Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎన్నేళ్ల‌కెన్నేళ్ల‌కు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు!

ఎన్నేళ్ల‌కెన్నేళ్ల‌కు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు!

చాలా ఏళ్ల త‌ర్వాత చంద్ర‌బాబునాయుడికి జూనియ‌ర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. కుమారుడు లోకేశ్‌కు రాజ‌కీయ అడ్డు తొల‌గించుకునేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అణ‌చివేశారనే ప్ర‌చారం ఉన్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ఈ నెల 20న నిర్వ‌హించ‌నున్న ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆయ‌న సోద‌రుడు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, అలాగే ఇత‌ర కుటుంబ స‌భ్యుల్ని ఆహ్వానించ‌డం విశేషం.

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌కు ఎవ‌రెవ‌రిని ఆహ్వానించాల‌నే విష‌య‌మై సావ‌నీర్ క‌మిటితో చంద్ర‌బాబు ఆదివారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి త‌దిత‌ర నంద‌మూరి కుటుంబ స‌భ్యుల్ని సావ‌నీర్ క‌మిటీ చైర్మ‌న్ టీడీ జ‌నార్ద‌న్‌, అలాగే నంద‌మూరి రామ‌కృష్ణ క‌లిసి వెళ్లి ఆహ్వానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన శ‌త జ‌యంతి వేడుక‌కు మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ఆయ‌న అభిమానులు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 28న ఖ‌మ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాలంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌డ‌మే తెలిసిందే. దీంతో టీడీపీ నేతృత్వంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌క‌పోతే నంద‌మూరి అభిమానుల ఆగ్ర‌హానికి గురై రాజ‌కీయంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంది. అయితే ఇక్క‌డో ట్విస్ట్‌ను గ‌మ‌నించొచ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లకు మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌, అలాగే ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి త‌దిత‌ర చంద్ర‌బాబు వ్య‌తిరేకుల‌ని ప్ర‌చారం పొందుతున్న నేత‌ల్ని విస్మ‌రించారు.  తెలంగాణ ప్రాంతానికి మాత్ర‌మే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ప‌రిమితం చేసే కుట్ర‌ను చూడొచ్చు. 

టాలీవుడ్ అగ్ర‌హీరోగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులున్నారు. అలాగే సీనియ‌ర్ ఎన్టీఆర్ పోలిక‌లు, వాక్చాతుర్యం క‌లిగి వుండ‌డంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్ప‌టికైనా రాజ‌కీయంగా లోకేశ్‌కు థ్రెట్ అని చంద్ర‌బాబు భయ‌ప‌డుతున్నారు. 2009లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బాబు వాడుకున్నారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చార సంద‌ర్భంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌మాదానికి గురై, ప్రాణాపాయం నుంచి త్రుటిలో త‌ప్పించుకున్నారు.

ఆ త‌ర్వాత పెద్ద‌గా టీడీపీ కార్య‌క‌లాపాల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ పాల్గొన‌లేదు. ఎన్నోసార్లు టీడీపీ మ‌హానాడు జ‌రిగినా, ఆయ‌న్ను ఆహ్వానించ‌లేదు. రానున్న ఎన్నిక‌లు టీడీపీకి కీలకం కావ‌డంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తే మంచిద‌నే అభిప్రాయంలో చంద్ర‌బాబు ఉన్నారు. 

ఒక‌వేళ రాక‌పోతే మ‌రీ మంచిద‌ని, టీడీపీ వ్య‌తిరేక ముద్ర జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై వేసే సువ‌ర్ణావ‌కాశం ల‌భించిన‌ట్టు అవుతుంద‌ని చంద్ర‌బాబు వ్యూహంగా చెబుతున్నారు. ఇలా అన్ని ర‌కాలుగా ఆలోచించే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. మ‌రి ఆయ‌న వెళ్తారా? లేదా? అనేది తేలాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?