పదే పదే చెప్పుకోవాల్సిన విషయం ఇది కమ్యూనికేషన్ యుగం అనేది. వయసుతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మనుషుల మధ్యన కమ్యూనికేషన్ అవకాశాలు విపరీతంగా పెరిగాయి. అనేక బంధాలకు సోషల్ మీడియానే ఇప్పుడు బాటలు వేస్తోందనేది పచ్చి నిజం.
పెళ్లికి ముందు వివాహం విషయంలో అయినా, మరెప్పుడు అయినా.. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చాలా ఈజీగా మరొకరితో సంభాషించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. బాహ్య ప్రపంచంలో తెలిసిన వారిని డైరెక్టుగా మాట్లాడటం కష్టం అయినప్పుడు, డైరెక్టుగా మాట్లాడే అవకాశం లేనప్పుడు, డైరెక్టుగా మాట్లాడే ధైర్యం లేనప్పుడు కూడా… సోషల్ మీడియా ద్వారా పదాలు కలిపే అవకాశం విస్తృతంగా ఉంది. ఈ పరిణామం అనేక రకరాల బంధాలకు బాటలు వేస్తూ ఉంది.
ఏ కాలేజీలోనో, ఆఫీసులోనో, అపార్టుమెంటులోనో చూసిన వారి గురించి పూర్వాపరాలను సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలుసుకుని వారితో స్నేహంగా మెలగడానికి సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు జనాలు. ఆసక్తి ఉన్న ప్రతి పేరూ సోషల్ మీడియా సెర్చ్ హిస్టరీలో రికార్డు అయి ఉంటుంది!
మరి ఈ సామాజిక పరిస్థితుల్లో.. ఏ పాత స్నేహితురాలితోనో, స్నేహితుడితోనో మళ్లీ టచ్లోకి వెళ్లడం చాలా ఈజీ. పురుషుడికి అయినా, స్త్రీకి అయినా ఇది వర్తిస్తోంది. మరి ఈ తరహా స్నేహాలు చాట్ తో మొదలుకుని, ఫోన్ కాల్స్, డైరెక్టు మీటింగ్.. ఇలాంటి వాటన్నింటికీ అవకాశాన్ని సునాయాసంగా ఇస్తున్నాయి.
మరి ఈ తరహా సోషల్ మీడియా స్నేహం తోనో, మరే సహోద్యోగితోనో.. తరచూ సంభాషణలు సాగుతున్నప్పుడు పార్ట్ నర్ ఎలా తీసుకోవాలనేది చాలా సందర్భాల్లో చర్చలో నిలుస్తూ ఉంటుంది స్నేహితుల సంభాషణల్లో కూడా!
ఈ విషయంలో కొందరు పరిణతితో వ్యవహరించగలరు. ఆఫీస్ కొలీగ్ తో తన భార్య ఇంటికి వచ్చాకానో, పాత ఆఫీసులో కలిసి పని చేసిన వ్యక్తితో ఖాళీ సమయాల్లో మాట్లాడితే, కొందరు మగాళ్లు టేకిట్ ఈజీ అనగలరు. అది వారి బంధంలో ఉన్న విశ్వాసం.
తన స్నేహితురాలు భర్త లేనప్పుడే తనతో మాట్లాడుతోందని అనుకున్నాడట ఒక ఉద్యోగి. అయితే తమ సంభాషణ జరుగుతున్నప్పుడు ఆమె భర్త పక్కనే తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడని, సుదీర్ఘ సమయం పాటు కూడా వీరు ఏం మాట్లాడుతుంటారో అనే ఆసక్తి కూడా లేకుండా అతడు ఆమెకు ఎలాంటి ఆటంకం కూడా కలిగించడం లేదనే విషయం చాన్నాళ్ల తర్వాత తెలిసి అవాక్కయ్యాడట అతడు!
ఇలాంటి సందర్భాలు కూడా కొందరికి ఎదురవ్వొచ్చు. ఇక పార్ట్ నర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని, రెగ్యులర్ గా కాల్స్ వెళ్తుండటాన్ని, ఆఫీసు సహోద్యోగిణితో అయినా అంతకు మించి మాట్లాడుతుంటన్నా, నవ్వులు, జోకులు.. వ్యక్తిగత అంశాలూ.. ఇవన్నీ మాట్లాడటాన్ని మరి కొందరు అస్సలు జీర్ణించుకోలేరు. స్త్రీలకు అయినా, పురుషులకు అయినా కొందరికి ఇది అస్సలేమాత్రం నచ్చని వ్యవహారం.
ఇలాంటి సందర్భాల్లో.. డైరెక్టుగా ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టేసినట్టుగా చెప్పడం మంచి పద్ధతి అంటారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. చెప్పిన తర్వాత అటు నుంచి ఏ తరహా సమాధానం వస్తుందనేదాన్ని బట్టి ఈ పరిస్థితిని డీల్ చేయవచ్చని అంటారు. తప్పనిసరి అయి మాట్లాడుతుండటం, కేవలం ఆఫీసు రిలేషన్ షిప్ తప్ప అన్ని గంటల ఫోన్ కాల్స్ లో కూడా మరే సందేశం లేదనే స్పష్టత రావడం జరగొచ్చు.
పార్ట్ నర్ తో ఈ చర్చకు కూడా తగిన సందర్భాన్ని చూసుకోవాలి. మాట్లాడినంత మాత్రాన ఏదో జరిగిపోతోందని తీవ్రంగా ఆలోచించడం కూడా ఏ మాత్రం సబబు కాదు. మీ మీద ఆసక్తి తగ్గిపోయిందని, మీరు పార్ట్ నర్ ను అట్రాక్ట్ చేయలేకపోతున్నారనే ఆలోచనలను కూదా దారి మళ్లించాలి. ఏదైనా అనుమానంపై క్లారిటీ వచ్చిన సందర్భాల్లో.. బంధానికి మీరెంత విలువను ఇస్తున్నదీ ఒకసారి స్పష్టంగా చెప్పగలితే, ఆ తర్వాత అలాంటి తుంటరి చేష్టలు తక్షణం ఆగిపోవచ్చు కూడా!