ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర ఇప్పటికే ప్రకటించాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి తప్పుచేశామని, మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. ఇప్పుడు అఖిల్ వంతు. ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనే విషయాన్ని అఖిల్ కూడా పరోక్షంగా వెల్లడించాడు.
తన అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు అఖిల్. తాము అత్యుత్తమంగా ప్రయత్నించినప్పటికీ, ఏజెంట్ సినిమాతో అనుకున్న ఫలితం అందుకోలేకపోయామన్నాడు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. ఏజెంట్ కోసం పనిచేసిన కాస్ట్ అండ్ క్రూకు థ్యాంక్స్ చెప్పాడు.
ఓ మంచి సినిమా అందించలేకపోయామని తేల్చేసిన అఖిల్, తనకు బిగ్గెస్ట్ సపోర్ట్ గా నిలిచిన అనీల్ సుంకరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. అయితే లెటర్ లో ఎక్కడా దర్శకుడు సురేందర్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు.
ఏజెంట్ సినిమాను నమ్మి రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, సినిమాకు ప్రచారం కల్పించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపిన అఖిల్.. సినిమాను డైరక్ట్ చేసిన సురేందర్ రెడ్డిని మాత్రం ఆయాచితంగా మరిచిపోయాడు. మాటవరసకు కూడా అతడి పేరు ప్రస్తావించలేదు.
ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ వల్లనే తను ఇంత కష్టపడుతున్నానని, తనపై నమ్మకం ఉంచిన వాళ్లందరి కోసం మరింత బలంగా కమ్-బ్యాక్ అవుతానని తన లేఖలో స్పష్టంచేశాడు అఖిల్.
మొత్తమ్మీద ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిందని అఖిల్ అంగీకరించాడు. అయితే మెగాహీరోల టైపులో ప్రేక్షకుల్ని క్షమాపణలు మాత్రం కోరలేదు. ఇక సురేందర్ రెడ్డి ఒక్కడే మిగిలాడు. అతడు కూడా ఓ లెటర్ లేదా ట్వీట్ పడేస్తే.. అంతా కలిసి చేతులు కడిగేసుకున్నట్టవుతుంది.