నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడ్తారు. దీంతో ఒక్కోసారి ఆయనకు చిక్కులు కూడా వస్తుంటాయి. తాజాగా సొంత పార్టీ మండల నాయకుడిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నాయకుడి అవినీతిపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
పద్ధతి మార్చుకోకపోతే అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తానని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది. విడవలూరు మండలం పొన్నపూడి గ్రామంలో ఇవాళ వాటర్‌ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అదే మండలానికి చెందిన వైసీపీ నాయకుడి భూదందాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పిస్తానంటూ తన పేరుతో సదరు వైసీపీ నాయకుడు డబ్బు వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు. తన పేరు చెప్పి ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజల వద్ద కూడా డబ్బు వసూలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీరు మార్చుకోవాలని, సత్ప్రవర్తనతో మెలగాలని చాలాసార్లు మందలించినా అతని నడవడిక అదే విధంగా కొనసాగుతోందన్నారు. గౌరవంగా బతుకుతున్న తనకు, పార్టీకి ఇలాంటి వారి వల్ల చెడ్డపేరు వస్తోందని ప్రసన్నకుమార్‌రెడ్డి వాపోయారు. ఇక మీదట క్షహించేది లేదని ఆయన హెచ్చరించారు. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించడం గమనార్హం.