వైవీపై మ‌రోసారి అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన బాలినేని!

త‌న సమీప బంధువు, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాసరెడ్డి అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ వైవీ, బాలినేని వ‌ర్గాలుగా విడిపోయింది. మంత్రి ప‌ద‌వి…

త‌న సమీప బంధువు, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాసరెడ్డి అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ వైవీ, బాలినేని వ‌ర్గాలుగా విడిపోయింది. మంత్రి ప‌ద‌వి ఉన్నంత కాలం ప్ర‌కాశం జిల్లాలో త‌న‌కు ఎదురేలేద‌నే రీతిలో బాలినేని హ‌వా చెలాయించారు. మంత్రి ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పించి, మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ను కొన‌సాగించ‌డాన్ని ఆయ‌న ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక‌పోతున్నారు.

వైవీ సుబ్బారెడ్డి వ‌ర్గంలోని నాయ‌కుడిగా ఆదిమూల‌పు సురేష్‌ను బాలినేని చూస్తున్నారు. త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌డం ద్వారా, ప్ర‌భుత్వంలో అంత ప‌ట్ట‌లేద‌నే సంకేతాలు పంపిన‌ట్టైంద‌ని బాలినేని ఆగ్ర‌హానికి ప్రధాన కార‌ణ‌మైంది. 

ఇటీవ‌ల కాలంలో ప్ర‌కాశం జిల్లాలో బాలినేనిని ఎవ‌రూ ఖాత‌రు చేయ‌డం లేద‌నే వార్త‌లొస్తున్నాయి. పైగా ఆయ‌న‌పై పెద్ద సంఖ్య‌లో సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదులు వెళుతున్నాయి. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెబుతూ బాలినేని క‌న్నీటి పర్యంత‌మ‌య్యారు. ద‌గ్గ‌రి వాళ్లే ఈ ప‌ని చేస్తున్నార‌ని ఆయ‌న వాపోయారు.

ఇదిలా వుండ‌గా తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో బాలినేని మాట్లాడుతూ మ‌రోసారి త‌న ద‌గ్గ‌రి బంధువు వైవీ సుబ్బారెడ్డిపై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశారు. పార్టీలో అయిన వాళ్లే కుట్ర‌లు చేసి ఇబ్బంది పెడుతున్నందుకు ఇటీవ‌ల బాధ‌ప‌డ్డాన‌ని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్య‌లు వైవీ గురించే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

త‌న‌ను ఇబ్బంది పెట్టేవాళ్ల‌ను లెక్క చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని తాజాగా ఆయ‌న అన్నారు. జ‌గ‌న్‌ను త‌ప్ప‌, మ‌రెవ‌రినీ లెక్క చేయ‌న‌ని వైవీ సుబ్బారెడ్డితో పాటు, త‌న గురించి సీఎంకు ఫిర్యాదు చేసే నాయ‌కుల‌ను దృష్టిలో పెట్టుకునే బాలినేని అన్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. 

వైవీపై మ‌న‌సులో బాలినేని చాలా ఆగ్ర‌హంగా ఉన్నార‌నేందుకు ఈ మాట‌లే నిద‌ర్శ‌న‌మే టాక్ వినిపిస్తోంది. పార్టీకి బ‌లం కావాల్సిన బావాబామ్మ‌ర్దులు బాలినేని, వైవీ …వ్య‌క్తిగ‌త గొడ‌వ‌ల కార‌ణంగా భారంగా త‌యార‌య్యార‌ని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి.