జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు.. ఒక పాచిపోయిన రాజకీయ టెక్నిక్ ను ఫాలో అయ్యే పనిలో ఉన్నారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని, విధించిన ఆంక్షలను ఖండించే వారు ఒకరు కావాలి.
పవన్ వందిమాగధ భజన బృందాలు, ఆయన సోదరుడు నాగబాబు ఎటూ ఖండిస్తూనే ఉన్నారు కదా అని మీకు అనిపించవచ్చు. వీళ్లు చాలరు. తటస్థులనే ముద్ర ఉన్నవాళ్లు ఎవరైనా ఖండించేట్లయితే అలాంటి వాళ్లు కావాలి. సదరు ఖండించే వీరాగ్రేసరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారైతే ఇంకా మంచిది. వారిని తమ పార్టీలో చేర్చుకుని నెత్తిన పెట్టుకుని పూజించడానికి కూడా వారు సిద్ధంగానే ఉన్నారు.
ప్రాథమికంగా, అలా ఎవరైనా ఖండించినట్లయితే.. తమ హీరో చిత్రం విడుదల పట్ల ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని సొంత పార్టీ వాళ్లే అసహ్యించుకుంటున్నారంటూ.. రాష్ట్రమంతా డప్పు కొట్టుకోవడానికి పవన్ కల్యాణ్ దళం ఉత్సాహపడుతున్నది. అందుకే, వైసీపీలోని ఎవడో ఒక ఊరూపేరూ లేని కార్యకర్తకు అయినా సరే.. ఎరవేసి, తాయిలం పెట్టి తమ పార్టీలోకి తీసుకురండి.. వారితో ప్రభుత్వం వైఖరిని ఖండింపజేయండి అని జనసేన నాయకులు పురమాయిస్తున్నారు. అయితే వారి ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.
ఇలాంటి చీప్ చవకబారు టెక్నిక్‌ను గతంలో చంద్రబాబునాయుడు కూడా వాడారు. నిజానికి చంద్రబాబునాయుడు స్కూల్లో పాఠాలు నేర్చుకునే, రాజకీయాలు నడుపుతున్న పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని కూడా అచ్చంగా చంద్రబాబు తరహాలోనే డీల్ చేయాలని అనుకుంటూ ఉండడమే తమాషా!
గతంలో చంద్రబాబునాయుడు వ్యవహారం అసెంబ్లీలో అల్లరి అయినప్పుడు.. ఆయన బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయమై.. ప్రకాశం జిల్లాలోని ఒక కానిస్టేబుల్ తాను మనస్తాపం చెందానని, చంద్రబాబునాయుడు గొప్ప నాయకుడని ప్రకటించి.. ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగా తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు.
ప్రభుత్వంలోని కానిస్టేబులే.. చంద్రబాబునాయుడుకు జరిగిన అన్యాయం గురించి స్పందించి రాజీనామా చేసారని, ఇది జగన్ దుర్మార్గపు పోకడలకు నిదర్శనమని అంటూ తెలుగుదేశం ఈ ఎపిసోడ్ ను గట్టిగానే ప్రచారానికి వాడుకుంది. సరిగ్గా అదే టెక్నిక్ ను ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అనుసరించాలని అనుకుంటున్నారు.
భీమ్లానాయక్ విషయంలో ప్రభుత్వ దుర్మార్గం గమనించి.. వైసీపీ నాయకులు ఆలోచించాలని, ఆ పార్టీని వీడి వచ్చి తమ పార్టీలో చేరాలని నాదెండ్ల మనోహర్ పిలుపు ఇవ్వడంలో ఆంతర్యం కూడా ఇదే అని వినిపిస్తోంది.
వైసీపీలో ఠికానా లేకుండా పోయిన, అక్కడ భవిష్యత్తులేదని ఆల్రెడీ డిసైడైపోయిన కార్యకర్తలు, నాయకులు కొందరితో ఆల్రెడీ బేరం మాట్లాడుకున్నారని, వారు జగన్ నిర్ణయాల్ని ఖండించి.. ఇక జనసేనలో చేరడమే తరువాయి అని కూడా వినిపిస్తోంది.
జగన్ పార్టీని వీడి వచ్చే వారికి పెద్దపీట వేస్తామని, వారికి ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇస్తున్నట్టు సమాచారం. అలాగే జనసేనలో చేరాలనే ఉబలాటం ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎవరైనా ఉంటే.. వారిని ఈ సమయంలో రాజీనామా చేయించి.. భీమ్లానాయక్ విషయంలో ప్రభుత్వ వైఖరిని వారితో ఖండింపజేస్తే.. అటు సినిమాకు క కూడా మైలేజీ వస్తుందనే వ్యూహంతో ఉన్నట్టుగా సమాచారం.
అలా రాజీనామా చేసి ఎవరైనా వచ్చేట్లయితే.. వారిని వెంటనే పార్టీలో చేర్చుకోకుండా.. ఎన్నికలకు కొంతకాలం ముందు చేర్చుకుంటే వ్యూహాత్మకంగా బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబునాయుడు అనుసరించే ఇలాంటి చీప్ ట్రిక్స్.. జనసేనకు, పవన్ కల్యాణ్ కు ఎంత మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.