వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీలోని అన్ని అనుబంధ సంఘాలకు విజయసాయిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఇది విజయసాయిరెడ్డికి అతిపెద్ద బాధ్యత. ఈ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అలంకారంతో పాటు ముళ్ల కిరీటం కూడా. ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
అలాగే పార్టీ పరంగా ఆయన వైసీపీ ప్రధాన కార్యదర్శి. ఇది కూడా కీలక పదవే. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీలోని అన్ని అనుబంధ సంఘాలు కీలకంగా పని చేశాయి. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలనే కసి, పట్టుదల పార్టీ అనుబంధ సంఘాలన్నింటిలోనూ ఉండింది. పార్టీలో కిందిస్థాయి కార్యకర్త మొదలుకుని, నాయకుల వరకూ అందరూ కష్టపడి జగన్‌ను సీఎం చేసుకుని సంతోషించారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదనే అసంతృప్తి వైసీపీ కార్యకర్త మొదలుకుని, నాయకుల వరకూ అందరిలోనూ బలంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నదే తప్ప, పార్టీ పరంగా ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే, పార్టీని ప్రభుత్వ పెద్దలు గాలికి వదిలేశారనే విమర్శ లేకపోలేదు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రక్షాళన చేపట్టారు.
ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డికి పార్టీ అనుబంధ సంఘాల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా ఆయనకు సైన్యాధ్యక్ష బాధ్యతలనే చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి తాజా బాధ్యతలు పెద్ద సవాలే అని చెప్పాలి.
పార్టీలోని వివిధ అనుబంధ సంఘాల్లోని కార్యకర్తలు, నాయకుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని పోగొట్టి, తిరిగి ఎన్నికలకు గతంలో మాదిరిగా సమాయత్తం చేసే బాధ్యతను విజయసాయిరెడ్డి విజయవంతంగా నిర్వహించాల్సి వుంటుంది.
ఇది చేయడం అంత సులభం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వస్తుందని చెప్పి, అటు వైపు నడిపించడం సులభం. కానీ అధికారం వచ్చి మూడేళ్లవుతున్నా, తమకేమీ జరగలేదనే అసంతృప్తిని పోగొట్టడం పెద్ద టాస్కే. మరి విజయసాయిరెడ్డి తన ముందున్న కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చుతారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.