ఎన్టీఆర్ వారించారట‌…న‌మ్మే మాట‌లేనా!

నారావారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అంటారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అవునంటే కాద‌నిలే, కాదంటే అవున‌నిలే అని సొంత పార్టీ నేత‌లు చెప్పేమాట‌. మొద‌టిసారిగా చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 44 ఏళ్లు పూర్త‌యిన…

నారావారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అంటారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అవునంటే కాద‌నిలే, కాదంటే అవున‌నిలే అని సొంత పార్టీ నేత‌లు చెప్పేమాట‌. మొద‌టిసారిగా చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 44 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా గ‌త స్మృతుల‌ను ఆయ‌న నెమ‌ర‌వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

1978 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్ర‌బాబు గెలుపొందారు. ఆ త‌ర్వాత 1983లో ఎన్టీఆర్ హ‌వాలో ఆయ‌న అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓట‌మిపాల‌య్యారు. అనంత‌రం ఆయ‌న కుప్పానికి మకాం మార్చారు. ఇదిలా ఉండ‌గా  మొద‌టిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శుక్రవారానికి సరిగ్గా 44 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొందరు నేతలు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  

ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి వివ‌రించారు. కానీ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆయ‌న చేర‌లేదు. ఇందుకు ఆయ‌న చెప్పిన కార‌ణాలు న‌మ్మ‌శక్యంగా లేవ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కూ ఆయ‌న ఏమన్నారంటే…

“ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలనుకున్నాను. కానీ ఆయన వారించారు. ఆయన సలహాతో ఆగిపోయాను. ఆ తర్వాత 1984 రాజకీయ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్‌ను అర్ధాంతరంగా దించివేసినప్పుడు జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమంలో నేను టీడీపీలో క్రియాశీలంగా పనిచేశాను. మళ్లీ ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. ఆ సమయంలో సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టి బాగా పనిచేశాను. అప్పటి పునాదులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి”  అని వివరించారు.

సినీ రంగానికి చెందిన ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించ‌లేర‌నే ఉద్దేశంతో టీడీపీలో చంద్ర‌బాబు చేర‌లేద‌నే ప్ర‌చారం ఉంది. అంతేకాదు, నాడు కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌పై పోటీ చేసేందుకు కూడా వెనుకాడ‌న‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. టీడీపీలో చేరితే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే భ‌యంతో ఆ పార్టీలో బాబు చేర‌లేద‌న్న‌ది నిజం. ఈ వాస్త‌వాలు జ‌నానికి తెలియ‌ద‌ని కాబోలు, అబ‌ద్ధాలు చెబుతూ బాబు ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఇదిలా వుండ‌గా తన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌, వాజపేయి వంటి మహామహులతో పనిచేసే అవకాశం వచ్చిందని గ‌ర్వంగా చెప్పిన చంద్ర‌బాబు… ప్ర‌ధాని మోదీని మాత్రం విస్మ‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 2014లో ప్ర‌ధాని మోదీతో బాబు క‌లిసి ప‌ని చేశారు. బ‌హుశా వాజపేయి మాదిరిగా త‌న ప‌ట్ల మోదీ ఆద‌ర‌ణ భావంతో ఉండ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న గురించి చెప్ప‌లేద‌ని అర్థం చేసుకోవాలేమో!