వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ మరియు న్యాయస్థానం కంటె ముందుగా తామే పరిష్కరించేసి, దోషులకు శిక్ష కూడా విధించేయాలనే ఆరాటం పచ్చ మీడియాలో చాలానే కనిపిస్తోంది. ఈ క్రమంలో వారు సీబీఐ విచారణలో భాగంగా వెల్లడించిన వాంగ్మూలాల సిరీస్ ను ప్రచురిస్తున్నారు.
సీబీఐ రికార్డులు మొత్తం పచ్చమీడియా ఆఫీసుల్లోనే ఉన్నట్టుగా.. వాటినుంచి రోజుకు కొంత భాగం మాత్రం ప్రచురిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉండే హాట్ హాట్ వెబ్ సిరీస్ కంటె హాట్‌గా ఈ వార్తలను తీర్చిదిద్ది.. సిరీస్‌గా వారు అందిస్తున్నారు. ఇదంతా ఓకే.. కానీ, వాంగ్మూలాల్లో వెల్లడించిన వివరాలు అంటూ.. ఆ వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులు, వారి పేర్లు, ఊరి వివరాలు సమస్తం ప్రచురించేస్తున్నారు.
ఇలా చేయడం ద్వారా.. ఈ పచ్చ పత్రికలు తమ అత్యుత్సాహంతో సదరు వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి కేసును అందరికంటె ముందు తామే పరిష్కరించేయాలనే ఉత్సాహంలో దూకుడుగా వెళుతున్న ఈ పచ్చ పత్రికలు.. ఆ ఊపులో పత్రికలు పాటించాల్సిన నైతిక విలువలను కూడా మరచిపోతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పత్రికలకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వార్తారచనలో కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మహిళ తన మీద అత్యాచార యత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ వార్త రాయడంలోనూ కొంత కనీససంస్కారం పాటించాల్సి ఉంటుంది. అసలు అత్యాచారమే జరగిఉండకపోవచ్చు కూడా.. ఆ ఫిర్యాదు ఫేక్ అయి ఉండొచ్చు కూడా.. కానీ వార్త రాసేప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ పేరు రాయకుడా నైతికవిలువలు పాటించాలి.
పేరు రాయకపోవడం అంటే ఆమె ఎవరో పాఠకులకు తెలియకుండా చూడాలన్నది అలాంటి నైతిక విలువల వెనుక అంతరార్థం. కానీ.. పత్రికలు విలువలు విడిచిపెట్టేసిన, విలువలు తెలియని కుహనా జర్నలిజం ప్రమాణాలను పాటించే పత్రికలు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాయంటే.. మహిళ పేరు మాత్రం రాయకుండా, ఫలానా వ్యక్తి భార్య, ఫలానా ఆఫీసులో పనిచేస్తున్న మహిళ అంటూ సమస్త వివరాలను రాసేస్తున్నారు. ఆ వార్త చదివిన స్థానికులు ఎవరైనా సరే.. చిటికెలో ఆమె పేరు చెప్పగలిగేలా వార్త రాస్తున్నారు. ఇది తెలియనితనమో, అత్యుత్సాహమో అర్థంకాని.. జర్నలిజం నైతిక విలువల పతనం.
తాజా సందర్భం విషయానికి వస్తే..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ముందే చెప్పుకున్నట్లు సీబీఐ కంటె ముందు తామే దర్యాప్తు చేయాలని ఈ పచ్చపత్రికల ఉబలాటం. సీబీఐ కు ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ వారు సిరీస్ ను ప్రచురిస్తున్నారు. సీబీఐ వాళ్లు ఈ పచ్చపత్రికలను రహస్యంగా పిలిచి.. డాక్యుమెంట్లు అప్పగించేస్తున్నారా అని ప్రజలకు అనుమానం కలిగేలా ఈ సిరీస్ వివరాలు క్రమం తప్పకుండా వస్తున్న్నాయి.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటేనే రహస్య పత్రాలను బయటకు లాక్కొచ్చి ప్రచురించడం గనుక.. సీబీఐకు తెలియకుండా ఆ పత్రాలను ఈ పత్రికలు తమ ప్రతిభతో సేకరించి వివరాలు ప్రచురిస్తూ ఉంటే గనుక.. అది సీబీఐ చేతగానితనం కింద లెక్క! పోనీ ఆ మేరకు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ముచ్చట వారికి ఉందనుకోవచ్చు.
ఆ సంగతి కూడా పక్కన పెడితే.. ఏ వివరాలను అందిస్తున్నారు. దాని పర్యవసానాలు ఎలా ఉండొచ్చు అనే కనీస స్పృహ పచ్చ మీడియాకు లేకపోతే ఎలా? దస్తగిరి, రంగన్న లాంటివాళ్లు హత్యోదంతంలో కీలకంగా ఉన్నవారు గనుక.. వారి పేర్లలో దాపరికం అక్కర్లేదు గనుక.. ఆ వివరాలు ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు. సంఘటన స్థలం వద్ద ఉన్న పులివెందులలోని సామాన్య ప్రజలు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా వారి పేర్లతో సహా ప్రచురించేస్తున్నారు.
ఇంతకూ ఈ పచ్చకామెర్ల వార్తల్లోని వివరాలు సదరు సామాన్యులు వెల్లడించారో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. సీబీఐ పత్రాల్లో వివరాలు కొంత భిన్నంగా ఉండవచ్చు కూడా! అలా ఉండడానికి అవకాశం ఉంది. అయితే.. వీళ్లు అలాంటి సామాన్యవ్యక్తుల పేర్లతో.. వారు చెప్పారంటూ.. కేసులోని నిందితుల మీద మరింత ఘాటైన విమర్శలను గుప్పించేస్తే.. సదరు వాంగ్మూలాలు అధికారికంగా వెలుగుచూసేలోగా.. వారికి ఎవరైనా హాని తలపెడితే ఎవరిది బాధ్యత. ఈ పచ్చమీడియాకు ఆ మాత్రం నైతిక బాధ్యత లేకుండా పోయింది.
ఈ పత్రికల్లో కొన్ని వెర్రిమొర్రి అపభ్రంశపు కథనాలు వస్తుంటాయి. స్పైసీగా పాఠకుల్ని చదివించడం కోసం.. ‘అక్కా అని పిలుస్తూనే నాతో పక్క పంచుకోవాలన్నాడు..’, ‘నా స్నేహితురాలి మీద మా ఆయన మనసు పడ్డాడు.. ఏం చేయాలి?’ లాంటి ముదనష్టపు వార్తలను కౌన్సెలింగ్ పేరుతో, హృదయంలో మాట, గుండెల్లో ఊట లాంటి ముదనష్టపు శీర్షికలతో అందిస్తుంటారు.
ఆ శీర్షికలకు ఎవ్వరూ రాయకపోయినా సరే.. ఆఫీసులోనే ఒక కథను వండి వార్చేసి ఆ శీర్షిక కింద వేస్తుంటారు. అలాంటి చెత్త కథనాలలో– తామేదో చాలా గొప్పగా నైతిక విలువలు పాటిస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి.. ఆ చెత్త చెప్పే అమ్మాయి పేరు రాసి, పక్కన బ్రాకెట్లలో ‘పేరు మార్చాం’ అని తగిలిస్తారు. అక్కడికేదో ఆ అమ్మాయి పేరు గోప్యతను కాపాడడానికి వీరు కంకణం కట్టుకున్న బిల్డప్ ఇస్తారు. రాసేవే అబద్ధపు కథనాలు, అందులో మళ్లీ ఈ బిల్డప్ వేరే ఉంటుంది.
అలాంటి పచ్చ మీడియా.. ఇలాంటి నేరవార్తలు, వాంగ్మూలాలను ప్రచురించేప్పుడు.. తమకు డాక్యుమెంట్లు అప్పనంగా దొరికాయి కదా అని వారి పేర్లతో ప్రచురించేస్తే.. వారికి ఏదైనా హాని జరిగితే ఎవరిది బాధ్యత. ‘పులివెందులకు చెందిన ఒక వ్యక్తి’ వాంగ్మూలంలో ఇలా ఉన్నదని ప్రచురిస్తే వీళ్ల క్రెడిబిలిటీ ఏమైనా పోతుందా? అసలు వీళ్లకి క్రెడిబిలిటీ ఉన్నదా? వీళ్లు ఎన్ని వంకర వంటకాలు ప్రచురించినా.. వాటిని పచ్చపాఠకులు ముచ్చటగా చదువుకోవాల్సిందే తప్ప.. తటస్థపాఠకులు, ఆలోచన పరులు వాటిని నమ్మే స్థితిలో ఉన్నారా?
అలాంటప్పుడు.. వీళ్లు వాంగ్మూలాల్లోని వ్యక్తుల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం ఎందుకు? పచ్చ మీడియాకు ఎంతటి కక్షలు, వైషమ్యాలు అయినా ఉండవచ్చు గాక.. కానీ కొంత ఆలోచన కూడా ఉంచుకుంటే మంచిది.