జనసేన పార్టీలో జనసేనానిని మించిన నాయకుడు, పవన్ కల్యాణ్– రాజు కృష్ణదేవరాయలు వంటివాడైతే, తాను మహామంత్రి తిమ్మరుసు వంటి పాత్రను పోషిస్తున్న వాడు, పవన్ కల్యాణ్ షూటింగులతో బిజీగా ఉండే కాలాల్లో పార్టీకి అన్నీ తానే అయి.. ఆ పార్టీ అస్తిత్వంలోనే ఉన్నదనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్న వాడు అయిన నాదెండ్ల మనోహర్ తాజాగా కొన్ని పంచ్ డైలాగులు పేల్చారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల అయిన నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా, ఎప్పటిలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వదలిపెట్టి బయటకు రావడానికి సమయం ఆసన్నం అయిందని ఆయన పేర్కొన్నారు. జగన్ ను వదలి వస్తే, తమ పార్టీలో చేర్చుకుంటాం అని కూడా హామీ ఇచ్పారు. కలిసి పోరాడదాం అని కూడా సెలవిచ్చారు. అయితే.. ఇలా వైసీపీని విడిచిపెట్టడానికి ఆయన ఆత్మగౌరవంతో ముడిపెట్టారు.
ఆ పార్టీలో ఆత్మగౌరవం ఉన్నవారు రాజీనామా చేసి వచ్చి జనసేనలో చేరాలట. ‘‘ఈ పిలుపు దెబ్బతో.. వైసీపీ సాంతం ఖాళీ అయిపోతుందేమో.. నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పోలోమంటూ ఎగబడి జగన్ ను వదిలేసి రాజీనామాలు చేసి వచ్చి జనసేనలో చేరిపోతారేమో.. అని ప్రజలు అంచనాలు వేస్తున్నారు!’’ ఆత్మగౌరవం ముసుగులో నాదెండ్ల వారు ఉచితంగా పారేసిన ఇలాంటి సలహా చూస్తే.. ఇలాంటి అభిప్రాయంతోనే జనం నవ్వుకుంటున్నారు.
ఇంగ్లిషులో laughingstock అనే మాట ఒకటి ఉంటుంది. కేవలం జనం నవ్వుకోడానికి మాత్రమే ఉపయోగపడే వ్యక్తి/ వస్తువు/ విషయం ఏదైనా ఉంటే దానిని laughingstock అంటారు. ఎంతో సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు తన తాజా ప్రెస్ నోట్ ద్వారా ఈ రకమైన laughingstock గా తెలుగు ప్రజలకు కనిపిస్తున్నారు.
నాదెండ్ల మనోహర్– పవన్ కల్యాణ్ సినిమా విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆయన కేవలం రాజకీయ పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నారు. పవన్ కు జనరల్ గా ఖాళీ ఉండదు గనుక.. ఆయన సినిమా షూటింగ్ లొకేషన్ల వద్దకు వెళ్లి.. నిరీక్షించి.. షాట్ మధ్యలో గ్యాప్ దొరికితే పార్టీ వ్యవహారాలను పవన్‌కు నివేదించి వస్తుంటారు. అంతకు మించి అతిగా సినిమా విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాంటి నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా ప్రమోషన్ కోసం తాను కూడా ఒక చెయ్యి వెయ్యాలని సంకల్పించారో ఏమో తెలియదు గానీ.. సినిమా ట్యాగ్ లైన్ పంచ్ లను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడడం తమాషాగా ఉంది.
భీమ్లాలో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోటీ ఉంటుందిట. ఇది సినిమా ప్రమోషన్ కు బాగా వాడుకున్న ట్యాగ్ లైన్. పవన్ ను ఆత్మగౌరవానికి ప్రతీకగా చిత్రీకరించారు ఇందులో. అంతిమంగా ఆత్మగౌరవమే గెలుస్తుందని ఎటూ తేల్చారు. సదరు ఆత్మగౌరవం- అహంకారం అనే పడికట్టు పదాలను సినిమా ప్రమోషన్ కు వాడుకోవడం బాగానే ఉంటుంది.
కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవం ఉన్నవారందరూ ఆ పార్టీని వీడి బయటకు రండి.. మాతో కలవండి.. మనం కలిసి పోరాడదాం.. అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపిద్దాం అంటున్నారు. వైసీపీలో ఉండే నాయకులు ఆ పార్టీని వదలి వచ్చి జనసేనలో చేరాలని పిలుపు ఇచ్చేంత కామెడీ ఐడియా ఆయనకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. పైగా దానికి ఆత్మగౌరవంతో ముడిపెట్టడం ఇంకో కామెడీ!
ఎవరో మళయాళంలో వండివార్చిన సినిమా కథను తెలుగులో చేసేసి.. అందులోని భీమ్లానాయక్ పాత్రను కాస్త ఆత్మగౌరవం అనే పోపు పెట్టి వండినంత మాత్రాన పవన్ కల్యాణ్ ఆత్మగౌరవం ఉన్న నాయకుడు అవుతాడు. భీమ్లానాయక్ కు ఆత్మగౌరవం ఉన్నంత మాత్రాన.. పవన్ కల్యాణ్ కు ఉన్నట్టు కాదు. ఆ సంగతి నాదెండ్ల మనోహర్ తెలుసుకోవాలి.
అయినా.. పవన్ కల్యాణ్ లో ఉన్న ఆత్మగౌరవం ఏపాటిదో.. ఆంధ్రప్రదేశ్ కు చేటుచేసే నిర్ణయాలతో మోడీ సర్కారు చెలరేగుతూ ఉంటే.. వారి చంకఎక్కి కూర్చున్న పవన్ కల్యాణ్ వెల్లడించే స్పందనలు చూస్తే తెలిసిపోతుంది. ఆ ఆత్మగౌరవం తెలుసుకోడానికి మళ్లీ సినిమా చూడడం ఎందుకు?