దొందూ దొందే: ఇక్కడ కూడా కలవడం సాధ్యమేనా?

పవన్ కల్యాణ్ తాను ఎన్డీయేలో భాగస్వామిని అని చాలా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటారు. నోరుజారి ‘బయటకు వచ్చి’ అనే మాట వాడిన ఆయన, ఆ తరువాత నాలిక్కరుచుకుని.. వీడియోల్లో ఆ సంగతి ఉన్నదనే మాట…

పవన్ కల్యాణ్ తాను ఎన్డీయేలో భాగస్వామిని అని చాలా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటారు. నోరుజారి ‘బయటకు వచ్చి’ అనే మాట వాడిన ఆయన, ఆ తరువాత నాలిక్కరుచుకుని.. వీడియోల్లో ఆ సంగతి ఉన్నదనే మాట కూడా మరచి.. ‘నేను బయటకు రావాలని మీకు కోరికగా ఉంటే, మీరు అలా ప్రచారం చేసుకుంటే నేనేం చేయగలను’ అంటూ నింద వైసీపీ వారి మీదకు నెట్టేసి.. ‘నేనింకా ఎన్డీయేలోనే ఉన్నా’ అని ధ్రువీకరించారు. అలాగని ఆయన చెప్తారు, ఏపీలో భాజపా కూడా (ప్రస్తుతానికి చెబుతోంది). 

ఎన్డీయే పక్షాల సమావేశానికి ఢిల్లీనుంచి పవన్ కు కూడా పిలుపు వచ్చింది గనుక.. ఆయన ఎన్డీయేలో భాగమని నమ్మవచ్చు. కాకపోతే.. తెలంగాణలో బిజెపి పొరబాట్న కూడా ఆ మాట చెప్పదు. ఆయన భాగస్వామి గనుక.. ఆయనతో కలిసి ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధంగా లేదు. నిజానికి తెలంగాణలో బిజెపికి మొత్తం 119 సీట్లలో సొంతంగా పోటీచేయగల సత్తా లేదు గానీ.. జనసేనకు సీట్లు పంచడం వారికి ఇష్టం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో.. జనసేన తాము 32 సీట్లలో పోటీచేయబోతున్నట్లుగా.. ఆల్రెడీ నియోజకవర్గాల జాబితాను ప్రకటించింది. ఆయా చోట్లనుంచి ఆశావహులు పార్టీ చుట్టూ తిరిగి బేరాలాడుకోవడానికి తలుపులు తెరిచిందన్నమాట.

తెలంగాణలో ఏమాత్రం ఠికానా లేని జనసేన పరిస్థితి ఇది కాగా.. తొలుత మొత్తం అన్ని సీట్లలో పోటీకి దిగుతామని విర్రవీగిన తెలుగుదేశానికి కాస్త కళ్లు తెరచుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు వారు.. అన్నీ కాదు గానీ..  బలమైన చోట్ల పోటీకి దిగుతాం అంటున్నారు. ఏయే సీట్లు అనేది వారికే ఇంకా క్లారిటీ లేదు. అసలు బలంగా ఎక్కడ ఉన్నారు సారూ అని అడిగితే.. వారు పట్టుమని పదిసీట్ల పేర్లయినా చెప్పగలరో లేదో తెలియదు.

ఇంకా సూటిగా, నిష్కర్షగా  చెప్పాలంటే.. తెలంగాణలో తెలుగుదేశం గానీ, జనసేన గానీ.. ఒక్కటంటే ఒక్క సీటు అయినా గెలిచేస్థితిలో లేవు. దొందూ దొందే అని చెప్పుకోవాలి. కానీ.. ప్రగల్భాలు పలకడంలో ముందున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పొత్తులతో పోటీచేసే ఆలోచన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

నిజానికి జనసేన ముందే తాము పోటీచేసే సీట్ల జాబితా ప్రకటించింది. ఎటూ ఏపీలో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు గనుక.. తెలంగాణలో కూడా.. పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని నాయకులు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్న సామెత చందంగా.. వేరే గతిలేని ఈ ఇద్దరూ పొత్తులు పెట్టుకుంటే మాత్రం ఏమవుతుంది? అనేది పలువురి వాదన.

ఇక్కడ పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే.. తాము ప్రకటించిన జాబితాలోంచి కొన్ని సీట్లను జనసేన త్యాగం చేసి తెలుగుదేశానికి ఇవ్వాల్సి వస్తుంది. మరి వారు అందుకు సిద్ధమేనా?