కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీలో తమ యువ నాయకుడు లోకేశ్‌ను టీడీపీ శ్రేణులు చూసుకుంటున్నాయి. కర్నాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ విజయంతో టీడీపీ సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పొత్తు కోసం సిగ్గు విడిచి అర్రులు చాస్తున్నా బీజేపీ అవహేళనగా మాట్లాడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.
కేంద్రంలో మరోసారి మోదీ సర్కారే వస్తుందన్న భయంతో ఇంత కాలం బీజేపీ విషయంలో టీడీపీ సానుకూల వైఖరితో నడుచుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రధాని మోదీని చంద్రబాబు ఆకాశం హద్దుగా ప్రశంసించడాన్ని చూడొచ్చు.
ఈ క్రమంలో కర్నాటకలో బీజేపీ పరాజయంతో ఆ పార్టీపై దేశ వ్యాప్తంగా నెగెటివ్ వేవ్ స్టార్ట్ అయ్యిందన్న భావనలో టీడీపీ వుంది. దీంతో కాంగ్రెస్‌పై మౌనంగానే అనుకూల ధోరణితో టీడీపీ వ్యవహరిస్తోంది. తాజాగా నారా లోకేశ్‌ను రాహుల్‌తో పోల్చుతూ టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం గమనార్హం.
నారా లోకేశ్ పాదయాత్ర సోమవారానికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న తల్లి భువనేశ్వరితో లోకేశ్ ఎంతో ఆత్మీయంగా నడుచుకున్నారు. అమ్మ షూ లేస్ కట్టడాన్ని, గతంలో భారత్ జోడో యాత్రలో సోనియాగాంధీ షూ లేస్‌ను రాహుల్ కట్టడంతో పోల్చడం విశేషం.
లోకేశ్, రాహుల్ సంస్కారవంతులని, తల్లిని మాత్రమే కాదు, పెద్దల్ని గౌరవించడంలో ఒక్కటేనని పాజిటివ్ కోణంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని గమనించొచ్చు. కర్నాటకలో కాంగ్రెస్‌ను రాహుల్ అధికారంలోకి తెచ్చారని, రానున్న రోజుల్లో ఏపీలో టీడీపీని లోకేశ్ అదే రకంగా అధికార పీఠంపై కూచోపెడతాడంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం గమనార్హం.
నెమ్మదిగా కాంగ్రెస్‌పై సానుకూల పోస్టులు పెట్టడం వెనుక టీడీపీ రాజకీయ మార్పునకు కారణాలను విశ్లేషిస్తున్నారు.