కేసీఆర్ కూడా వ్యూహం మార్చుకోవాల్సిందేనా?

భారాస పేరుతో జాతీయ స్థాయి పార్టీగా బలంగా ఆవిర్భవిస్తామని, జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కూడగట్టి.. మోడీని గద్దె దించడానికి పోరాడతామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలాకాలంగా చెబుతున్నారు. Advertisement అయితే భాజపా…

భారాస పేరుతో జాతీయ స్థాయి పార్టీగా బలంగా ఆవిర్భవిస్తామని, జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కూడగట్టి.. మోడీని గద్దె దించడానికి పోరాడతామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలాకాలంగా చెబుతున్నారు.

అయితే భాజపా వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కూడగట్టడం అనేది ఆయన చేయి దాటిపోయింది. ఇతర రాష్ట్రాల్లోని కీలక పార్టీలు ఏవీ ఆయనను పట్టించుకోవడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత.. ఆయన అనివార్యంగా తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కన్నడ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ సినేరియో మారుతోంది. కావడానికి ఇది ఒక్క రాష్ట్రంలో ఫలితమే కావొచ్చు గాక..! కానీ అక్కడ బిజెపి చేతిలో ఉన్న అధికారాన్ని ఆ పార్టీ కోల్పోవడం, ఆ రాష్ట్రంలో పట్టు నిలబెట్టుకోవడానికి అమిత్ షా అత్యంత శ్రమ తీసుకుని పనిచేయడం, సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా అనేక సభలు, రోడ్ షోలు నిర్వహించడం.. ఇన్ని జరిగినా సరే కన్నడిగులు బిజెపిని దారుణంగా తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలు పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

తృతీయ కూటమి ఆలోచనకే అగ్రప్రాధాన్యం ఇచ్చే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా దీదీ కూడా ఇప్పుడు మెత్తబడ్డారు. కాంగ్రెస్ బలంగా ఉన్నచోట్ల వారికి మద్దతు ఇస్తాం అని అంటున్నారు. ఈ సాంప్రదాయాన్ని కాంగ్రెస్ కూడా పాటించాలని ఇతర పార్టీలు బలంగా ఉన్నచోట వారు మద్దతు ఇవ్వాలని, రాష్ట్రాలలో సీట్లు పంచుకోవడానికి  ముందుకు రావాలని ఆమె అంటున్నారు. 

కాంగ్రెస్ సారథ్యంలోని కూటమిలోకి వివిధ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలను తీసుకువచ్చి మోడీని గద్దె దించాలని కంకణం కట్టుకుని నితీశ్ కుమార్ ప్రయత్నాలు ఇప్పుడు కాస్త ఫలవంతంగా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో  కేసీఆర్ వ్యూహం మార్చుకోవడం తప్పనిసరి.

బిజెపి, కాంగ్రెస్ లకు సమానదూరంలో ఉంటా, నా కూటమితో అధికారంలోకి వస్తా అంటే ఆ పప్పులు ఉడకవు. కాంగ్రెస్ ఉండే జట్టుకు జై కొట్టడం తప్ప కేసీఆర్ కు వేరే గత్యంతరం లేదు. కాదు కూడదంటే తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యే దాకా ఆగి ఆ తర్వాత ఆయన జై కొట్టవచ్చు. అవసరమైతే తెలంగాణ ఎన్నికలను కాస్త ముందుకు నెట్టవచ్చు. అలాకాకుండా.. ఇప్పటిదాకా చేస్తున్నట్టుగానే.. ఒంటరిగానే జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపిస్తాం అని  ప్రగల్భాలు పలికితే మాత్రం.. జనం ఆయనను నమ్మరు. 

అసలే మోడీ తో లాలూచీ పడి, ఆయన వ్యతిరేక వాదన కేసీఆర్ వినిపిస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయన తన పట్టుదల మీదనే ఉంటే గనుక.. అదంతా మోడీ వ్యతిరేక ఓటు చీల్చడానికి, మోడీని మళ్లీ ప్రధాని చేయడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకం అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది.