భీమ్లా నాయక్ సినిమా ఎలా ఉంది.. నచ్చితే బాగుందని చెప్పడానికి ఇబ్బంది లేదు, కానీ నచ్చకపోతే బాగోలేదని చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి సినిమా “ఫ్యాన్స్ మూవీ” అనే విషయం రూఢీ అయిపోయింది.
పవన్ ని మరీ అంతగా నరనరానా ఎక్కించుకోనివారి పరిస్థితి ఏంటి..? సినిమాని సినిమాగా చూసి పర్వాలేదు, మరీ అంత గొప్పగాయేం లేదు అని చెప్పాలనుకుంటున్నవారి పరిస్థితి ఏంటి..? అలా చెబితే కచ్చితంగా వారిపై వైసీపీ ముద్ర వేస్తున్నారు.
సినిమా ఎలా ఉందంటే.. అని సాగదీసినా చాలు.. మీది ఏ పార్టీ అని అడిగేస్తున్నారు. ఇదీ ఇప్పుడు ఏపీలో పొలిటికల్-సినిమా సీన్. భీమ్లా నచ్చితే టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి అభిమాని. నచ్చకపోతే కచ్చితంగా వైసీపీ సానుభూతిపరుడేనని లెక్కకడుతున్నారు.
పార్టీల పరంగా చీలిన తొలి సినిమా..
ఇప్పటివరకూ వచ్చిన సినిమాలేవీ పార్టీల పరంగా చీలికలు తేలేదు. అభిమానులు ఆదరించారు, సినిమా బాగుంటే మిగతా వర్గాలు కూడా ఆదరిస్తాయి. అఖండ సినిమాని పొలిటికల్ మూవీగా చూస్తే సినిమాపై హిట్ ముద్ర పడేదా..? మరి భీమ్లా నాయక్ బంపర్ హిట్ అనుకుంటున్నవాళ్లంతా మా బలం పెరిగిపోయింది, మా బలగం పెరిగిపోయింది, వైసీపీ అసంతృప్తులంతా మావైపు వచ్చేయండి అని స్లోగన్లు ఇవ్వడం ఎందుకు..? సినిమా సినిమానే.. రాజకీయం రాజకీయమే.
రాజకీయాల్లో వేగలేకపోయిన చిరంజీవి.. సినిమాల్లో రీఎంట్రీ తర్వాత ఏ రేంజ్ లో విజృంభిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అన్ని పార్టీల జనాలు చూడబట్టే అది సాధ్యయమైంది. కానీ పవన్ అభిమానులు మాత్రం భీమ్లా నాయక్ ని పొలిటికల్ హిట్ గా భావిస్తున్నారు. సినిమా హిట్టైంది కాబట్టి, మళ్లీ సీఎం సీఎం అనే స్లోగన్లు థియేటర్స్ లో అదిరిపోతున్నాయి.
ఇక సినిమా రిజల్ట్ విషయానికొస్తే.. ఎంత గొప్ప సినిమా అయినా కొంతమంది పెదవి విరవడం సహజమే. అందులోనూ ఒరిజినల్ మూవీలోని ఆత్మని పక్కనపెట్టి ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాగా భీమ్లాకి పేరుపడింది. మలయాళ మూవీ చూసినవారికి భీమ్లా పెద్దగా ఎక్కట్లేదు. పోనీ చూడనివారికైనా అది మరీ అంత గొప్పగా ఉందా అంటే.. చాలా చోట్ల అతి బాగా కనపడిందని అంటున్నారు. కానీ ఆ మాట చెప్పడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదు.
తొలిరోజు సినిమా యావరేజ్ అన్నవారందరిపై వైసీపీ ముద్రవేశారు. భీమ్లా నచ్చనివాళ్లంతా వైసీపీ సానుభూతిపరులనే ప్రచారాన్ని భారీ ఎత్తున చేశారు. దీనికి టీడీపీ సోషల్ మీడియా కూడా ఇతోథికంగా సాయపడింది. అందుకే కొంతమంది.. మాకు వైసీపీపై అభిమానం లేదు కానీ భీమ్లా మాకు నచ్చలేదని మొహమాటం లేకుండా చెబుతున్నారు. నిజాయితీగా రివ్యూ ఇచ్చేవారిని జనసైనికులు ఉండనిచ్చేలా లేరు!