క‌ర్ణాట‌క సీఎం.. బ్యాలెట్ ఓటు వైపు కాంగ్రెస్ మొగ్గు?

క‌ర్ణాట‌క సీఎం ఎవ‌ర‌నేది తేల్చ‌డం కాంగ్రెస్ అధిష్టానానికి తేలిక‌గా లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. క‌ర్ణాటక‌లో కావాల్సినంత మెజారిటీ ద‌క్కినా… మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివ‌కుమార‌ల్లో ఎవ‌రిని సీఎంగా చేయాల‌నేది కాంగ్రెస్…

క‌ర్ణాట‌క సీఎం ఎవ‌ర‌నేది తేల్చ‌డం కాంగ్రెస్ అధిష్టానానికి తేలిక‌గా లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. క‌ర్ణాటక‌లో కావాల్సినంత మెజారిటీ ద‌క్కినా… మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివ‌కుమార‌ల్లో ఎవ‌రిని సీఎంగా చేయాల‌నేది కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చ‌లేదు. ఈ నెల 18 వ తేదీన ఎలాగైనా కొత్త సీఎం ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలున్నాయి. మ‌రి ఇంత‌కీ సీఎంగా ఎవ‌రిని ప్ర‌క‌టిస్తార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిదాయ‌క‌మైన అంశంగా నిలుస్తోంది.

సిద్ధ‌రామ‌య్య‌, డీకేశి ల్లో ఎవ‌రి అర్హ‌త‌లు వారికి ఉన్నాయి. డీకే శివ‌కుమార జైలు జీవితాన్ని త‌ట్టుకుని సైతం కాంగ్రెస్ లోనే నిల‌బ‌డ్డాడు. అది కూడా ద‌శాబ్దాల నుంచి కాంగ్రెస్ లో ప‌ని చేస్తూ ఉన్నాడు. త‌న‌తో పాటు పార్టీని కూడా బ‌లోపేతం చేశాడు. దేవేగౌడ వంటి స్వ‌కుల రాజ‌కీయ ధిగ్గ‌జంతో త‌ల‌ప‌డుతూ ఆది నుంచి పోరాట స్ఫూర్తిని చాటుకున్నాడు డీకేశి. 

క‌ర్ణాట‌క లో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గానికి చెందిన వాడు కూడా. కాంగ్రెస్ గెల‌వ‌డంలో ఆర్థిక అండ‌దండ‌లు డీకేశి వే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యంగా నిలుస్తోంది. ఇక ఎమ్మెల్యే గా కూడా డీకే శివ‌కుమార రికార్డు స్థాయి మెజారిటీని సాధించాడు క‌న‌క‌పుర నుంచి. ఐదేళ్ల కింద‌ట డెబ్బై వేల స్థాయి మెజారిటీని సాధించిన డీకేశి ఈ సారి ఏకంగా లక్ష‌కు పై స్థాయి మెజారిటీతో కొత్త రికార్డు సృష్టించాడు. ప్ర‌తి రౌండ్ లోనూ నూటికి 80 ఓట్లు డీకేశికి ద‌క్కాయి! కాబ‌ట్టి డీకే శివ‌కుమార‌ను ఏ ర‌కంగానూ త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు.

ఇక సిద్ధ‌రామ‌య్య ఇప్ప‌టికే ఐదేళ్ల పాటు సీఎంగా చేశాడు. ఆయ‌న ఐదేళ్ల పాల‌న త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాలైంది కూడా. అలాగే జేడీఎస్- కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం వెనుక కూడా సిద్ధ ఉన్నాడ‌నే ప్ర‌చారం ఉంది. అయితే రాష్ట్రంలో జ‌నాభా ప‌రంగా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న కురుబ‌ల నేత‌గా, సీనియ‌ర్ నేత‌గా సిద్ధ‌రామ‌య్య‌కు ఇమేజ్ ఉంది. డీకేశిపై అవినీతి కేసులు ఉండ‌టం సిద్ద‌రామయ్య‌కు ఉన్న అడ్వాంటేజీల్లో ఒక‌టి. 

ఈ ఇద్ద‌రు నేత‌లూ కాంగ్రెస్ హైక‌మాండ్ పై వీర విధేయ‌త‌నే చూపుతూ వ‌స్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల ప్ర‌తిపాద‌న‌లు వినిపిస్తూ ఉన్నాయి. చెరో రెండున్న‌ర సంవ‌త్స‌రం అనే ప్ర‌తిపాద‌న‌తో స‌హా ప‌లు ప్ర‌తిపాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే క‌ర్ణాట‌క రాజ‌కీయంలో ఇలాంటి ఒప్పందాల‌కు విలువ లేకుండా పోయి చాలా కాలం అయ్యింది. అందుకే ఇద్ద‌రిలో ఇప్పుడు ఎవ‌రికి పీఠం ద‌క్కుతుంద‌నేది హాట్ టాపిక్. 

ఎలాగూ 130 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారు కాబ‌ట్టి.. సీఎం ఎవ‌ర‌నే ఫ‌జిల్ వారికే అప్ప‌గించేస్తే కాంగ్రెస్ హైక‌మాండ్ స‌రైన ప్రజాస్వామ్య పోక‌డ‌ను అనుస‌రించిన‌ట్టుగా అవుతుంది. సీఎల్పీ భేటీని నిర్వ‌హించి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే అంశంపై ఈ ఇద్ద‌రి నేత‌ల అభ్య‌ర్థిత్వాల‌తో బ్యాలెట్ ఓటింగ్ ను నిర్వ‌హిస్తే మెజారిటీ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తును పొందిన వారిని సీఎంగా ప్ర‌క‌టించేయ‌వ‌చ్చు! అలా చేస్తే ఎవ‌రినీ ప్ర‌త్యేకంగా బుజ్జ‌గించాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రి కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి ధైర్యం చేయ‌గ‌ల‌దా? అనేదే ప్ర‌శ్నార్థ‌కం! ఈ ప్ర‌తిపాద‌న ఉంద‌నయితే వార్త‌లు వ‌స్తున్నాయి.