భీమ్లా సందడి వేళ ఆర్ఆర్ఆర్ కి అతిపెద్ద ఎలివేషన్ వచ్చింది. స్వయానా మంత్రి పేర్ని నాని.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రస్తావించారు. ఆయన సినిమాలకి ఎప్పుడూ టీడీపీ వాళ్లు ట్వీట్లు వేయలేదే అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై సింపతీ చూపించారు. సహజంగానే ఇది ఎన్టీఆర్ కి, ఆర్ఆర్ఆర్ కి ప్లస్ పాయింట్.
అటు టీడీపీ వాళ్లు కూడా ఆర్ఆర్ఆర్ విషయంలో హడావిడి చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి కల్పించారు మంత్రి. అప్పుడు కూడా భీమ్లాకు చేసినట్టు హడావిడి చేయకపోతే ఎన్టీఆర్ ని బాబు తొక్కేయాలని చూస్తున్నట్టే లెక్క. సో బాబు, చినబాబు అలా ఇరుకున పడ్డారు, ఇలా ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ లైమ్ లైట్లోకి వచ్చారు.
భీమ్లా రిలీజ్ రోజు ఆర్ఆర్ఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు మంత్రి పేర్ని నాని. పవన్ కల్యాణ్ ఒక్కడే గొప్ప హీరో కాదని, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం పవన్ కల్యాణ్ ఒక్కరే కాదని, కానీ టీడీపీ మాత్రం ఆ విషయంలో అతి చేస్తోందని వివరణ ఇచ్చారు. తొక్కేయడం అంటే హరికృష్ణను చంద్రబాబు రాజకీయాల్లో తొక్కేసినట్టా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసినట్టా అని అడిగారు. పరోక్షంగా ఎన్టీఆర్ అభిమానుల్ని అలా గిల్లి వదిలేశారు నాని.
పవన్ కల్యాణ్ సినిమా విషయంలో ఇంత ఓవర్ యాక్షన్ చేసిన చంద్రబాబు-లోకేష్ గతంలో ఎప్పుడైనా ఎన్టీఆర్ మూవీ విషయంలో కనీసం ఓ ట్వీట్ అయినా వేశారా అని మంత్రి ప్రశ్నిస్తే, నిజంగా అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు. బాలకృష్ణ సినిమాలని సపోర్ట్ చేసే పెదబాబు-చినబాబు.. జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు పట్టించుకోరనే లాజిక్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇప్పటికే కుప్పంలో జూనియర్ జెండా ఎగిరేసరికి టీడీపీ నాయకులు గజగజ వణుకుతున్నారు.
మంత్రి నాని వ్యాఖ్యలతో జూనియర్ అభిమానులు నిజంగానే కళ్లు తెరుచుకుంటే, టీడీపీ సపోర్ట్ ఎవరికో వారు అర్థం చేసుకోగలిగితే చంద్రబాబుకి తీవ్ర నష్టం. దాన్ని కవర్ చేసుకోవాలంటే రేపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజు టీడీపీ ఆ సినిమాకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. నాయకులంతా ట్వీట్లు వేయాలి, భీమ్లా నాయక్ ని పొగిడినట్టే ఆకాశానికెత్తేయాలి. అనుకోకుండా ఆర్ఆర్ఆర్ కి ఇది మంత్రి నాని ఇచ్చిన వరం. ఎన్టీఆర్ కి పెరిగిన బలం.