భారీ డిస్కౌంట్లు.. వాహనదారులకు బంపరాఫర్లు

పండగ ఆఫర్లు, డిస్కౌంట్ మేళాలు మనం చూస్తుంటాం. అలానే తెలంగాణ పోలీస్ శాఖ కూడా ఓ బంపరాఫర్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది.…

పండగ ఆఫర్లు, డిస్కౌంట్ మేళాలు మనం చూస్తుంటాం. అలానే తెలంగాణ పోలీస్ శాఖ కూడా ఓ బంపరాఫర్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ ఆఫర్లు అమల్లోకి వస్తాయి. మార్చి నెల మొత్తం ఉంటాయి.

మీ బైక్, కారు లేదా హెవీ వెహికల్ పై చలాన్లు ఉంటే క్లియర్ చేసుకునేందుకు తెలంగాణ పోలీసులు ఈ అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బైకులపై ఉన్న చలాన్లు క్లియర్ చేసుకుంటే 75 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీ బైక్ పై 1000 రూపాయలు ఫైన్ ఉటే.. 250 రూపాయలు (సర్వీస్ ఛార్జ్ అదనం) చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఇదే విధంగా కారులపై 50శాతం, బస్సులకు 30శాతం డిస్కౌంట్లు ప్రకటించారు.

గడిచిన నాలుగేళ్లలో 6 కోట్లకు పైగా చలాన్లు విధించారు పోలీసులు. అయితే వీటిలోంచి కేవలం 50శాతం మాత్రం డబ్బు వసూలు జరిగింది. మిగతా చలాన్లన్నీ అలా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని క్లియర్ చేయాలంటే.. ఈ-చలాన్ అదాలత్ ఒక్కటే మార్గం. అందుకే తెలంగాణ పోలీసులు ఈ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించారు. ఈరోజు లేదా రేపు ఈ ప్రతిపాదనలకు అమోదముద్ర రాబోతోంది.

మరోవైపు కరోనా నిబంధనల ఉల్లంఘనల జరిమానాల్ని కూడా ఈ-చాలన్ అదాలత్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. కరోనా టైమ్ లో మాస్క్ లేకుండా తిరిగిన వాళ్లకు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఇలా 2020 మార్చి నుంచి 13 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటికి కూడా భారీ డిస్కౌంట్లు ఇచ్చి చలాన్లను క్లియర్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.