‘ఛీ’బీఐ… లీకుల‌పై మండిపాటు!

అది సీబీఐ కాదు… ‘ఛీ’బీఐ అని వివేకా హ‌త్య కేసులో సాక్షులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మంచి మ‌నిషిగా, ప్ర‌జాసేవ చేసే రాజ‌కీయ నాయ‌కుడిగా పేరొందిన వైఎస్ వివేకా హ‌త్య కేసు అంద‌ర్నీ క‌ల‌చివేసింది.…

అది సీబీఐ కాదు… ‘ఛీ’బీఐ అని వివేకా హ‌త్య కేసులో సాక్షులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మంచి మ‌నిషిగా, ప్ర‌జాసేవ చేసే రాజ‌కీయ నాయ‌కుడిగా పేరొందిన వైఎస్ వివేకా హ‌త్య కేసు అంద‌ర్నీ క‌ల‌చివేసింది. అలాంటి మ‌నిషికి ఇలాంటి చావు రావ‌డంపై క‌డ‌ప జిల్లా ప్ర‌జానీకం త‌ల్ల‌డిల్లింది. వివేకా హ‌త్య కేసులో దోషులెవ‌రో తెలుసుకోవాల‌ని పౌర స‌మాజం కోరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత పోరాట ఫ‌లితంగా సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

క‌రోనా కార‌ణంగా సీబీఐ విచార‌ణ మొద‌ట్లో కొంత మంద‌గించింది. ఆ త‌ర్వాత సీబీఐ దూకుడు పెంచింది. ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి, చూస్తున్నాయి. త‌మ‌కు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల‌ను సీబీఐ తెర‌పైకి తేవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఈ సంద‌ర్భంగా క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, వారి ముఖ్య అనుచ‌రుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డిలే నిందితులన్నట్టుగా వాంగ్మూలాలు ఉన్నాయి.

వివేకా హ‌త్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డిల పాత్ర గురించి అవినాశ్ సొంత పెద‌నాన్న వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి, మ‌రో పెద‌నాన్న మ‌న‌వ‌డు డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిల‌తో పాటు సామాన్యులైన వంట మ‌నిషి ల‌క్ష్మి, తాజాగా క‌ల్లూరు గంగాధ‌ర్‌రెడ్డి, జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, సీఐ శంక‌ర‌య్య‌, డీఎస్పీ వాసుదేవ‌న్‌, పులివెందుల నివాసి ఆర్‌.వెంక‌ట‌ర‌మ‌ణ ఇలా అనేక మంది సీబీఐకి వాంగ్మూలాలు ఇచ్చారు.

తాము చెప్పే సంగ‌తుల్ని సీబీఐ ఇలా బ‌య‌ట‌పెడుతుంద‌ని సాక్షులెవ‌రూ భావించ‌లేదు. ఇలాంటి ప‌రిణామాలుంటాయ‌ని వూహించి వుంటే నిజాలు చెప్పి వుండేవాళ్లం కాద‌ని స‌న్నిహితుల వ‌ద్ద సాక్షులు వాపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌ల్లూరు గంగాధ‌ర్‌రెడ్డినే తీసుకుందాం. ఇటీవ‌ల సీబీఐపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసి వార్త‌ల‌కెక్కారు. కానీ ఆయ‌న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన‌ట్టు వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం.

వివేకా హ‌త్య కేసును త‌న‌పై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామ‌ని దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు క‌ల్లూరు గంగాధ‌ర్‌రెడ్డి వాంగ్మూలం ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అంతటితో ఆయ‌న ఆగ‌లేదు. క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్క‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి వివేకాను హ‌త్య చేయించిన‌ట్టు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి త‌న‌తో చెప్పార‌ని క‌ల్లూరు గంగాధ‌ర్‌రెడ్డి త‌న వాంగ్మూలంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

సీబీఐ విచార‌ణ ఎదుర్కొన్న సామాన్యులు, ప్ర‌ముఖులు ప్ర‌స్తుతం ఆ సంస్థ ఉద్దేశ పూర్వ‌కంగా లీకులు ఇస్తున్న నేప‌థ్యంలో భ‌యంతో వ‌ణికిపోతున్నారు. సీబీఐ విచార‌ణ‌లో తాము చెప్పిన అంశాలు బ‌య‌టికి వ‌స్తుండ‌డంతో భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప్ర‌మాదం ముంచుకొస్తుందోన‌నే భ‌యం సాక్షుల‌ను వెంటాడుతోంది. 

సీబీఐని న‌మ్మి నిజాలు మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుందేమో అని సాక్షుల కుటుంబాలు ఆందోళ‌న చెందుతున్నాయి. కానీ జ‌నాల‌కు నిజాలు తెలియ‌చెప్పాల‌నే ఉద్దేశంతోనే రోజువారీగా కొంద‌రి వాంగ్మూలాల‌ను తెరపైకి తెస్తున్న‌ట్టు సీబీఐ అధికారుల వాద‌న‌. ఏది ఏమైనా పెద్ద వ్య‌క్తుల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కావ‌డంతో క్ష‌ణక్ష‌ణం భ‌యంతో సాక్షులు బత‌కాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.