రోడ్డు ప్ర‌మాదంలో టీడీపీ ఇన్‌చార్జ్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌కాశం జిల్లా మార్కాపురం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కందుల నారాయ‌ణ‌రెడ్డికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మార్కాపురం నుంచి హైద‌రాబాద్‌కు కారులో వెళుతుండ‌గా ఎర్ర‌గొండ‌పాళెం మండ‌లం గురిజేప‌ల్లి ద‌గ్గ‌ర ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నం బోల్తా ప‌డింది.…

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌కాశం జిల్లా మార్కాపురం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కందుల నారాయ‌ణ‌రెడ్డికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మార్కాపురం నుంచి హైద‌రాబాద్‌కు కారులో వెళుతుండ‌గా ఎర్ర‌గొండ‌పాళెం మండ‌లం గురిజేప‌ల్లి ద‌గ్గ‌ర ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నం బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తీవ్ర‌గాయాలు పాలు కావ‌డంతో మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.  

కందుల నారాయ‌ణ‌రెడ్డి ఒక్క‌సారి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు. 2004లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కుందూరు పెద్ద కొండారెడ్డి చేతిలో ఆయ‌న ఓడిపోయారు. 2009లో అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ త‌ర్వాత 2014, 2019ల‌లో వ‌రుస‌గా ఆయ‌న వైసీపీ చేతిలో ఓడిపోయారు.

నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో పొదిలి పంచాయ‌తీ పోత‌వ‌రం గ్రామం నుంచి కాటూరివారిపాలెం గ్రామం వ‌ర‌కూ సంఘీభావ యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీ కేక్‌ను క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ రాక్ష‌స పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించేందుకు లోకేశ్ పాద‌యాత్ర చేస్తున్నార‌న్నారు.  

ఈ నేప‌థ్యంలో కందుల నారాయ‌ణ‌రెడ్డి తీవ్ర‌గాయాల‌పాలు కావ‌డంపై టీడీపీ శ్రేణులు షాక్‌కు గుర‌య్యాయి. త‌మ‌తో క‌లిసి న‌డిచి రానున్న రోజుల్లో అధికారం త‌మ‌దే అని భ‌రోసా ఇచ్చార‌ని, అలాంటి నాయ‌కుడు ప్ర‌మాదానికి గురి కావ‌డం బాధ క‌లిగిస్తోంద‌ని టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా మార్కాపురం ప్ర‌జానీకం కోరుకుంటోంది.