పవన్ కళ్యాణ్ తనకు కులం లేదు అని అంటారు. అన్ని కులాలూ అభిమానిస్తే ఆయన హీరోగా ఉన్నారని కూడా అంటారు. అయితే తెలుగుదేశం తమ్ముళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ణి కేవలం కాపు నాయకుడిగానే చూస్తున్నారా అంటే అదే నిజమని ఉత్తరాంధ్రా టీడీపీ ఇంచార్జి బుద్ధా వెంకన్న అంటున్నారు.
ఏపీలోని మొత్తం కాపులు అంతా పవన్ని తన నాయకుడుగా చూస్తున్నారు అని బుద్ధా వెంకన్న సెలవిచ్చారు. కాపు ఓట్లు నూరు శాతం పవన్ కే పడతాయని ఆయన రాజకీయ జోస్యం చెప్పారు. కాపు నాయకులం అని కులం పేరు చెప్పుకుని వైసీపీ తరఫున ఎవరు ముందుకు వచ్చినా కాపులు పట్టించుకోరు అని ఆయన అంటున్నారు.
కాపులకు పవనే నాయకుడు అని గిరి గీసి మరీ చెప్పేశారు. కుల నాయకుడిగా పవన్ని ఆయన తేల్చారన్న మాట. రాజకీయాల్లో కులం పేరుతో పార్టీలు పెట్టినా సాగవు, సక్సెస్ దక్కదు. అది అందరికీ తెలిసిందే. పవన్ కూడా ఈ సత్యం తెలిసి కులం కోణం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూంటే ఆయన మీద అలవి కాని అభిమానాన్ని పెంచుకుపోతున్న తెలుగు తమ్ముళ్ళు మాత్రం పవన్ కాపు నాయకుడు అంటూ కాపుల ఓట్లన్నీ ఆయనకే అంటోంది.
పవన్ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టే ఈ మాటలు. అదే పవన్ సొంతంగా పోటీ చేస్తే కాపుల ఓట్లు ఆయనకు ఎందుకు వెళ్తాయి మొత్తం తెలుగుదేశానికే అని ఇదే తమ్ముళ్ళు లాజిక్ పాయింట్ తీస్తారు. ఇపుడు పవన్ని కుల నాయకుడిని చేయడం వెనక కూడా రాజకీయ పబ్బం గడుపుకునే ప్లాన్ ఉందనే అంటున్నారు.
వైసీపీలో ఉన్న కాపు నాయకులకు కాపులు ఓట్లు వేయరట. వారు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదగాలని చూస్తున్నారుట. అంటే కాపుల ఓట్లు మొత్తం పవన్ వైపు తిరగాలని, ఆ విధంగా వయా తెలుగుదేశంగా కాపు ఓట్లు గంపగుత్తగా దండుకోవాలన్న ప్లాన్ అయితే ఉంది అన్నది అర్ధమవుతోంది కదా అని వైసీపీ నేతలు అంటున్నారు.
వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ కాపు నాయకుడు కాదు కానీ పవన్ మాత్రం కాపు నాయకుడు అంటూ మెరమెచ్చు కబుర్లు చెబుతున్న తమ్ముళ్లకు అసలు వాస్తవాలు ఎన్నికల తరువాతనే అర్ధం అవుతాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ని కాపు నాయకుడిగా చేయడాన్ని జనసేన నేతలకు ఆనందంగా ఉందా లేదా అన్నది తెలియాల్సిన విషయం.