భీమ్లానాయక్ లో తన పాత్ర ఏంటనే విషయంపై స్పందించాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు అయినప్పటికీ, అన్నీ త్రివిక్రమే చూసుకున్నాడని, సాగర్ కు దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వలేదంటూ చాలా కథనాలు వచ్చాయి. వీటిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు త్రివిక్రమ్. సినిమాకు సంబంధించి సాగర్ కు అన్నీ సమకూర్చడం వరకు మాత్రమే తన పాత్రను పరిమితం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.
“సాగర్ ఈ సినిమాను అర్థం చేసుకున్న విధానం చాలా బాగుంది. పవన్ లాంటి స్టార్ తో పని చేస్తున్నప్పుడు అతడు భయపడకుండా ఉండడానికి నేను, వంశీ, చినబాబు అతడికి సపోర్ట్ గా నిలిచాం. సాగర్ కు ఏం కావాలో అది సమకూర్చిపెట్టడానికి మేం ఉన్నాం. అతడు ఇబ్బంది పడకుండా ఉండడానికి మేం అందరం ఉన్నాం. ఓ షాట్ నచ్చక పవన్ కు నో చెప్పడానికి భయపడితే మాకు చెప్పమని చెప్పాం. మేం వెళ్లి పవన్ కు చెప్పేవాళ్లం. అలా మధ్యలో నేను ఓ బ్రిడ్జిలా పనిచేశాను.”
ఇలా భీమ్లానాయక్ మేకింగ్ లో తన పాత్ర ఏంటనేది బయటపెట్టాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్-ప్లే అందించిన త్రివిక్రమ్.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడలేదు. ఈరోజు నిర్వహించిన సక్సెస్ మీట్ లో మాత్రమే మాట్లాడాడు. సాగర్ చంద్రకు క్రెడిట్ ఇచ్చాడు.
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అందుకే మాట్లాడలేదు..
భీమ్లానాయక్ సక్సెస్ అయిన సందర్భంగా నిన్న సితార ఆఫీస్ లో అంతా బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులు త్రివిక్రమ్ తో సెల్ఫీలు కూడా దిగారు. అదే సమయంలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న ఫ్యాన్స్ నుంచి త్రివిక్రమ్ కు ఎదురైంది.
దర్శకుడు సాగర్ చంద్ర ఆ ఫంక్షన్ లో ఎలివేట్ అవ్వాలని, అందుకే తను మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయానని ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చాడట త్రివిక్రమ్. ఈ మేటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా మారింది.
బండ్ల గణేశ్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రసంగించినప్పుడు ఎవరైనా బండ్ల గణేశ్ అని అరిస్తే ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో త్రివిక్రమ్, తన స్పీచ్ ను వదులుకున్నాడంటూ నిన్నటివరకు కథనాలు వచ్చాయి. అయితే కేవలం దర్శకుడు సాగర్ చంద్రకు క్రెడిట్ ఇచ్చేందుకు, అతడ్ని ఎలివేట్ చేసేందుకే త్రివిక్రమ్ తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది.