మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యానంతర పరిస్థితులు వైఎస్ కుటుంబంలో చీలక తెచ్చాయి. ఒకరిపై ఒకరు హత్యారోపణలు చేసుకోవడం వైఎస్సార్ అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత విభేదాలు కాస్త వీధికెక్కాయి. వివేకా హత్యలో దోషులు మీరంటే, కాదు మీరని వైఎస్ జగన్, డాక్టర్ సునీత పరస్పరం ఆరోపించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
వివేకా హత్యలో అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్రపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమానం వ్యక్తం చేశారనే సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో అసలు వివేకా హత్యకు జగనే పథక రచన చేసి వుంటారని సీబీఐకి డాక్టర్ సునీత భర్త వాంగ్మూలం ఇచ్చి పొలిటికల్ బాంబ్ పేల్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆ సంగతేంటో తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా సీబీఐకి వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇచ్చిన వాంగ్మూలం, ఇవాళ ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలం తెరపైకి వచ్చాయి. వీటిపై తీవ్ర చర్చ జరుగుతోంది. డాక్టర్ సునీత వాంగ్మూలం ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సీబీఐ విచారించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన మామ హత్యలో ఏకంగా జగన్‌నే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి అనుమానించడం సంచలన పరిణామంగా చెప్పొచ్చు. తద్వారా తనపై జగన్ అనుమానాలు, ఆరోపణలకు రాజశేఖరరెడ్డి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనతో ఏమన్నారో డాక్టర్ సునీత మాటల్లో…
‘మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్)ను కోరా. అనుమానితుల పేర్లు కూడా చెప్పా. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేశా’ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
డాక్టర్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు జగనే… వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి వుంటారన్నది తన అభిప్రాయమని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐతో అన్నారు. ఈ సందర్భంగా విశాఖలో జగన్‌పై కోడికత్తి దాడిని ఉదహరించడం గమనార్హం. ఆ దాడిలాగే జగన్ తన మామ వైఎస్ వివేకా హత్యకు పథక రచన చేసి వుంటారని నర్రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ ….సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపుతోంది.
డాక్టర్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలంలో వ్యక్తపరిచిన అనుమానాల నేపథ్యంలో జగన్‌పై రాజకీయ దాడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు… జగన్, డాక్టర్ సునీత కుటుంబాల మధ్య మరింత ఎడం పెంచే అవకాశాలున్నాయి. మొత్తానికి అసలు విషయం పక్కకు పోయి, ఇతరేతర విషయాలన్ని తెరపైకి వస్తూ వైఎస్ కుటుంబానికి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో!