తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ సీనియర్ మహిళా నేత, లేడీ అమితాబ్ విజయశాంతి అక్కసుతో ఉన్నారు. ఆమె మాటలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ను దేవుడు భస్మం చేస్తారనేంత కోపాగ్నితో ఆమె రగిలిపోతున్నారు.
ఒకప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా విజయశాంతి పని చేశారు. అప్పట్లో విజయశాంతిని తన చెల్లెలిగా కేసీఆర్ చెబుతుండే వారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి కాంగ్రెస్, అనంతరం బీజేపీలో చేరారు.
ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విజయశాంతి తన ఉనికి చాటుకుంటున్నారు. శివుడు మూడో కన్ను తెరుస్తాడని, కేసీఆర్ను భస్మం చేస్తాడని విజయశాంతి శపించారు. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీ నెరవేర్చాలని బీజేపీ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ రాక్షసుడని విమర్శించారు. దేవాలయం అభివృద్ధి కావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ హిందువు కాదా? కేసీఆర్ ఏమైనా ముస్లీమా…క్రిస్టియనా … హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చిందని కేసీఆర్ని నిలదీశారు. తెలంగాణ ప్రజలను మాత్రమే కాకుండా దేవుళ్లను కూడా కేసీఆర్ మోసగించారని విజయశాంతి మండిపడ్డారు.
కేసీఆర్ను పరమశివుడు భస్మం చేస్తాడని విజయశాంతి హెచ్చరించారు. ఇటీవల కాలంలో వ్యక్తిగత నాశనాన్ని బహిరంగంగా కోరుకోవడం రాజకీయ వ్యవస్థలో కొత్త ట్రెండ్. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రమాదకర ధోరణే కనిపిస్తోంది. సినీ, రాజకీయ రంగాల్లో విజయశాంతికి ప్రత్యేక గుర్తింపు వుండడంతో, కేసీఆర్పై ఆమె విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.