“అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం” భీమ్లానాయక్ పోస్టర్ పై మేకర్స్ వేసుకున్న స్లోగన్ ఇది. కథకు తగ్గ స్లోగన్ ఇది. సినిమాలో రానాది అహంకారమని, పవన్ కల్యాణ్ ది ఆత్మగౌరవం అని చూపించారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇదే స్టేట్ మెంట్ ను రాజకీయాలకు కూడా వర్తింపజేస్తే ఎలా? జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అదే పని చేశారు.
జగన్ అహంకారానికి, పవన్ ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని, అంతిమంగా ఆత్మగౌరవమే గెలుస్తుందంటూ సూక్తులు షురూ చేశారు నాదెండ్ల. ఈ విషయంలో ఎవరిది అహంకారం అనే విషయాన్ని మనోహర్, చాలా ఈజీగా మరిచిపోయినట్టున్నారు.
ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా వ్యవహరిస్తున్నారట. పవన్ మాత్రం ఆత్మగౌరవంతో కొనసాగుతున్నారట. నిజంగా పవన్ లో నియంత లక్షణాలు, సంకుచిత మనస్తత్వం లేకపోతే.. ఈపాటికి నాదెండ్ల స్థానంలో మరో వ్యక్తి వచ్చి ఉండేవారు. అంతెందుకు.. తను తప్ప మరో వ్యక్తి ఎదగకూడదని భావించే రకం పవన్ కల్యాణ్. అందుకే పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా, జనసేన నుంచి పట్టుమని ఓ నలుగురి నేతల పేర్లు చెప్పలేని పరిస్థితి.
అదే జగన్ విషయానికొస్తే, తనతో పాటు తన వాళ్లందర్నీ పైకి తీసుకొస్తున్న నేత. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ఎవ్వరూ ఊహించని విధంగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తూ, కేబినేట్ ను సమకూర్చారు. తనతో పాటు మరో 10 మంది బలమైన నేతల్ని తెరపైకి తీసుకొచ్చారు. నిజంగా సంకుచిత మనస్తత్వం ఉంటే జగన్ ఇలా చేస్తారా? పవన్ లా వ్యవహరించేవారు?
నాదెండ్ల మరో మాట కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ తో నడిచి రావాలంట. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్లు వైసీపీ నుంచి జనసేనలోకి రావాలంట. అదే ప్రజాస్వామ్యం ఉంటే జనసేన పార్టీ ఇంత ఘోరమైన స్థితిలో ఉండేది కాదు. అదే ప్రజాస్వామ్యం ఉంటే.. ఏళ్ల తరబడి జనసేనను టీడీపీ-బీజేపీకి తాకట్టు పెట్టేవారు కాదు. అంతెందుకు.. అదే ప్రజాస్వామ్యం ఉంటే పార్టీ నుంచి మంచి నేతలు బయటకు వెళ్లేవారు కాదు. జనసేనలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు భావిస్తే, ఆ పార్టీకి ఒకటి కంటే ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవి.
ప్రస్తుతం జనసేనలో ఏకస్వామ్యం నడుస్తోంది. అహంకారం రాజ్యమేలుతోంది. ప్రజల్ని రెచ్చగొట్టే నియంతృత్వం కొనసాగుతోంది. ఈ విషయాల్ని అంగీకరించడానికి నాదెండ్లకు మనసురాదు, అందుకే కొన్ని పడికట్టు పదాలు నోట్లో వేసుకొని నెమరు వేస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి రమ్మని నేరుగా అడగలేక, ఇలా భీమ్లానాయక్ ముసుగులో వైసీపీ నేతల్ని బతిమలాడుకుంటున్నారు. నాదెండ్ల ఎంత గింజుకున్నా, వైసీపీ నేత కాదు కదా, కనీసం కార్యకర్త కూడా జనసేన వైపు చూడడు.