సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తిక్కరేగితే ఒక్కోసారి ప్రభాస్ సినిమాల్నే ఎగతాళి చేసేవరకు వెళ్తారు వీళ్లు. ఇప్పుడీ అభిమానులంతా మరోసారి ప్రభాస్ ముందుకొచ్చారు. ఈసారి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రారంభంలో రిక్వెస్ట్ గా ఉన్న ఈ ప్రతిపాదన, గంటలుగడిచేకొద్దీ డిమాండ్ గా మారింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. వచ్చే నెలలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ప్రచారం మొదలైంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి ఈ సినిమాపై కాస్త తక్కువగా ఉంది. వాళ్లు ఆదిపురుష్ ను మోస్తూనే, సలార్ పై ఎక్కువగా దృష్టిపెట్టారు. ఇప్పుడు వాళ్ల లేటెస్ట్ డిమాండ్ ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలంటున్నారు.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోంది సలార్ సినిమా. పైగా ఇదొక భారీ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్. అందుకే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు. దీనికి కారణం ఆదిపురుష్ సినిమా.
ఆ సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు సలార్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాదు. అందుకే ఫ్యాన్స్ ఈ కొత్త డిమాండ్ అందుకున్నారు. ఇలా చేయడం వల్ల, ఆదిపురుష్ ఓవైపు రిలీజ్ అవ్వడంతో పాటు.. ఆ సినిమా ఇంటర్వెల్ లో సలార్ టీజర్ చూసే వెసులుబాటు కూడా దక్కుతుందనేది ఫ్యాన్స్ వాదన.
నిజానికి అభిమానులు పెట్టిన ఈ ప్రతిపాదన చాలా బాగుంది. ఎందుకంటే, గతంలో కూడా ప్రభాస్ సినిమాల విషయంలో ఇలానే జరిగింది. బాహుబలి-2తో సాహో టీజర్ ను వదిలారు. అదే విధంగా ఆదిపురుష్ సినిమాతో సలార్ టీజర్ రిలీజ్ చేయాలనేది ఫ్యాన్స్ ప్రపోజల్.
అయితే సలార్ యూనిట్ మాత్రం ప్రస్తుతానికి ఫ్యాన్స్ మాటలు వినేలా లేదు. తమ సినిమా చెప్పిన టైమ్ కే థియేటర్లలోకి వస్తుందంటూ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చిన యూనిట్.. ఆదిపురుష్ రిలీజైన కొన్ని రోజులకు టీజర్ అప్ డేట్ ఇవ్వాలని భావిస్తోంది.