వైఎస్ అవినాశ్‌కు ఇరకాటం

సీబీఐకి సొంత కుటుంబ స‌భ్యులు ఇచ్చిన వాంగ్మూలాలు క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇర‌కాటంలో ప‌డేశాయా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మాజీ మంత్రి వివేకా హ‌త్య‌కు సంబంధించి సీబీఐ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. రోజురోజుకూ ఆ…

సీబీఐకి సొంత కుటుంబ స‌భ్యులు ఇచ్చిన వాంగ్మూలాలు క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇర‌కాటంలో ప‌డేశాయా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మాజీ మంత్రి వివేకా హ‌త్య‌కు సంబంధించి సీబీఐ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. రోజురోజుకూ ఆ దూకుడు పెంచుతోంది. మ‌రీ ముఖ్యంగా నిందితులు, వారి సంబంధీకులు త‌మ‌తో మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని సీబీఐ అధికారులు గుర్రుగా ఉన్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో వారు కూడా ఆట ప్రారంభించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇందులో విభాగంగా ముఖ్య‌మైన వాంగ్మూలాల‌ను తెర‌పైకి తేవ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదంతా క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డి రాజ‌కీయ‌, వ్య‌క్తిగ‌త జీవితాన్ని నాశ‌నం చేసేందుకు సీబీఐ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అధికార పార్టీ పెద్ద‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 

సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో ముఖ్యంగా కుటుంబ స‌భ్యులు వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి, డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి ఇచ్చిన‌ట్టు వెలుగులోకి వ‌చ్చిన సమాచారం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. వైఎస్ అవినాశ్‌రెడ్డికి క‌నీసం త‌న పెద‌నాన్న‌, చిన్నాన్న గార్ల కుటుంబ స‌భ్యుల‌తో కూడా స‌రైన స‌మ‌న్వ‌యం లేద‌నేందుకు ఈ వాంగ్మూలాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా వైసీపీ నేత‌లు చూపుతున్నారు.

క‌డ‌ప ఎంపీ అవినాశ్‌రెడ్డికి వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి సొంత పెద‌నాన్న‌. అలాగే డాక్ట‌ర్ అభిషేక్‌రెడ్డి మ‌రో సొంత పెద‌నాన్న వైఎస్ ప్ర‌కాశ్‌రెడ్డికి మ‌న‌వ‌డు. ఘ‌ట‌నా స్థ‌లంలో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, మ‌నోహ‌ర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి అనుమాన స్థితిలో వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌తాప్‌రెడ్డి సీబీఐకి చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాజాగా డాక్ట‌ర్ అభిషేక్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మ‌రింత దుమారం రేపుతోంది.

గుండెపోటుతో మరణించాడని టీవీల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయని, కానీ చంపేసిన‌ట్టు స్పష్టంగా తెలుస్తున్నా గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో త‌న‌కు అర్థం కాలేద‌ని వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అయిన డాక్ట‌ర్‌ వైఎస్‌ అభిషేక్‌రెడ్డి సీబీఐ ముందు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అలాగే తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చానని, గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో త‌న‌కు అర్థం కాలేదని సీబీఐకి ఆయ‌న చెప్పారు. 

తాను అక్కడి నుంచి వెళ్లిపోయాక ఈసీ గంగిరెడ్డి, రాజారెడ్డి ఆస్పత్రులకు చెందిన కాంపౌండర్లు జయ ప్రకాశ్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు వివేకానంద రెడ్డి మృతదేహనికి బ్యాండేజీలు వేసినట్లు త‌న‌కు తెలిసిన‌ట్టు పేర్కొన్నారు. ఇదంతా ఎందుకు జరిగిందనే విషయం త‌న‌ను కలవరపెట్టిన‌ట్టు డాక్ట‌ర్ అభిషేక్ సీబీఐ ఎదుట త‌న అమాయ‌క‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు.

సీఐ శంక‌ర‌య్య‌, డీఎస్పీ వాసుదేవ‌న్ , కుటుంబానికి సంబంధం లేని వ్య‌క్తులు ఏదైనా చెప్పారంటే అర్థం చేసుకోవ‌చ్చు. వైఎస్ అవినాశ్‌రెడ్డి ర‌క్త సంబంధీకులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో కూడా అనుమానాలు వ్య‌క్తం కావ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బ‌హుశా వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబంలో ఈ విచార‌ణ‌పై గ్యాప్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే విచార‌ణ సంద‌ర్భంగా తాము చూసింది చూసిన‌ట్టుగా ఎవ‌రికి వాళ్లు చెప్పారు. ఇవ‌న్నీ త‌మ‌కు చుట్టుకొస్తున్నాయ‌ని వైఎస్ అవినాశ్‌రెడ్డి , ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డి ఆందోళ‌న చెందుతున్న‌ట్టు స‌మాచారం.