాడని 56% మంది అంటున్నారు. కొన్ని సంస్థల ఒపీనియన్ పోల్స్‌లో యిది 60% దాటిపోతోంది. ఎందుకంటే అమెరికన్లకు చైనాతో స్పర్ధ ఉంది. అమెరికా నిష్క్రమణ తర్వాత చైనా అఫ్గనిస్తాన్‌లో తన పలుకుబడి పెంచుకుంటోందని, పెట్టుబడుల ఆశ చూపి, తన వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా అఫ్గనిస్తాన్‌ను మలచుకుంటోందని వాళ్ల బాధ. ప్రపంచమంతా తమ ఆధిపత్యమే సాగాలని సాధారణ అమెరికన్ ప్రజల ఆకాంక్ష. వాళ్ల అహాన్ని ఎగదోస్తూ వచ్చి, వాళ్లనా విధంగా తయారు చేస్తూ వచ్చారు. లేకపోతే ఇరాక్, ఇరాన్, లిబ్యా, సిరియా, మధ్య ప్రాచ్యపు దేశాల్లో అమెరికా పాలకులు అనవసరపు యుద్ధాలు చేయగలిగేవారు కారు.
సాధారణ అమెరికన్ ప్రజల దృష్టిలో హీరోగా మారి, తన పాప్యులారిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు బైడెన్‌కు ఉక్రెయిన్ అనే రావణకాష్టం మనసులో మెదిలింది. రష్యాకు, దానికీ మధ్య గొడవ ఎప్పణ్నుంచో నడుస్తూ వస్తోంది. ఎటూ తేలటం లేదు. ఉక్రెయిన్‌ను ఎగదోసి, రష్యాను యిరకాటంలో పెడితే అఫ్గనిస్తాన్ పోయినా, ఆ దగ్గరి ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ మన చేతికి వచ్చిందని ప్రజలను కన్విన్స్ చేయవచ్చు. పైగా ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి, రష్యా అంటే డెమోక్రాట్లకు మహా మంట. అమెరికా ఎన్నికలలో రష్యా ప్రమేయం రుజువు కాకపోయినా, హిల్లరీ క్లింటన్‌ను ఓడించడానికి రష్యా అనేక మార్గాల్లో ప్రయత్నించిందనేది జగద్విదితం. రష్యన్ హేకర్లు అమెరికన్ రాజకీయ నాయకుల కంప్యూటర్లలోకి చొరబడి, సరైన సమయంలో డెమోక్రాట్లకు యిబ్బందికరమైన సమాచారాన్ని బయటపెట్టి వాళ్ల పరువు తీశారని అందరికీ తెలుసు. ఉక్రెయిన్ పేరు చెప్పి పుటిన్ పీచమణిస్తే అమెరికన్లకు ఆమోదం, డెమోక్రాట్లకు హర్షం.
ఇంతకీ ఉక్రెయిన్ రావణకాష్టం కథాకమామీషూ ఏమిటి? ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆ దేశం 1991లో విచ్ఛిన్నం తర్వాత స్వతంత్రదేశం అయింది. దాని తూర్పు ప్రాంతం సరిహద్దు రష్యా, అక్కడ రష్యన్ భాష మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. క్రైస్తవ చర్చి కూడా రష్యన్ల మాదిరిదే. వాళ్లంతా రష్యాతో సత్సంబంధాలకు అనుకూలం. పశ్చిమ ప్రాంతం సరిహద్దు యూరోప్. వారికి సన్నిహితంగా వుంటారు. యూరోప్‌తో బంధాలు పెంచుకుంటే వ్యాపారావకాశాలు పెరుగుతాయి, పైగా అమెరికా అండతో రష్యాను భయపెట్టవచ్చు అనుకునే వర్గాలు ఎక్కువ. ఒకలా చెప్పాలంటే దేశం రెండుగా చీలి వుంది. నాయకుల్లో కూడా రష్యా అనుకూలురు, ప్రతికూలురు ఉన్నారు. కానీ ఉక్రెయిన్ మొత్తంగా చూసుకుంటే యూరోపియన్ యూనియన్‌లో, ఆ పై నాటోలో చేరాలన్న ఉబలాటం అత్యధికులకు ఉందనే అనుకోవాలి.
నాటో కథేమిటంటే, యూరోప్‌లో సోవియట్ యూనియన్ పలుకుబడిని, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మొదలైన 12 దేశాలు 1949 ఏప్రిల్‌లో నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)ను స్థాపించాయి. బలప్రయోగం ద్వారా యూరోప్‌లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా అది పని చేస్తూ వచ్చింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత కోల్డ్ వార్ నాటి వాతావరణం యిప్పుడు లేదు కాబట్టి నాటో అవసరం లేదు కూడా. నాటోను విస్తరించబోమని, క్రమేపీ మూసేస్తామని బుష్ గోర్బచేవ్‌కు నోటిమాటగా హామీ యిచ్చాడట. బుష్ తర్వాత వచ్చిన క్లింటన్ 1994లో నాటో సమావేశంలో నాటో విస్తరణలో ఉన్న ప్రమాదాల గురించి మాట్లాడాడు కూడా. ఇలా అంటూనే ఉన్నారు కానీ నాటో కొనసాగుతూ వచ్చింది. 1997లో రష్యాతో ‘‘ఫౌండింగ్ యాక్ట్’’ పేర ఒక తటస్థ ఒప్పందానికి వచ్చింది. కానీ తర్వాత దాని పట్టించుకోకుండా సభ్యత్వం పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు 30 దేశాలున్నాయి. లేటెస్టుగా 2020లో కూడా నార్త్ మాసిడోనియాను చేర్చుకున్నారు. వాటిలో 13 గతంలో సోవియట్ యూనియన్‌లో ఉన్న దేశాలే! చెల్లియో, చెల్లకో రష్యా అది సహిస్తూ వచ్చింది.
ఉక్రెయిన్ 1992 నుంచి నాటోలో చేరదామని చూస్తోంది. 1997లో ఉక్రెయిన్-నాటో కమిషన్ ఏర్పాటైంది. పుటిన్ వచ్చాక రష్యా బలపడడం ప్రారంభమై అభ్యంతరాలు పెట్టసాగింది, ముఖ్యంగా పొరుగున ఉన్న ఉక్రెయిన్ చేరితే నాటో సైన్యాలు ఉక్రెయిన్‌లో తిష్ట వేసి, మిలటరీ స్థావరాలు స్థాపించి, కొన్ని గంటల వ్యవధిలో రష్యాను నాశనం చేయగలవు. అందుకని నాటోలో చేరవద్దని ఉక్రెయిన్‌కు చెపుతోంది. అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటోంది. ఉక్రెయిన్ 2008లో నాటోలో చేరికకై అప్లికేషన్ పెట్టుకుంది. నాటోలో, తద్వారా యూరోపియన్ యూనియన్‌లో చేరి యూరోప్ దేశాలతో వ్యాపారం చేసుకుందామని దాని ఆలోచన. కానీ రష్యా ప్రతిఘటనకు దడిసి నాటో దేశాలు ఆగాయి. ఎందుకంటే ఇంధన అవసరాల కోసం అవి రష్యాపై ఆధారపడి వున్నాయి. పైగా రష్యన్ ధనికవర్గాలు యూరోప్ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు కూడా.
ఒకప్పుడు సోవియట్ యూనియన్, అమెరికాతో సమానంగా అగ్రరాజ్య స్థాయిలో వుండేది. ప్రపంచం రెండు బ్లాకులుగా విడిపోయి, కొన్ని దేశాలు రష్యావైపు చూసేవి. ఈ రెండు కూటముల్లో చేరడం యిష్టం లేని భారత్ వంటి దేశాలు తటస్థ లేదా అలీన దేశాలుగా వుండేవి. అయితే 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో అప్పణ్నుంచి అమెరికా పెత్తనమే చెల్లుబాటవుతోంది. యూరోప్ దానికి తోకగా మారింది. రెండు ప్రపంచయుద్ధాల్లో ఘోరంగా నాశనమైనది యూరోప్. ఓ మేరకు నాశనమైనది ఆసియా. కానీ విజేతల్లో ఒకటైన అమెరికాకు లాభమే తప్ప నష్టం ఏమీ కాలేదు. దాని పౌరులు క్షేమంగానే ఉన్నారు. వారి పరిశ్రమలపై బాంబు దాడులు జరగలేదు. పె(ర)ల్ హార్బర్‌పై దాడి ఒక్కటే అమెరికాకు కలిగిన నష్టం. యూరోప్ ఆర్థికంగా కూడా నాశనం కావడంతో అక్కడి పరిశ్రమలు, మేధావులు, పెట్టుబడిదారులు అమెరికాకు తరలి వెళ్లిపోయారు. యూరోప్ అమెరికన్, సోవియట్ బ్లాకుల మధ్య చీలిపోయి అభివృద్ధిలో వెనుకబడి పోయింది.
తన ప్రాంతంలో యుద్ధం జరగకపోవడం చేత లాభపడిన అమెరికా, అప్పణ్నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట యుద్ధం జరిగేట్లు చూస్తూ తన ఆయుధాలు అమ్ముకుంటూ వస్తోంది. సోవియట్ యూనియన్ బలంగా వున్నంతకాలం కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టి, విశ్వశ్రేయస్సు కోసం శ్రమిస్తున్నాం అంటూ యుద్ధాలు చేసింది. సోవియట్ యూనియన్ కుప్పకూలి, కమ్యూనిస్టు దేశాలన్నీ చెల్లాచెదురై పోయిన తర్వాత కూడా యుద్ధాలు ఆపటం లేదు. క్రమేపీ ప్రపంచం ఏకధృవం అయిపోయింది. ఆ ధృవం అమెరికా. అది ఏం చెప్తే అది జరుగుతోంది. ధనసహాయం చేస్తూ యూరోపియన్ దేశాలను గుప్పిట్లో పెట్టుకుంది. ఇరాక్‌లో జీవాయుధాలున్నాయని అబద్ధం చెప్పి దాడి చేసినా అదేమిటని అడిగేవాడు లేదు. పైగా తందానతాన అంటూ వంత పాడాయి కూడా. తనకు ఎదురే లేదని విర్రవీగుతున్న అమెరికాకు పుటిన్ కంటిలో నలుసులా మారాడు.
1952లో పుట్టిన పుటిన్ మైనింగ్‌లో డాక్టరేటు చేశాడు. 1975లో రష్యా గూఢచారి సంస్థ కెజిబిలో చేరి 1990 వరకు పనిచేశాడు. అనంతరం ప్రభుత్వోద్యోగిగా చేరాడు. రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ యితన్ని అభిమానించి అంచెలంచెలుగా పైకి తీసుకుని వచ్చాడు. 1999లో ఉపప్రధానిగా చేశాడు. 2000 నుంచి అధ్యక్షుడిగానో, ప్రధానిగానో ఉంటూ పాలన మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎదిరించినవాళ్ల దుంప తెంపుతున్నాడు. సోవియట్ యూనియన్‌లో కాస్తోకూస్తో బలంగా ఉన్న రష్యా నిలదొక్కుకోవడానికి పదేళ్లు పట్టింది. అప్పుడే పుటిన్ చేతికి అధికారం వచ్చింది. అతను ఏవేవో తంటాలు పడి రష్యాను ఓ స్థాయికి తీసుకుని వచ్చాడు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ఓ పెద్ద విషాదమని అతని నమ్మకం. అది మళ్లీ నిర్మించడం అసంభమే అయినా, పాత దేశాల ఒక్క తాటిపై నడవాలని అతని ఆకాంక్ష. రష్యా యీ మాత్రం బలపడడం కూడా అమెరికా సహించలేక పోతోంది. తన ఒకప్పటి ప్రత్యర్థిని పాతాళానికి తొక్కేయాలని తాపత్రయ పడుతూ వచ్చింది.
ఒకప్పటి సోవియట్ బ్లాక్‌కు చెందిన చెక్, హంగరీ, పోలెండులను 1999లో నాటోలో చేర్చుకుంది. ఐదేళ్ల తర్వాత 2004లో మరో 7 దేశాలను చేర్చుకుంది. వాటిలో రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న ఇస్టోనియా, లాట్వియా, లిథూనియాలున్నాయి. ఇస్టోనియా సరిహద్దు నుంచి రష్యాలో ముఖ్యనగరమైన సెయింట్ పీటర్స్‌బర్గ్ కేవలం 160 కి.మీ.ల దూరంలో ఉంది. 2008 వచ్చేసరికి జార్జియా, ఉక్రెయిన్‌లకు నాటోలో సభ్యత్వం యిస్తానని వాగ్దానం చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యా రాజధాని మాస్కో దూరం కేవలం 500 కి.మీ.లు! ఇలా వదిలేస్తే లాభం లేదనుకున్న పుటిన్ ఉక్రెయిన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, దాన్ని నాటో నుంచి విడిగా తీసుకురావాలనే ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఉక్రెయిన్ రాజకీయ పరిస్థితి గత పుష్కరకాలంగా ఎలా వుందో తెలుసుకుంటే, రష్యా, అమెరికాల మధ్య ఉక్రెయిన్ ఎలా నలిగిందో తెలుస్తుంది. 2010 జనవరిలో రష్యాకు అనుకూలుడైన విక్టర్ యానుకోవిచ్ 49% ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను 2002-05, 2006-07లో దేశప్రధానిగా చేశాడు. అతను 2013లో ఉక్రెయిన్–యూరోపియన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయకుండా దాన్ని తిరస్కరించాడు. దానికి బదులు రష్యా నుంచి గతంలో విడిపోయిన దేశాల ఆర్థిక సమాఖ్య ఐన యురేషియన్ ఎకనమిక్ యూనియన్‌లో చేరడం మంచిదన్నాడు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2013 నవంబరులో యూరోమైదాన్ (యూరో చౌరస్తా అని అర్థం) పేర ఉక్రెయిన్ పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. నెలలు గడుస్తున్న కొద్దీ ఆ నిరసనలు క్రమంగా పెరిగి అంతర్యుద్ధంగా మారాయి. దీన్ని ఎదుర్కోలేక 2014 ఫిబ్రవరి వచ్చేసరికి యానుకోవిచ్ దేశం విడిచి రష్యాకు పారిపోయి అక్కడ ప్రవాసంలో ఉండసాగాడు. ఈ అంతర్యుద్ధం వెనుక అమెరికా హస్తముందని రష్యాకు అనుమానం.
ఉక్రెయిన్ అమెరికాకు పూర్తిగా అంకితమై పోతే బ్లాక్ సీ ద్వారా తన వ్యాపారం ముప్పులో పడినట్లే అని రష్యా భయపడింది. మధ్యధరా సముద్రానికి రష్యాకున్న ముఖద్వారం అదొక్కటే. దాని తూర్పు తీరాన్ని రష్యా ఉక్రెయిన్, జార్జియాలతో పంచుకుంటోంది. జార్జియా అమెరికాతో మైత్రి నెరపుతూ దాని ఇరాక్, అఫ్గనిస్తాన్ యుద్ధాలలో తన సైన్యాన్ని కూడా పంపింది. అమెరికా పౌరులకు అక్కడకి వీసా కూడా అక్కరలేదు. జార్జియా, ఉక్రెయిన్ కూడా నాటోలో చేరే లాంఛనం పూర్తయితే, అవి బ్లాక్ సీ తీరాన్ని దిగ్బంధం చేసి, తన వ్యాపారమార్గాన్ని మూసేస్తాయని భయపడిన రష్యా హఠాత్తుగా దాడికి దిగి, ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని 2014 మార్చిలో ఆక్రమించేసింది. అక్కడ రష్యన్లు మెజారిటీలో ఉన్నారు కాబట్టి ప్రతిఘటన ఎదురు కాలేదు. దానితో బాటు తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్సాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు రష్యా మద్దతిచ్చింది.
క్రిమియాను రష్యా విలీనం చేసుకున్నాక, నాటో ఆర్థిక ఆంక్షలతో సరిపెట్టింది తప్ప రష్యాపై దాడి చేయలేదు. 2015లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం చేసి మిన్స్‌క్ ఒప్పందం పేర ఓ రాజీని కుదిర్చారు. దాని ప్రకారం డోన్సాస్‌లో యథాతథ పరిస్థితి కొనసాగాలి. (ఇప్పుడీ ఉద్రిక్తతలు పెరగడంతో రష్యా ఈ ప్రాంతానికి స్వతంత్ర హోదా యిస్తున్నట్లు ప్రకటించింది). దేశాధ్యక్షుడు పారిపోవడంతో 2015 మార్చిలో జరగవలసిన ఎన్నికలు 2014 మేలోనే జరిగాయి. రష్యా అధీనంలోకి వెళ్లిపోయిన క్రిమియాలో పోలింగు జరగలేదు. రష్యాకు అనుకూలురైన ప్రదర్శనకారుల భయం చేత డోన్‌బాస్ ప్రాంతంలో 20% పోలింగు బూతులలో మాత్రమే ఓటింగు జరిగింది. పోరోషెంకో అనే వ్యాపారస్తుడు 55% ఓట్లతో నెగ్గాడు.
ఇతను అమెరికాకు, నాటోకు అనుకూలుడు కాబట్టి గత అధ్యక్షుడు తిరస్కరించిన ఒప్పందంపై సంతకం పెట్టాడు. దానితో పాటు ఉక్రెయిన్ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చాడు. ఉక్రెయిన్ భాష, మతం, కాపిటలిజం వీటికి ప్రాధాన్యత యిచ్చి, రష్యా అనుకూలురను పక్కన పెట్టసాగాడు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కోసం పాకులాడాడు. 2017లో ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయించాడు కూడా. ఇతను ఎన్నికైన ఆరు నెలలకే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. మొత్తం 450 సీట్లలో పెట్రో పోరోషెంకో బ్లాక్ అనే పార్టీకి 132 సీట్లు వచ్చాయి. దాంతో అది మరో నాలుగు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచింది. ఏట్సెన్యూక్ అనే అతను ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత భాగస్వామ్య పక్షాల్లో విభేదాలు రావడంతో ఒక్కొక్కరు తప్పుకున్నారు. 2016 కల్లా ప్రధాని మారాడు. రాజకీయ అస్థిరత కారణంగా పాలన సరిగ్గా సాగలేదు. పైగా అవినీతి పెరగడం, రష్యన్ల పట్ల వివక్షత, విపరీతజాతీయవాదం కారణంగా 2019 అధ్యక్ష ఎన్నికలు వచ్చేసరికి పోరోషెంకోకి 25% ఓట్లు రాగా, ప్రత్యర్థి వ్లదీమీర్ జెలెన్‌స్కీకి 73% ఓట్లు వచ్చాయి.
44 ఏళ్ల జెలెన్‌స్కీ రష్యన్ మాతృభాషగా కలిగిన యూదుడు. న్యాయశాస్త్రం చదివినా టీవీ సీరియళ్లలో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ‘సర్వెంట్ ఆఫ్ ద పీపుల్’ పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో అందరూ రాజకీయాలకు కొత్తవారే. తను అధ్యక్షుడవుతూనే పార్లమెంటులో సంకీర్ణ ప్రభుత్వానికి మెజారిటీ లేదంటూ దాన్ని మేలో రద్దు చేసి మూడు నెలలు ముందుగానే 2019 జులైలో ఎన్నికలు నిర్వహించాడు. అతని పార్టీకి 43% ఓట్లతో 254 సీట్లు (మొత్తం 450) వచ్చాయి. కొత్త ఎంపీలలో 80% మంది పార్లమెంటుకి కొత్త, 61% మంది రాజకీయాలకే కొత్త. ఈ ప్రభుత్వం వచ్చాక తూర్పు ప్రాంతంపై వివక్షత చూపసాగింది. రష్యన్ టీవీ ఛానెల్స్‌ను రద్దు చేసింది, అధికారిక భాషల్లోంచి రష్యన్‌ను తీసివేసింది. విదేశాంగ విధానం మార్చుకుని, అమెరికా, యూరోప్‌లతో స్నేహం పెంచుకుంది. జెలెన్‌స్కీ నాటోలో చేరుదామని తెగ ఉబలాట పడ్డాడు. నాటోలో చేర్చుకోమని 2021 జనవరిలో బైడెన్‌ను అభ్యర్థించాడు.
ఆ ఆతృత చూసి రష్యా నార్డ్ స్ట్రీమ్ 2 పనుల వేగాన్ని పెంచింది. రష్యా గ్యాస్ పైపులైను ఉక్రెయిన్ ద్వారా యూరోప్‌కు వెళుతుంది కాబట్టి, ట్రాన్సిట్ చార్జీలు రూపేణా ఉక్రెయిన్‌కు మంచి ఆదాయం వస్తూ వుంటుంది. కానీ ఉక్రెయిన్ వ్యవహారాలు చూస్తే ఎప్పుడు తిరకాసు వస్తుందో తెలియకుండా వుంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో గ్యాసు సరఫరా చేయాలని రష్యా తన వాయువ్య ప్రాంతం నుంచి జర్మనీ వరకు పైప్ లైన్ వేయించింది. నార్డ్ స్ట్రీమ్ 1 పేర 2011మేలో మొదలుపెట్టి నవంబరు కల్లా పూర్తి చేసింది. దాని రెండో లైను 2012 అక్టోబరు కల్లా పూర్తయింది. తర్వాత నార్డ్ స్ట్రీమ్ 2 పేర 1100 కోట్ల డాలర్ల ఖర్చుతో జర్మనీ వరకు 1222 కి.మీ.ల మేర పైప్‌లైన్ 2018లో మొదలుపెట్టారు. జెలెన్‌స్కీ వ్యవహారం చూశాక పనులు వేగవంతం చేసి 2021 జూన్ కల్లా దాదాపు ముగించాడు.
ఇప్పుడు ఉక్రెయిన్ ద్వారా రష్యా గ్యాసు పంపిణీ తగ్గించడంతో ఉక్రెయిన్ ఆదాయం తగ్గిపోయింది. ఉక్రెయిన్ కరెన్సీ విలువ గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి వచ్చేసింది. ఇక రష్యా విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో 6.3 లక్షల మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అందువలన అగ్రరాజ్యాలు ఆర్థిక ఆంక్షలు విధించినా, యిప్పట్లో రష్యాకు ముప్పు లేదు. పైగా చైనా మద్దతు ఉంది. ఒకప్పుడు సోనియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆర్మేనియా, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, బెలారస్‌లు రష్యాకి మద్దతుగా నిలిచాయి. ఎందుకంటే ఇవి రష్యాతో కలక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సిఎస్‌టివో) పేర ఒప్పందం చేసుకున్నాయి.
అవే కాదు, రష్యాపై దండెత్తడానికి, ఆంక్షలు విధించడానికి నాటో దేశాలు కూడా వెనకాడతాయి. ఎందుకంటే అవి తమ గ్యాస్ అవసరాలకు రష్యాపై ఆధారపడుతున్నాయి. యూరోప్ దేశాల గ్యాసు అవసరాల్లో సరాసరిన 40%, ముడి చమురు విషయంలో 30% రష్యాయే తీరుస్తోంది. జర్మనీ గ్యాసు దిగుమతుల్లో రష్యా గ్యాస్ వాటా 65%, ఇటలీ విషయంలో యిది 43, టర్కీ 34, నార్వే 30, నెదర్లాండ్స్ 26, ఫ్రాన్స్ 17. గతేడాది యూరప్‌కు రష్యా 1.75 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మింది. దీనిలో నాలుగో వంతు పైప్‌లైన్స్ ద్వారా పంపింది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్నాయని 2021లో యూరోప్ దేశాలకు రష్యా అదనపు గ్యాసు సరఫరాలను ఆపేస్తే యూరోప్‌లో గ్యాస్ ధరలు ఏకంగా 8 రెట్లు పెరిగి ఆర్థికంగా దెబ్బ తిన్నాయి. గ్యాసు కోసం అమెరికాపై ఆధారపడితే దానికి రెట్టింపు ఖర్చవుతుంది. అదీ యూరోప్ యుద్ధంలోకి దిగకపోవడానికి కారణం. పైగా రష్యాకు ప్రత్యామ్నాయంగా యూరోప్‌కు గ్యాసు పంపాలంటే అమెరికా రోజుకి 1.27 షిప్పుల గ్యాస్ అదనంగా పంపాలి. దానివలన అమెరికాలోనే కొరత ఏర్పడి ప్రజల్లో అసంతృప్తి కలగవచ్చు.
ఇలాటి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టడం తెలివైన పని కాదు. ఎందుకంటే ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం లేదన్నమాటే కానీ దాదాపుగా ఆ సౌకర్యాలన్నీ యిప్పటికే ఉన్నాయి. పైగా ట్రంప్ నాటో నుంచి అమెరికా బయటకు వచ్చేస్తుందని 2018లోనే ప్రకటించాడు. బైడెన్ ఏం ప్లాను వేశాడో ఏమిటో కానీ ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోబోమని అమెరికా గతంలో యిచ్చిన హామీని తుంగలోకి తొక్కి, చేరమని దాన్ని ఆహ్వానిస్తూ, రష్యా యుద్ధానికి వస్తే సిద్ధంగా వుండంటూ, ఆయుధాలు తాము పంపి, నాటో దేశాల చేత పంపించి నీకేం భయం లేదంటూ ఉక్రెయిన్‌ను ఉసిగొల్పాడు. ఉక్రెయిన్ నాటోలో చేరితే మా భద్రతకు ముప్పు కాబట్టి మేము చూస్తూ ఊరుకోము. ‘నాటోలో చేరము’ అని ఉక్రెయిన్ మాకు లిఖితపూర్వకంగా హామీ యిచ్చి తటస్థంగా వుండాల్సిందే, లేకపోతే మేం దాడి చేస్తాం జాగ్రత్త అని రష్యా మూణ్నెళ్లగా సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరిస్తూ హెచ్చరిస్తూనే వుంది. అయినా అమెరికా, నాటో దేశాల అండ చూసుకుని జెలెన్‌స్కీ ఎగిరెగిరి పడ్డాడు. చూసి చూసి రష్యా విరుచుకు పడింది.
దాడి జరిగాక రష్యాను నిలవరించేందుకు అమెరికా కానీ, నాటో సభ్యదేశాలు కానీ గట్టి ప్రయత్నాలు ఏవీ చేయకపోవడంతో జెలెన్‌స్కీ నిరాశపడ్డాడు. అవి ఆయుధాలు పంపుతున్నాయి తప్ప సైనికులను పంపటం లేదు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంట బలగాలను పెంచాయి తప్ప దాని రక్షణకు కదిలి రాలేదు. గత మూడు నెలల్లో అమెరికా ఉక్రెయిన్‌కు 90 టన్నుల ఆయుధాలను యిచ్చింది. బ్రిటన్ కూడా ఆయుధాలు పంపింది. కానీ బలగాలను కూడా పంపమని జెలెన్‌స్కీ వేడుకున్నాడు. అఫ్గనిస్తాన్‌లో అష్రాఫ్ ఘనీ బతుకేమైందో తెలిసి కూడా అతను పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు యితన్ని కూడా అమెరికా తీసుకుపోయి రక్షిస్తానంది. ఇతను వద్దన్నాడు. కీవ్‌లోనే ఉన్నాను, పారిపోయానన్న వార్తలు ఖండిస్తున్నాను అంటూ సెల్ఫీ వీడియో రిలీజు చేశాడు.
రష్యా దాడి తర్వాత అమెరికా రష్యాపై ఆంక్షలు విధిస్తూనే ఒక మెలిక పెట్టింది. యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు అమల్లోకి తెచ్చినపుడే తనూ అమలు చేస్తామని చెప్తోంది. ఎందుకంటే అమెరికాకు, రష్యాకు మధ్య వాణిజ్య సంబంధాలున్నాయి. 2021లో అమెరికా రష్యాకు 6388 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసి, 29,695 మి.డా. విలువైన దిగుమతులు చేసుకుంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం లేదని, దాని ఆర్మీని తగ్గించి, నేరాలకు పాల్పడినవారిని శిక్షించడమే తమ లక్ష్యమని పుటిన్ అంటున్నాడు. చర్చలు జరిగాయి. నాటోలో చేరము అని లిఖితపూర్వకంగా హామీ యివ్వాలని పుటిన్, ముందు సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జెలెన్‌స్కీ పట్టుబట్టి కూర్చున్నారు. ఏమౌతుందో వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. అమెరికా, యూరోప్ దేశాల స్వార్థపరత్వం ఎలా వుంటుందో హాస్యపాత్రల ద్వారా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన జెలెన్‌స్కీ తెలుసుకోక పోవడం వలన అతని రాజకీయజీవితం విషాదాంతంగా ముగియబోతోంది. (ఫోటో – జెలెన్‌స్కీ, పుటిన్)